Son Abandonment: కన్న తండ్రిని గోతిలో పడేసి పోయారు
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:37 AM
కనిపెంచిన కన్నతండ్రి పట్ల కొడుకులే నిర్దయగా ప్రవర్తించారు. ఏడుపదుల వయస్ను తండ్రిని వదిలించుకునే క్రమంలో..
దసరా సమయంలో వదిలించుకున్న కొడుకులు
ఆశ్రయం కల్పించిన రెడ్ క్రాస్ సిబ్బంది
పెదవాల్తేరు (విశాఖపట్నం), అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కనిపెంచిన కన్నతండ్రి పట్ల కొడుకులే నిర్దయగా ప్రవర్తించారు. ఏడుపదుల వయస్ను తండ్రిని వదిలించుకునే క్రమంలో.. సినిమా షూటింగ్ చూపిస్తామంటూ ఆయన నగరానికి తీసుకువచ్చి రహదారి పక్కన గోతిలో పడేసి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో రెడ్‌క్రాస్ సిబ్బంది ఆయనకు ఆశ్రయం కల్పించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన నందమూడు భాస్కరరావు (70), దమయంతి దంపతులకు ముగ్గురు కుమారులు. దసరా సమయంలో సినిమా ఘాటింగ్ చూపిస్తామంటూ తండ్రిని విశాఖ నగరానికి తీసుకొచ్చారు. అగనంపూడి సమీపంలోని శనివాడ-స్టీల్‌ప్లాంటు రహదారి పక్కన పెద్దగోతిలో పడేసి వెళ్లిపోయారు. భోజనం లేక ఆకలితో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన్ను స్థానికులు గుర్తించి, గోతిలో నుంచి తీసి ఆహారం అందించారు. ఈ విషయాన్ని సింధు ప్రియ అనే మహిళ పెదవాల్తేరులోని ఉన్న రెడ్ క్రాస్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని వృద్ధుడిని షెల్టర్‌లెస్ హోమ్‌కు తరలించారు.