Speaker Ayanna Patrudu: చట్టసభల్లో అర్థవంతమైన చర్చలకు తగ్గిన ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:05 AM
చట్టసభల్లో ప్రస్తుతం అర్థవంతమైన చర్చలకు తక్కువ ప్రాధాన్యం దక్కుతోందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
అఖిల భారత స్పీకర్ల సదస్సులో అయ్యన్నపాత్రుడు ఆవేదన
న్యూఢిల్లీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో ప్రస్తుతం అర్థవంతమైన చర్చలకు తక్కువ ప్రాధాన్యం దక్కుతోందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అరవడం, నినాదాలివ్వడం ఎక్కువ లాభదాయకమని సభ్యులు భావిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర శాసనసభ మొదటి స్పీకర్‌గా విఠల్‌భాయ్ పటేల్ ఎన్నికై వందేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం శతాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆది, సోమవారాల్లో ఢిల్లీ అసెంబ్లీలో అఖిల భారత స్పీకర్ల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో సోమవారం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ సభలో సభ్యులు ఎక్కువ రోజులు కూర్చోవాలని, నేర్చుకోవాలని సూచించారు. ఇతరులు చెప్పేవి ఓపిగ్గా వినడం అలవాటు చేసుకొని, సరైన ప్రశ్నలు అడగడం నేర్చుకోవాలన్నారు. కేవలం రాజ్యాంగ ముసాయిదాను చర్చించడానికే రాజ్యాంగ సభ మూడేళ్ల లోపు వ్యవధిలో 106 రోజులు సమావేశమైందని తెలిపారు. రాజ్యాంగ ముసాయిదా అనే ఒకే ఒక్క అంశాన్ని చర్చించడానికి ఏడాదికి సగటున 50 రోజులు సమావేశమైందన్నారు. నేడు చర్చించడానికి వేలాది అంశాలున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల శాసనసభలు సగటున ఏడాదికి 20 రోజుల కన్నా తక్కువ సమయం మాత్రమే సమావేశమవుతున్నాయని, ఇది ఆరోగ్యకరమైన ధోరణి కాదని తెలిపారు. ఏడాదిలో కనీసం 60 రోజులైనా శాసనసభను సమావేశపరిచేలా స్పీకర్లు రాష్ట్రప్రభుత్వాలను ఒప్పించే ప్రయత్నం చేయాలని సూచించారు.