Pendlimarri: కాడెద్దులుగా కొడుకు, కూతురు
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:38 AM
అతివృష్టి, అనావృష్టితో నష్టపోతున్న రైతన్నలు సొంత పొలంలో వ్యవసాయం చేయాలన్నా సాగు పెట్టుబడి భారమవుతోంది. కలుపు తీసేందుకు కూలి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి.
పెండ్లిమర్రి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): అతివృష్టి, అనావృష్టితో నష్టపోతున్న రైతన్నలు సొంత పొలంలో వ్యవసాయం చేయాలన్నా సాగు పెట్టుబడి భారమవుతోంది. కలుపు తీసేందుకు కూలి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో వైఎస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మమ్ముసిద్దుపల్లె గ్రామానికి చెందిన రైతు బండి చంద్రశేఖర్‌రెడ్డి తన కొడుకు ప్రహ్లాదరెడ్డి, కూతురు చామంతిని కాడెద్దులుగా కట్టి పొలంలో కలుపు తీశాడు. ఈయనకు మొత్తం 9.5 ఎకరాల పొలం ఉంది. ఇందులో 3 ఎకరాలలో చామంతి సాగు చేశారు. ఒక్కో ఎకరానికి దాదాపు రూ.70 వేలు ఖర్చు అవుతుంది. నాలుగైదుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. ఎకరా కలుపు తీయడానికి రూ.1500 అవుతుంది. ఈ నేపథ్యంలో సాగు ఖర్చు తగ్గించుకోవడానికి రైతు ఇలా తమ చామంతి తోటలో కొడుకు, కూతురును కాడెద్దులుగా మార్చుకున్నాడు. కాగా.. ఈయన పిల్లలిద్దరూ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నారు.