Share News

Amalapuram: కన్నతండ్రినే కారుతో గుద్దించి..

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:52 AM

తండ్రిని చంపేస్తే అతని పేరిట ఉన్న బీమా సొమ్ము వస్తుందన్న దురాశతో కన్న కొడుకే తండ్రిని కారుతో గుద్దించి చంపాలని కుట్రపన్నాడు.

Amalapuram: కన్నతండ్రినే కారుతో గుద్దించి..

  • ‘ఇన్సూరెన్సు’ కోసం కడతేర్చబోయిన కొడుకు

  • ప్రాణాలతో బయటపడ్డ తండ్రి.. నిందితుడు వైసీపీ నేత.. అరెస్టు

అమలాపురం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): తండ్రిని చంపేస్తే అతని పేరిట ఉన్న బీమా సొమ్ము వస్తుందన్న దురాశతో కన్న కొడుకే తండ్రిని కారుతో గుద్దించి చంపాలని కుట్రపన్నాడు. అయితే, తండ్రి ప్రమాదం నుంచి బయటపడగా.. పోలీసుల విచారణలో కొడుకే నిందితుడని తేలడంతో అతడిని అరెస్టు చేశారు. వివరాలివీ.. కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ శివారు కామనగరువు హైవేపై ఏప్రిల్‌ 21న మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తున్న విప్పర్తి వెంకటరమణను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయినట్టు అతడి తనయుడు, వైసీపీలో చురుకైన పాత్ర వహిస్తున్న, అమలాపురం మండలం సాకుర్రు గ్రామానికి చెందిన విప్పర్తి హర్షవర్ధన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వెంకటరమణ కొన్నిరోజుల పాటు అపస్మారక స్థితిలో ఉండి ఇటీవల కోలుకున్నారు.


jagan.jpg

ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని ఒకచోట యాక్సిడెంట్‌ చేసిన కారును నాలుగురోజుల పాటు నిలిపి ఉంచడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో వెంకటరమణను కడతేర్చబోయింది అతడి కొడుకేనని తేలింది. ఓ కంపెనీ నుంచి తండ్రి పేరిట రూ.13లక్షల రుణం తీసుకున్న హర్షవర్ధన్‌, అందుకు తగ్గట్టు బీమా చేయించి ప్రీమియం చెల్లించాడు. ఈ క్రమంలో తండ్రి వెంటరమణను చంపేస్తే ఇన్సూరెన్సు సొమ్ము వస్తుందన్న దురాశతో ఈవిధంగా పథక రచన చేసినట్టు అతడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. నిందితుడు విప్పర్తి హర్షవర్ధన్‌ను శనివారం అరెస్టుచేసి కోర్టులో హాజరు పరిచినట్టు అమలాపురం తాలూకా ఎస్‌ఐ వై.శేఖర్‌బాబు తెలిపారు. ఈ ఘటన తర్వాత, గత సీఎం జగన్‌తోపాటు, అమలాపురంలోని వైసీపీ కీలక నాయకులతో సంబంధాలు కలిగి ఉన్న హర్షవర్ధన్‌ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - Aug 03 , 2025 | 07:13 AM