Share News

Kuppam: కన్నతల్లిని కట్టేసి నట్లు

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:48 AM

కన్న తల్లిని స్వయంగా కన్నకొడుకే విద్యుత్‌ స్తంభానికి కట్టేసి.. ఆపై సవతి సోదరుడే ఆ పని చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి కూడా ఈ హైడ్రామాలో...

Kuppam: కన్నతల్లిని కట్టేసి నట్లు

  • ఆస్తి కోసం తల్లితో కలిసి కొడుకు హైడ్రామా

  • ఆపై పోలీసులకు ఫిర్యాదు.. బెడిసికొట్టిన పన్నాగం

కుప్పం/శాంతిపురం, జూలై 14(ఆంధ్రజ్యోతి): కన్న తల్లిని స్వయంగా కన్నకొడుకే విద్యుత్‌ స్తంభానికి కట్టేసి.. ఆపై సవతి సోదరుడే ఆ పని చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి కూడా ఈ హైడ్రామాలో పాలుపంచుకున్నట్లు తర్వాత పోలీసుల విచారణలో తేలింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ పార్థసారథి, స్థానికుల కథనం మేరకు.. శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీ తంబిగానిపల్లెలో మునెప్పకు మునెమ్మ, గంగమ్మ అనే ఇద్దరు భార్యలు. మునెమ్మ గతంలోనే మృతి చెందింది. ఆమెకు మంజునాథ్‌ అనే కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం జీవించి ఉన్న గంగమ్మకు సురేశ్‌ అనే కొడుకు ఉన్నాడు. సంతానానికి మునెప్ప ఎప్పుడో ఆస్తిని పంచి తన కోసం ఎకరా పొలం ఉంచుకున్నాడు. గంగమ్మ కొడుకు ఈ భూమిని సాగు చేసుకుంటున్నాడు. మునెప్ప వారం క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆయనకున్న ఎకరం భూమిలో తమకూ వాటా కావాలంటూ సురేశ్‌ను మంజునాథ్‌ డిమాండ్‌ చేశాడు. మంజునాథ్‌ భార్య ధనమ్మ, కుమార్తె కాంతమ్మ సోమవారం.. సురేశ్‌ సాగు చేస్తున్న ఎకరం దగ్గరకు వచ్చి.. తమకు భాగం పెట్టాలని డిమాండ్‌ చేశారు. దీంతో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ధనమ్మ, కాంతమ్మ వెళ్లిపోయిన తర్వాత సురేశ్‌.. గంగమ్మను పొలంలోనే ఉన్న విద్యుత్తు స్తంభానికి డ్రిప్‌ పైపులతో కట్టేశాడు. ఆపై వీడియో తీసి.. తన తల్లిని మంజునాథ్‌ కుటుంబం హింసించిందంటూ రాళ్లబూదుగూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా డ్రామా అని తేలింది. తప్పుడు ఫిర్యాదు చేసిన సురేశ్‌ కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు కుప్పం రూరల్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌, రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేశ్‌ తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించడానికి ఇటువంటి సంఘటనలను కొందరు వినియోగించుకుని వైరల్‌ చేస్తున్నారని డీఎస్పీ పార్థసారథి అన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 05:50 AM