Share News

Rajamahendravaram: అనూహ్య ఎంపిక!

ABN , Publish Date - Mar 11 , 2025 | 06:34 AM

మ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును మరోసారి మండలి పదవి వరించింది.

Rajamahendravaram: అనూహ్య ఎంపిక!

  • ఆకస్మికంగా తెరపైకి సోము వీర్రాజు

  • ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం ఖరారు

రాజమహేంద్రవరం/అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును మరోసారి మండలి పదవి వరించింది. అనూహ్యంగా ఆయన పేరును అధిష్ఠానం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు బీ ఫాం పంపింది. దీంతో టీడీపీ కూటమి నేతలతో కలిసి వీర్రాజు నామినేషన్‌ వేశారు. గతంలో 2014లో కూడా టీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయనకు తొలిసారి మండలి సభ్యత్వం దక్కింది. పదవీ కాలం ముగిశాక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన వీర్రాజు.. 2024 ఎన్నికల్లో రాజమహేంద్రవరం అర్బన్‌ లేదా రూరల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ప్రయత్నించారు. అయితే సిటింగ్‌ స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వలేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేయడంతో ఆయన ఆశలు ఫలించలేదు. తాజాగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడంతో తమ పార్టీకీ ఒక సీటు కేటాయించాలని బీజేపీ పెద్దలు కోరారు. ఆయన సమ్మతించడంతో వీర్రాజును ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది.


టీడీపీ బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో బీజేపీలోనూ బీసీలకే అవకాశం లభిస్తుందని పార్టీ శ్రేణులు తొలుత భావించాయి. వీర్రాజు, మాధవ్‌ గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసినందున ఈ దఫా పాకా సత్యనారాయణకు తప్పక అవకాశం ఉంటుందని చర్చ జరిగింది. రాజకీయాల నుంచి రెండేళ్లలో వైదొలగుతానని మూడేళ్ల క్రితం వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత సోషల్‌ మీడియా గ్రూపుల్లో వైరల్‌ కూడా అయ్యాయి. అయితే అనూహ్యంగా అధిష్ఠానం ఆయన్ను ఎంపిక చేసింది. దీనిపై పార్టీలోని ఒక వర్గం హర్షం వ్యక్తం చేయగా.. మరో వర్గం మా పార్టీలో ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానిస్తోంది. సోమవారం మధ్యాహ్నం నామినేషన్‌ దాఖలు చేశాక.. చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వీర్రాజు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్యేలు పార్థసారథి, విష్ణుకుమార్‌రాజు, ఆదినారాయణరెడ్డి, ఈశ్వరరావుతో కలిసి అసెంబ్లీలోని సీఎం కార్యాలయానికి వెళ్లారు. ‘మీ పార్టీ పెద్దలు ఒక ఎమ్మెల్సీ కావాలని అడిగారు.. కాదనలేకపోయా’ అని ముఖ్యమంత్రి వీర్రాజుతో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన్ను అభినందించారు.

Updated Date - Mar 11 , 2025 | 06:35 AM