Deputy Director G. Ramesh Babu: పదేళ్లలో అంతరిక్ష టూరిజం
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:40 AM
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్ష టూరిజం మరో పదేళ్లలో అందుబాటులోకి వస్తుందని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(ఎస్‌డీఎస్‌సీ)...
ఖర్చు తగ్గించే దిశగా పెద్దఎత్తున పరిశోధనలు
ఎస్‌డీఎస్‌సీ-షార్ కంట్రోలర్ అండ్ డీడీ రమేశ్
బొబ్బిలి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్ష టూరిజం మరో పదేళ్లలో అందుబాటులోకి వస్తుందని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(ఎస్‌డీఎస్‌సీ)- షార్ కంట్రోలర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ జి.రమేశ్ బాబు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని రాజా కళాశాలలో నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలకు బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పేస్ టూరిజం చాలా ఖర్చుతో కూడుకున్నదని, ఈ వ్యయాన్ని తగ్గించే దిశగా పెద్దఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. అంతరిక్ష రంగంలో వెచ్చించే ప్రతీ రూపాయి కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం ఉపయోగపడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ‘ఇతర గ్రహాల్లో జీవరాశి ఉందా? అక్కడ జీవనానికి అవకాశం ఉందా? అనే అంశాలపై పరిశోధనలు ఊపందుకున్నాయి. మైక్రో గ్రావిటీపై అన్ని దేశాల్లో పెద్దఎత్తున పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో అందుకు దీటుగా మనం కూడా అభివృద్ధి చెందాల్సి ఉంది. 2047లోగా ఇతర గ్రహాలపైకి మనం అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇస్రోతో పాటు ప్రైవేట్ సంస్థలు సైతం అంతరిక్ష పరిశోధనా రంగంలో దూసుకుపోతున్నాయి. స్టార్టప్ కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. ఇలాంటివారిని మన సీనియర్ శాస్త్రవేత్తలు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. నేడు అంతరిక్ష పరిశోధన రంగానికి బడ్జెట్‌లో 2శాతం వెచ్చిస్తున్నాం. దీన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ అనుసరించిన యుద్ధ శైలిని చూసి ప్రపంచం నివ్వెరపోయింది. సాంకేతిక బలం, ఉపగ్రహాల సహకారంతో సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా టెర్రరిస్టుల శిబిరాలపైనే దాడులు చేయగలిగాం. అంతరిక్ష యానంలో భారత్ అనేక విజయాలు సాధించింది. మనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించిన దేశాలే మన నుంచి కొనుగోలు చేసుకునే స్థితికి ఎదిగాం. గ్రహాంతర వాసుల జాడపై ఎలాంటి ఆధారాలులేవు. పూర్వీకుల నుంచి వచ్చిన ధర్మాన్ని పాటించాలి. దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీతో ముడిపెట్టకూడదు. సమాజంలో మూఢనమ్మకాలు పోవాలంటే నూరు శాతం అక్షరాస్యత చాలా అవసరం’ అని రమేశ్ వివరించారు.