ఆలస్యంపై ఆవేదన!
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:47 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరపకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. గ్రామస్థాయిలో లభించే పదవులు కావడంతో అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి వీటి ద్వారానే గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు. ఏడాదిగా ఈ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంకొంత కాలం పాటు అధికారుల పాలననే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికలు మరింత ఆలస్యం అవుతాయని ఆందోళన చెందుతున్నారు.
-పీఏసీఎస్ ఎన్నికలపై టీడీపీ శ్రేణుల ఆశలు
-ఏడాదిగా ఎదురుచూపులు.. గుర్తింపు కోసం ఆరాటం
- ఇంకొంత కాలం అధికారుల పాలనను కొనసాగిస్తూ ప్రభుత్వ నిర్ణయం
-ఇప్పటికే ఆలస్యమైంది.. మరింత జాప్యమవుతోందని ఆందోళన
-అధికారుల పాలనలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 425 పీఏసీఎస్‌లు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరపకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. గ్రామస్థాయిలో లభించే పదవులు కావడంతో అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి వీటి ద్వారానే గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు. ఏడాదిగా ఈ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంకొంత కాలం పాటు అధికారుల పాలననే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికలు మరింత ఆలస్యం అవుతాయని ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ ):
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తంగా 425 ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార సంఘాలు (పీఏసీఎస్)లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ఎన్టీఆర్ జిల్లాలో 131, కృష్ణాజిల్లాలో 213, ఏలూరు జిల్లా పరిధిలోకి వెళ్లిన నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలకు సంబంధించిన 81 పీఏసీఎస్‌లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహిస్తారని టీడీపీ శ్రేణులు ఆశించాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో పార్టీకి బాగా పనిచేసిన వారి పేర్లను తీసుకోవటంతో శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఆ తర్వాత పీఏసీఎస్ ఎన్నికల గురించి మాట్లాడకపోవడం, తాజాగా ఇంకొంత కాలం పాటు అధికారులనే ఇన్‌చార్జులుగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవటంపై టీడీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీఏసీఎస్‌లకు 2013లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఐదేళ్లకాలం పాటు సహకార సంఘాల అధ్యక్షులుగా అప్పటి కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేశారు. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ ప్రభుత్వానికి అవకాశం దక్కినా ఎన్నికల ముందు కావటంతో గ్రూపు తగాదాలకు దారితీస్తుందన్న ఉద్దేశ్యంతో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించలేదు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది.
వైసీపీ ప్రభుత్వంలో త్రిసభ్య కమిటీలు
పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ గెలుస్తుందన్న ఉద్దేశ్యంతో.. తెలివిగా త్రిసభ్య కమిటీలను వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే నియమించింది. ఈ త్రిసభ్య కమిటీల పేరుతో వైసీపీ కార్యకర్తలకు చోటు కల్పించింది. కొంతమందిని ఏడాదికి, మరికొంత మందిని రెండేళ్లకు మార్చిమార్చి అవకాశం ఇచ్చింది. ఇంకొంత మంది ఐదేళ్ల పాటు కూడా పదవిలో కొనసాగారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో దారుణమైన నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. 1964 నాటి కోఆపరేటివ్ చట్టానికి 118/సీ అనే సెక్షన్‌ను జోడించి సవరణ చేశారు. దీని ప్రకారం ప్రతి ఆరు నెలలకు రెన్యువల్ చేసే అవకాశాన్ని కల్పించారు.
గుర్తింపు కోసం ఆరాటం
పీఏసీఎస్‌లకు ఎన్నికలు కానీ, త్రిసభ్య కమిటీల నియామకం కానీ ఏదో ఒకటి త్వరగా చేయాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. గ్రామాల్లో పార్టీకి కష్టపడినందుకు తమకు ఇచ్చే గౌరవంగా భావిస్తున్నాయి. పీఏసీఎస్ అధ్యక్షులుగా పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా పెద్దగా ఉండవు. కేవలం తాను సంఘం అధ్యక్షుడిని అని గొప్పగా చెప్పుకోవాలని ఎంతో మంది ఏడాదిగా ఎదురు చూస్తున్నారు.
పదవులు కూడా కోల్పోవాల్సి వస్తోంది!
పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకపోవటంతో పెద్ద పదవులను కూడా కోల్పోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఏసీఎస్ అధ్యక్షులుగా పనిచేసే వారికి అదృష్టం కలిసివస్తే డీసీసీబీ, ఆప్కాబ్, నాప్కాబ్, నాబార్డు వంటి వాటిలో కూడా పదవులను దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఏడాది కాలంగా ఎన్నికలు నిర్వహించకపోవటంతో ఏ పదవులను అందుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా వైసీపీ వారు ఇంకా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కూడా తమకు అవకాశం ఉన్నా పదవులు ఇవ్వకపోవటంపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు.