Tata Power CMD Praveer Sinha: రాష్ట్రంలో లక్ష ఇళ్లకు సౌర విద్యుత్తు
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:01 AM
రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో లక్ష ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్(సౌర విద్యుత్తు) అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు టాటా పవర్ సీఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు.
6 శాతం వడ్డీకే రుణ సదుపాయం.. టాటా పవర్ సీఎండీ ప్రవీర్ సిన్హా
విశాఖపట్నం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో లక్ష ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్(సౌర విద్యుత్తు) అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు టాటా పవర్ సీఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు. విశాఖలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో 14 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారని, కానీ వారిలో 45 వేల మందే ఇన్‌స్టాల్ చేసుకున్నారని తెలిపారు. ‘టాటా పవర్ రూఫ్ టాప్ సోలార్’ తీసుకుంటే 25 ఏళ్ల పాటు సేవలు అందిస్తుందన్నారు. మధ్య తరగతి కుటుంబాల వారు కేవలం రూ.999తోనే దీనిని అమర్చుకునే సౌలభ్యం ఉందన్నారు. కేవలం 6 శాతం వడ్డీకే అన్ని ప్రధాన బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, మొదటి ఐదేళ్లలో రుణం పూర్తిగా తీరిపోతుందని, మిగిలిన 20 ఏళ్లు ఉచితంగా విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చని వివరించారు. 20 రకాల మోడళ్లు అందుబాటులో ఉంచామన్నారు. ఈ సమావేశంలో టాటా రెన్యువబుల్స్ ప్రెసిడెంట్ సంజయ్ బంగా, రూఫ్ టాప్ చీఫ్ శివరామ్ పాల్గొన్నారు.