Share News

Solar Project Controversy: సూర్య ఘర్‌కు మాస్క్‌ మస్కా

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:37 AM

అత్యాశ నిండిన అక్రమార్కులు ‘ముఠా’ కట్టారు! ఏకంగా 8 వేల కోట్ల ప్రాజెక్టుపై కన్నేశారు. అమరావతిలో కీలకస్థానంలో ఉన్న అధికారి, నెడ్‌క్యా్‌పలోని మరో ముఖ్య అధికారి కలిసి భారీ దోపిడీకి తెరలేపారు.

Solar Project Controversy: సూర్య ఘర్‌కు మాస్క్‌ మస్కా

  • మాస్క్‌ల కంపెనీకి 8 వేల కోట్ల ప్రాజెక్టు

  • ముఠా కట్టిన ఉన్నతస్థాయి అధికారులు, ఎమ్మెల్యే

  • అస్మదీయ కంపెనీకి ఇన్‌స్టలేషన్‌ సర్వీస్‌ బాధ్యతలు

  • టెండర్లు లేవు, ఎంపిక పద్ధతులూ తెలియవు

  • నెడ్‌క్యాప్‌ ఎండీ నిర్ణయం.. మెప్మా ఎండీకి లేఖ

  • సహకరించాలంటూ జిల్లా స్థాయి సిబ్బందికి హుకుం

  • ప్రభుత్వ వాహనంలో ‘ప్రైవేటు’ ప్రతినిధి టూర్లు

  • సహకారం కోసం ఎమ్మెల్యేలతో సమావేశాలు

  • సూర్యుడినీ వదల్లేదు

రూ.8వేల కోట్ల విలువైన ప్రాజెక్టును.. టెండర్లు పిలవకుండా, పద్ధతులు పాటించకుండా అప్పగించవచ్చా?

ప్రైవేటు కాంట్రాక్టరు, వ్యాపారి... ‘ప్రభుత్వ వాహనం’లో తిరుగుతూ ఎమ్మెల్యేలు, అధికారులపై పెత్తనం చేయొచ్చా?

మాస్కులు తయారు చేసే కంపెనీ ఎలాంటి అనుభవం లేకుండానే రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ఫలకాలు ఏర్పాటు చేయగలదా?

మీరు నమ్మండి... నమ్మకపోండి! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘సూర్యఘర్‌’ ప్రాజెక్టులో ఈ చిత్రాలన్నీ జరుగుతున్నాయి. ఉన్నత స్థాయిలో కొందరు అధికారులు కుమ్మక్కు కావడంతో అడ్డగోలు వ్యవహారాలకు తెరలేచింది!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అత్యాశ నిండిన అక్రమార్కులు ‘ముఠా’ కట్టారు! ఏకంగా 8 వేల కోట్ల ప్రాజెక్టుపై కన్నేశారు. అమరావతిలో కీలకస్థానంలో ఉన్న అధికారి, నెడ్‌క్యా్‌పలోని మరో ముఖ్య అధికారి కలిసి భారీ దోపిడీకి తెరలేపారు. మాస్క్‌లు తయారు చేసుకునే ఓ కంపెనీని తెరమీదకు తీసుకొచ్చి... దానికి సోలార్‌ ప్యానల్‌ ప్రాజెక్టుపై ప్రచారం, ఇన్‌స్టలేషన్‌ బాధ్యతలు అప్పగించారు. ఆ కంపెనీతో కలిసి పనిచేయాలంటూ... నెడ్‌క్యాప్‌, మెప్మా సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ఆ ప్రైవేటు కంపెనీ ప్రతినిధికి ఓ ప్రభుత్వ వాహనం ఇచ్చి జిల్లాలకు పంపిస్తున్నారు. అంతటితో ఆగకుండా... ‘కంపెనీ మనోళ్లదే. సహకరించండి’ అంటూ అధికారపార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్‌లూ వెళ్తున్నాయి. కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం-సూర్యఘర్‌’ ప్రాజెక్టులో జరుగుతున్న తంతు ఇది!


అసలేమిటీ పథకం...

