Share News

మట్టి మాఫియా బరితెగింపు!

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:20 AM

మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొత్తూరు చెరువులో మట్టి దందాకు తెరతీసింది. రైతు పొలం మెరక పేరుతో అనుమతి తెచ్చి అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోంది. ఐదు వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతి ఇస్తే ఏకంగా లక్ష క్యూబిక్‌ మీటర్లపైనే తవ్వేసి సొమ్ము చేసుకుంది. ప్రధానంగా ఇటుక బట్టీలు, రియల్‌ వెంచర్లకు పెద్ద ఎత్తున రవాణా చేసింది. అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా అటు వైపు కన్నెత్తి చూడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

మట్టి మాఫియా బరితెగింపు!

-కొత్తూరు చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

- పొలం మెరక చేసుకోవాలని రైతు పేరుతో దరఖాస్తు

- 5 వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతి.. తవ్వింది లక్షపైనే..

- ఇటుక బట్టీలు, రియల్‌ వెంచర్లకు పెద్ద ఎత్తున రవాణా

- రూ.లక్షల్లో దోచుకున్న అక్రమార్కులు

- ఫిర్యాదు చేసిన గ్రామస్థులు.. పత్తాలేని అధికారులు

మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొత్తూరు చెరువులో మట్టి దందాకు తెరతీసింది. రైతు పొలం మెరక పేరుతో అనుమతి తెచ్చి అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోంది. ఐదు వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతి ఇస్తే ఏకంగా లక్ష క్యూబిక్‌ మీటర్లపైనే తవ్వేసి సొమ్ము చేసుకుంది. ప్రధానంగా ఇటుక బట్టీలు, రియల్‌ వెంచర్లకు పెద్ద ఎత్తున రవాణా చేసింది. అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా అటు వైపు కన్నెత్తి చూడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ రూరల్‌ మండలం పరిధిలోని కొత్తూరు చెరువు 150 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమిని మెరక చేసుకునే నిమిత్తం ఈ చెరువులోని ఆరు వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తన సొంత ఖర్చులతో తవ్వుకోవటానికి జలవనరుల శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోగా, ఐదు వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వుకోవటానికి అనుమతి ఇచ్చారు. జూన్‌ 29వ తేదీ లోపు ఈ మట్టిని తవ్వుకోవాలని స్పష్టం చేశారు. అయితే సదరు వ్యక్తి పేరుతో ఇప్పటి వరకు లక్ష క్యూబిక్‌ మీటర్ల మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారు. గడువు దాటి పోయినా కూడా ఇంకా మట్టి తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు.

మూడు భారీ ప్రొక్లెయిన్లతో తవ్వకాలు

పొలం మెరక చేసుకోవటానికి అనుమతులు తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాల కోసం మట్టిని తరలిస్తున్నారు. మూడు భారీ ప్రొక్లెయిన్లను పెట్టి వందలాది ట్రాక్టర్లలో రేయింబవళ్లు మట్టిని రవాణా చేస్తున్నారు. ఇటుక బట్టీలు, రియల్‌ వెంచర్లకు యథేచ్ఛగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొత్తూరు చెరువు నుంచి తవ్వుతున్న మట్టిని వెలగలేరు, కొత్తూరు, షాబాద, వేమవరం తదితర గ్రామాల్లోని ఇటుక బట్టీలకు పెద్ద ఎత్తున తోలుతున్నారు. నిబంధనల ప్రకారం తన వ్యక్తిగత అవసరాల కోసం అనుమతి తీసుకున్న వ్యక్తి అర్జీ ప్రకారం కొత్తూరు తాడేపల్లిలోని సర్వే నెంబర్లు 164 - 12, 164 - 2ఏ, 175 - 3ఏలలో ఉన్న 4.94 ఎకరాల భూమిలోకే ఈ మట్టిని తరలించాల్సి ఉంది. కానీ కొత్తూరు గ్రామ సర్వే నెంబర్‌ 97/5ఏలోని 4.14 ఎకరాలు, సర్వే నెంబర్‌ 95లో 3.75 ఎకరాలు, సర్వే నెంబరు 97/5ఏలో 4.14 ఎకరాల భూముల్లో నడుస్తున్న ఇటుక బట్టీలకు నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటి వరకు సుమారు ఐదు వేల ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలించినట్టు సమాచారం. రియల్‌ వెంచర్లుగా అభివృద్ధి చేయాలనుకున్న మరికొందరి భూములకు కూడా పెద్ద ఎత్తున అక్రమంగా మట్టిని రవాణా చేశారు. కొత్తూరు గ్రామంలోనే సర్వే నెంబర్‌ 155/4లో 52 సెంట్లు, సర్వే నెంబర్‌ 155/5లో 74 సెంట్ల భూమిలోకి 400 ట్రాక్టర్లు, సర్వే నెంబర్‌ 136/3బీలో 69 సెంట్ల భూమిలో 550 ట్రాక్టర్ల మట్టి తరలించినట్టు తెలిసింది. సర్వే నెంబరు 136/2బీలో 90 సెంట్లలో 10 అడుగుల ఎత్తున మట్టి పోశారని సమాచారం. సర్వే నెంబర్‌ 84/4సీ1, 4సీ1ఏ, 4సీ1బీలలో 1.50 ఎకరాల భూమిలో 600 ట్రాక్టర్ల మట్టిని తరలించారని తెలిసింది. సర్వే నెంబరు 82/6 లో 85 సెంట్ల భూమిలో 500 ట్రాక్టర్ల మట్టి, సర్వే నెంబరు 149/10ఏలో 50 సెంట్ల భూమిలో 300 ట్రిప్పుల చొప్పున మట్టిని అక్రమంగా వ్యాపార ప్రయోజనాల కోసం తరలించి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలకు నీళ్లు

కొత్తూరు చెరువులో ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఒక క్యూబిక్‌ మీటరు లోతు వరకే పూడిక తీత పేరుతో మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. కానీ, 7-8 అడుగుల లోతున చెరువును ఎడాపెడా తవ్వేశారు. అంటే మూడు క్యూబిక్‌ మీటర్ల మేర మట్టిని అక్రమంగా తవ్వేశారు. దరఖాస్తుదారునికి రాత్రి వేళ తవ్వటానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కేవలం పగటి సమయంలో మాత్రమే తవ్వాలి. కానీ రేయింబవళ్లు తవ్వకాలు జరుపుతున్నారు. వాస్తవానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉండగా.. దీన్ని పూర్తిగా విస్మరించారు. చెరువు కట్టకు డ్యామేజీ వాటిల్లకుండా తవ్వాలి. కానీ, చెరువు కట్టకు డ్యామేజీ కలిగేలా తవ్వకాలు జరిపారు. రైతులకు సాగునీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలి. గుంతలు తవ్వకూడదు. కానీ చెరువు అంతా గుంతలమయం చేశారు. గతంలో అక్రమార్కులు మొదట్లో అనుమతులు తీసుకోకుండానే తవ్వకాలు జరిపారు. దీనిపై స్థానికులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయటంతో.. అక్రమ తవ్వకాలను గుర్తించి బాధ్యులకు రూ. లక్ష జరిమానా కూడా విధించటం జరిగింది.

పట్టించుకోని ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులు

నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతుండటంపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. మైనింగ్‌ ఏడీ వీరాస్వామికి ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఆయన పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చేసే అధికారం తమకు లేదని ఇరిగేషన్‌ శాఖ అధికారులు అంటున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో ఈ రెండు శాఖల అధికారులపైనా అనేక అనుమానాలు నెలకొంటున్నాయి.

Updated Date - Jul 07 , 2025 | 01:20 AM