Money Dispute: కన్నతల్లిని చంపిన డబ్బు పిచ్చి!
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:16 AM
పోలియో బాధితురాలైనప్పటికీ కష్టపడి ఉపాధ్యాయురాలిగా ఎదిగారు. భర్తకు సరైన ఉపాధి లేకపోయినా.. తన జీతంతో ఇంటిని నిలబెట్టారు....
డబ్బులివ్వలేదని కత్తితో గొంతుకోసిన కొడుకు
గారాబంగా పెంచడమే పాపం
హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి తల్లితో గొడవపడి హత్య
తండ్రి బెడ్‌రూమ్‌లో ఉండగా గడియపెట్టి దారుణం
తర్వాత ఇంట్లోకి వెళ్లి సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ నవ్వులు
పోలియో బాధిత ఉపాధ్యాయురాలి త్యాగాలకు బహుమానం
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం
ప్రొద్దుటూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పోలియో బాధితురాలైనప్పటికీ కష్టపడి ఉపాధ్యాయురాలిగా ఎదిగారు. భర్తకు సరైన ఉపాధి లేకపోయినా.. తన జీతంతో ఇంటిని నిలబెట్టారు. ఒక్కగానొక్క కొడుకును ఎంతో గారాబంగా పెంచారు. ఉన్నత చదువులు చదివించారు. కానీ ఆమె త్యాగాలకు విలువలేకుండా పోయింది. డబ్బులివ్వలేదని కన్నబిడ్డే.. కనికరం లేకుండా ఆమెను కత్తితో గొంతు కోసి చంపేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం జరిగిందీ దారుణం. పోలీసుల కథనం మేరకు.. ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్‌రెడ్డినగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసే ఉప్పలపాటి లక్ష్మీదేవి (52)ని ప్రొద్దుటూరు శ్రీరామ్‌నగర్‌లో ఉన్న తమ ఇంట్లోనే ఆమెను కన్న కొడుకు యశ్వంత్‌రెడ్డి (26) గొంతుకోసి చంపేశాడు. ఉదయమే హైదరాబాద్ నుంచి వచ్చిన యశ్వంత్.. అప్పటికి తండ్రి విజయభాస్కర్‌రెడ్డి బెడ్‌రూములో ఉండగా గడియ పెట్టాడు. ఆ తర్వాత తల్లిని చంపి, మృతదేహాన్ని వంట గది నుంచి ఈడ్చుకొచ్చి కాంపౌండ్‌లో పడేశాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకోని హెడ్‌ఫోన్స్ పెట్టుకుని సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ కూర్చున్నాడు. నీ భార్యను చంపాను అని గట్టిగా అరవడంతో నివ్వెరపోయిన తండ్రి కేకలు వేశాడు. లక్ష్మీదేవి మృతదేహం నుంచి రక్తం రోడ్డుపైకి రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వన్‌టౌన్ సీఐ తిమ్మారెడ్డి తలుపులు పగుల గొట్టి యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ నవ్వుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. తండ్రి విజయభాస్కర్‌రెడ్డిని గదిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. హత్య తీటౌన్ పరిధిలో జరగడంతో త్రీటౌన్ పోలీసులు కేసును విచారిస్తున్నారు.
ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగం లేక...
యశ్వంత్ నాలుగేళ్ల క్రితం బీటెక్ పూర్తవడంతో జాబ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తల్లి నెలనెలా ఖర్చులకు డబ్బు పంపేవారు. ఈ క్రమంలో సినిమాలో నటించాలని చెబుతుండేవాడని కుటుంబ సభ్యులు, చుట్లుపక్కల వాళ్లు తెలిపారు. ఉద్యోగం వద్దు ఏమీ వద్దు ఇంటికి వచ్చేయాలని తల్లి అంటుంటే అతడు డబ్బు కోసం తరచూ ఆమెను వేధించేవాడని చెబుతున్నారు. గత నెలలో రూ.10 వేలు పంపినా మళ్లీ డబ్బులు అడగటంతో ఆమె మూడు వేలే పంపారు. దీంతో తల్లిపై కక్ష పెట్టుకుని హైదరాబాద్ నుంచి వచ్చి వాగ్వాదం పెట్టుకొని, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి చంపాడు.
రెండు కాళ్లూ సరిగా లేకున్నా...
లక్ష్మీదేవికి పుట్టుకతోనే పోలియో. రెండు కాళ్లూ సరిగా లేకున్నా, కష్టపడి టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆమెను రోజూ భర్త విజయ్‌భాస్కరరెడ్డి స్కూలుకు తీసుకువెళ్లి, మళ్లీ తీసుకొస్తుంటారు. ఆయన మొదట్లో సరైన ఉపాధి లేక పెయింట్ పని చేసేవారు. ఆ తర్వాత బార్‌లో పనిచేసేవారు. లక్ష్మీదేవి కష్టంతో కష్టపడి శ్రీరాంనగర్‌లో సొంత ఇల్లు కొనుక్కున్నారు. కొడుకును అల్లారు ముద్దుగా పెంచుకుని లక్షలు ఖర్చు పెట్టి చెన్నైలో ఇంటర్, బీటెక్ చదివించారు. అతడికి ఉద్యోగం రాకున్నా నాలుగేళ్లుగా వేలకు వేలు ఇచ్చి పోషిస్తున్నారు. ఇటీవల లక్ష్మీదేవి కింద పడి కాలికి గాయమై మూడు నెలలు బెడ్ రెస్టులో ఉన్నారు. అలాంటప్పుడు కూడా ఆమెను చూడ్డానికి యశ్వంత్ రాలేదని బంధువులు, చుట్టుపక్కల వారు చెబుతున్నారు. దీంతో భార్యను చూసుకోవడానికి విజయభాస్కరరెడ్డి పని మానేసి ఇంటి వద్దనే ఉంటున్నారు.