Share News

పటిష్ట ఏర్పాట్లు

ABN , Publish Date - Sep 29 , 2025 | 01:21 AM

శరన్నవరాత్రుల్లో కీలక ఘట్టం సోమవారం ఆవిష్కృతం కానుంది. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా రోజున దుర్గమ్మను సరస్వతీదేవిగా అలంకరిస్తారు. అమ్మ మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. దీంతో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

పటిష్ట ఏర్పాట్లు

-నేడు మూలా నక్షత్రం

-సరస్వతీదేవిగా దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ

- 2.50 లక్షల మంది వస్తారని అంచనా

- 50 డ్రోన్లతో నిరంతరం నిఘా

శరన్నవరాత్రుల్లో కీలక ఘట్టం సోమవారం ఆవిష్కృతం కానుంది. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా రోజున దుర్గమ్మను సరస్వతీదేవిగా అలంకరిస్తారు. అమ్మ మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. దీంతో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి దేశ నలు మూలల నుంచి భక్తులు భారీగా వస్తారు. ముఖ్యంగా తెలుగు రాషా్ట్రల నుంచి అత్యధికంగా భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఇలా వచ్చిన భక్తుల కోసం దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు వ్యూహాత్మక బందోబస్తును సిద్ధం చేశారు. ఆదివారం రాత్రి దర్శనాన్ని వినాయకుడి ఆలయం వద్ద రాత్రి 9.30-10 గంటలకు ఆపేశారు. ప్రధానాలయం మూసివేసిన తర్వాత క్యూలైన్లలోకి భక్తులను అనుమతించారు. క్యూలు నిండిన తర్వాత వీఎంసీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్లలోకి భక్తులను పంపారు. భక్తుల కోసం రెండు హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. వీఎంసీ ఎదురుగా 30 కంపార్టుమెంట్లు, వీఎంసీకి వెనుక వైపున 30 కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశారు. వినాయకుడి ఆలయం నుంచి వచ్చిన వారిని వీఎంసీ ముందు నుంచి వెనుక వైపున ఉన్న కంపార్టుమెంట్లలోకి పంపుతారు. అక్కడి నుంచి వీఎంసీ ఎదురుగా ఉన్న కంపార్టుమెంట్లలోకి పంపుతారు. అక్కడి నుంచి క్యూల్లోకి వదులుతారు. ఇలా హోల్డింగ్‌ పాయింట్లలో ఉండే భక్తుల కోసం లక్ష బిస్కెట్లను, మంచినీళ్ల సీసాలను పోలీసు శాఖ సిద్ధం చేసింది. మొత్తం 2.50 లక్షల మంది భక్తులు ఈసారి మూలా నక్షత్రం రోజున దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీని గగనతలం నుంచ ప్రత్యక్షంగా వీక్షించి అంచనా వేయడానికి 50 డ్రోన్లను రంగంలోకి దింపారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు 42 డ్రోన్లను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. తాజాగా మరో ఎనిమిది డ్రోన్లను తీసుకొచ్చారు. మొత్తం 17 ప్రదేశాలపై వాటితో గగనతలం నుంచి నిఘా పెడుతున్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, సీతమ్మవారి పాదాలు, పున్నమిఘాట్‌, కుమ్మరిపాలెం, ఇంద్రకీలాద్రి వెనుక వైపు ప్రాంతాల్లో డ్రోన్లను నిరంతరం గగనతలంలో ఉంచుతారు. మూల నక్షత్రం కారణంగా ఇంద్రకీలాద్రితోపాటు దిగువ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఘాట్‌ రోడ్డు మీదకు కేవలం వీవీఐపీల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

4 లక్షల లడ్డూలు సిద్ధం

మూలానక్షత్రం సందర్భంగా భక్తులందరికీ ఉచిత లడ్డూ ప్రసాదం అందించనున్నారు. మొత్తం నాలుగు లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. లడ్డూ పరిమాణం 20 గ్రాములు మాత్రమే ఉంటుంది. కొండమీదకు వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనం చేసుకుని వెళ్లే సమయంలో లడ్డూలను అందిస్తారు. పెద్ద లడ్డూలను మాత్రం లక్ష వరకు సిద్ధం చేసి ఉంచారు. అమ్మవారి అన్నదానం కూడా ప్రతి రోజూ 25 వేల నుంచి 35 వేల వరకు జరుగుతోంది. మూలానక్షత్రం రోజున మాత్రం లక్ష మంది అన్న ప్రసాదం స్వీకరించే అవకాశం ఉన్నందున ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Sep 29 , 2025 | 01:21 AM