Tej Bharadwaj: యుద్ధ విన్యాసాలు చేస్తూ సైనికుడి మృతి
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:00 AM
రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు నగరంలోని సంగడిగుంటకు చెందిన సైనికుడు తేజ్ భరద్వాజ్(40) మృతి చెందారు.
గుంటూరు చేరిన పార్థివ దేహం
నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
గుంటూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు నగరంలోని సంగడిగుంటకు చెందిన సైనికుడు తేజ్ భరద్వాజ్(40) మృతి చెందారు. యుద్ధ విన్యాసాల్లో భాగంగా భరద్వాజ్ సైనిక వాహనంలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దేశసేవపై భరద్వాజ్ విద్యార్థి దశలోనే మక్కువ పెంచుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంతో కష్టపడి సైన్యంలో చేరాడని, అర్ధంతరంగా దూరమైపోతాడని ఊహించలేదని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, భరద్వాజ్ పార్థివదేహం మంగళవారం సాయంత్రం రాజస్థాన్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి గుంటూరులోని ఆయన స్వగృహానికి తరలించారు. బుధవారం భరద్వాజ్ పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులు సందర్శించిన అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్.గుణశీల తెలిపారు.