ఇంటి పైకప్పు మీద సోలార్‌ ప్యానెళ్లు బిగించుకుని... 1 కే డబ్ల్యూ నుంచి 3 కేడబ్ల్యూ వరకు విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా రూపొందించిన పథకమే... ‘పీఎం సూర్యఘర్‌’! 2026-27 నాటికి దేశవ్యాప్తంగా కనీసం కోటి ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌లు బిగించాలన్నది కేంద్రం లక్ష్యం. ఏపీలో ఒక్కో నియోజకవర్గంలో సగటున 10వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి... మొత్తంగా 17.5 లక్షల ఇళ్లపైన సోలార్‌ ప్యానెళ్లు బిగించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో ఒక్కో యూనిట్‌ ధర (3కేడబ్ల్యూ పవర్‌) కనీసం 2 లక్షల రూపాయలు! ఇందులో ప్రభుత్వం గరిష్ఠంగా 78వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్రస్థాయిలో ఈ ప్రాజెక్టును డిస్కమ్‌లు అమలు చేస్తున్నాయి. ఏపీలో ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.8వేల కోట్లపైనే. ఈ ప్రాజెక్టులో సోలార్‌ ప్యానల్స్‌ ఎంపిక, ఇన్‌స్టలేషన్‌, ఇతర కీలక పనులు చేయడానికి ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ప్రాజెక్టు గురించి గ్రామీణ, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చేవారికి శిక్షణ ఇవ్వడానికి కూడా కేంద్ర నిధులు ఇస్తోంది. ప్రచారం, అవగాహన కల్పించే కంపెనీలను కూడా వాటి అర్హత, అనుభవం, నేపథ్యం ఆధారంగా ఎంపిక చేయాలి. ఈ మేరకు కేంద్రం పక్కా నియమ నిబంధనలు రూపొందించింది.


గోల్‌మాల్‌ జరిగిందిలా...

ఓ ముఖ్య అధికారి, నెడ్‌క్యా్‌పలోని మరో కీలక అధికారి కలిసి ‘సూర్యఘర్‌’పై కన్నేశారు. ప్రాజెక్టుపై అవగాహన, ప్రచారం, ఇన్‌స్టలేషన్‌ సర్వీసులు వంటి కీలక అంశాలు తమ కనుసన్నల్లో జరిగేలా ప్లాన్‌వేశారు. తొలుత ప్రచారం, అవగాహన కల్పించే పేరిట ప్రాజెక్టులోకి ప్రవేశించినా... తర్వాత సోలార్‌ రూఫ్‌టాప్‌ల ఇన్‌స్టలేషన్‌, ఇతర కీలక విభాగాలు కూడా తమ నియంత్రణ లోనే ఉండాలన్నది వారి మాస్టర్‌ప్లాన్‌. దీనికి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను జతగా కలుపుకొన్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడికి చెందిన కంపెనీని సోలార్‌ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. ఈమేరకు నెడ్‌క్యాప్‌ ఎండీతో ఓ ఉత్తర్వు ఇప్పించారు. నిజానికి పీఎం-సూర్యఘర్‌ ప్రాజెక్టుపై స్వయం సహాయక సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో లబ్ధిదారులుగా చేరాలని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాయి. అయితే... ఓ కంపెనీ పేరు సూచిస్తూ దానికి సహకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమలాకర్‌బాబు గత 28న మెప్మా మిషన్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ‘‘పీఎం-సూర్యఘర్‌ ప్రాజెక్టు అవగాహన, ఇన్‌స్టలేషన్‌ సర్వీసెస్‌ కార్యక్రమాల్లో పాల్గొంటామని ఆ కంపెనీ మాకు ప్రతిపాదన ఇచ్చింది. కాబట్టి, స్వయం సహాయక సంఘాలు అవసరం ఉన్న చోట వారి చర్యలకు సహకరించగలరు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. నెడ్‌క్యాప్‌ ఎండీ రాసిన లేఖపై మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ తేజభరత్‌ వెంటనే స్పందించారు. పీఎం సూర్యఘర్‌ అమలులో భాగంగా నెడ్‌క్యాప్‌ ఎండీ ఇచ్చిన లేఖను కోట్‌ చేస్తూ, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లకు ఆగస్టు 30న లేఖరాశారు.


అయితే, ఈ లేఖలో ఆయన ఓ వ్యూహాన్ని పాటించారు. ఎక్కడా కంపెనీ పేరు ప్రస్తావించకుండా, నెడ్‌క్యాప్‌ ఎండీ రాసిన లేఖలోని అంశాలను మాత్రమే పేర్కొన్నారు. మెప్మాకే చెందిన ఓ అధికారి జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లకు ఫోన్‌లు చేసి ఆ కంపెనీతో కలిసి పనిచేయాలని ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. నేరుగా ఎమ్మెల్యేల వద్దకు ఆ కంపెనీ ప్రతినిధిని తీసుకెళ్లి పరిచయం చేయాలని మెప్మా ఉన్నతాధికారి హుకుం జారీ చేశారు. దీని వెనుక ఒక కీలక అధికారి పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆయనే కర్త, కర్మ, క్రియగా ఉన్నారు. కంపెనీని తెరపైకి తేవడం, నెడ్‌క్యా్‌పతో ఆ కంపెనీకి వర్క్‌ ఇప్పించడం, తర్వాత ఎమ్మెల్యేల వద్దకు కంపెనీ ప్రతినిధి వెళ్లి బేరాలు.. ఇదంతా ఆ అధికారి వ్యూహంలో భాగమేనని తెలిసింది.

ఇదేనా విధానం?

‘పీఎం-సూర్యఘర్‌’ను కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో స్వయంగా ముఖ్యమంత్రి దీని అమలును పర్యవేక్షిస్తున్నారు. ఇంతటి కీలకమైన ప్రాజెక్టులో ఎవరిని పడితే వారిని ప్రచారకర్తలుగా, ఇన్‌స్టలేషన్‌ సర్వీసు ప్రొవైడర్‌లుగా ఎంపిక చేస్తారా? ఏజెన్సీల ఎంపికకు ఎలాంటి నిబంధనలు, విధానాలు లేవా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెడ్‌క్యాప్‌ ఎండీ మెప్మాకు రాసిన లేఖలోని అంశాలు విస్తుగొలుపుతున్నాయి. ప్రచారం, ఇన్‌స్టలేషన్‌ సర్వీసు చేస్తానని ఒక కంపెనీ ముందుకు రాగానే... ‘ఓకే’ చెప్పేశారట! ఆ కంపెనీని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? ఏ టెండర్‌ ద్వారా ఎంపిక చేశారు? విధి విధానాలేమిటి? ఇవేవీ ఆ లేఖలో లేవు. ఆ కంపెనీకి ఉన్న అర్హతలు, ప్రమాణాలు ఏమిటో చూడరా? ఎవరు దరఖాస్తు చేసుకున్నా పని అప్పగిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


మాస్క్‌ల కంపెనీకి సోలార్‌ పనులా?

నెడ్‌క్యాప్‌ సిఫారసు చేసిన కంపెనీ విజయవాడ కేంద్రంగానే ఏర్పాటైంది. ఆ కంపెనీ మాస్కులు తయారు చేస్తుంది. ఇంకా ఫెయిర్స్‌, షోలు నిర్వహిస్తుంది. బల్క్‌ రిటైల్‌ లాటరీ టికెట్ల విక్రయం, క్యాసినో, బెట్టింగ్‌ వంటి వ్యవహారాల్లో వేలుపెట్టినట్లు కంపెనీ ప్రొఫైల్‌ను చూస్తే స్పష్టమవుతోంది. ఈ కంపెనీకి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో కనీస అనుభవం లేదు. ఉత్పత్తి, అమ్మకాలతో పరిచయం లేదు. ఎలాంటి అనుభవం లేని ఈ కంపెనీ... సోలార్‌ పవర్‌ గురించి ప్రజలకు, ప్రత్యేకించి స్వయం సహాయక సంఘాలకు ఎలాంటి అవగాహన కల్పించగలదు? ప్రజల్లో ఎలాంటి చైతన్యం తీసుకురాగలదు?.


నిలదీసిన ఎమ్మెల్యే...

ఇటీవల మెప్మాకే చెందిన ఓ ప్రభుత్వ వాహనంలో ఆ ప్రైవేటు కంపెనీ ప్రతినిధి అనంతపురానికి వెళ్లారు. జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో మెప్మా అధికారులు మీటింగ్‌ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలో 10వేల రూఫ్‌టాప్‌ సోలార్‌ కనెక్షన్‌ల ఇన్‌స్టలేషన్‌కు సహకరించాలని ఆ కంపెనీ ప్రతినిధి కోరినట్లు తెలిసింది. ‘‘మీరు ఎవరు? ఈ కాంట్రాక్టు ఎవరిచ్చారు? ఈ వర్క్‌ మీకే ఇచ్చినట్లుగా ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇచ్చిందా?’’ అని ఆ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీంతో ఆ ప్రతినిధి నేరుగా మెప్మాలోని ఓ ఉన్నతాధికారికి ఫోన్‌ కలిపి... ఎమ్మెల్యేతో మాట్లాడించారు. ‘‘కీలక అధికారి, ఓ కీలక మంత్రి, మరి కొందరు ప్రభుత్వ పెద్దలు ఆయనతో ఉన్నారు. ఆయనకు సహకరించండి. మీ పనికూడా అవుతుంది’’ అని మెప్మా ఉన్నతాధికారి ఏదో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చింది. కంపెనీ ప్రతినిధిని వెనక్కి పంపించేసి... ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయం రచ్చకెక్కడంతో... కంపెనీ ప్రతినిధి వచ్చిన వాహనంపై ఉన్న ‘ప్రభుత్వ వాహనం’ స్టిక్కర్‌పై తెల్లటి టేప్‌ అతికించేశారు.

Updated Date - Sep 06 , 2025 | 04:41 AM