Share News

మట్టి మాఫియా!

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:31 AM

నందిగామ మండలం పెద్దవరంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రకృతి సంపదను చెర పట్టింది. ఎంసీ, ఏపీఐఐసీ, అటవీ భూములే లక్ష్యంగా మట్టి తవ్వకాలు చేపట్టింది. భారీ యంత్రాలతో తవ్వి టిప్పర్లలో మట్టిని యథేచ్ఛగా నందిగామ, జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలిస్తోంది. టిప్పర్‌కు రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులే ఈ మట్టి మాఫియాగా ఏర్పడి కొండలను కరిగించి కోట్లు కొల్లగొడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

మట్టి మాఫియా!

-నందిగామ మండలం పెద్దవరంలో మట్టి తవ్వకాలు

- ఎంసీ, ఏపీఐఐసీ, అటవీ భూములే లక్ష్యంగా దందా!

- నందిగామ, జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు ప్రాంతాలకు తరలింపు

- రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు టిప్పర్‌ రూ.10 వేలు చొప్పున విక్రయం

- అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కుమ్మక్కై మరీ దోపిడీ

- దెబ్బతింటున్న రోడ్లు.. మళ్లీ ఇబ్బందుల్లో ప్రయాణికులు

నందిగామ మండలం పెద్దవరంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రకృతి సంపదను చెర పట్టింది. ఎంసీ, ఏపీఐఐసీ, అటవీ భూములే లక్ష్యంగా మట్టి తవ్వకాలు చేపట్టింది. భారీ యంత్రాలతో తవ్వి టిప్పర్లలో మట్టిని యథేచ్ఛగా నందిగామ, జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలిస్తోంది. టిప్పర్‌కు రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులే ఈ మట్టి మాఫియాగా ఏర్పడి కొండలను కరిగించి కోట్లు కొల్లగొడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి, నందిగామ):

నందిగామ మండలం పెద్దవరం పంచాయతీ పరిధిలోని ఎంసీ(మైన్యూర్‌ సర్క్యూట్‌ ల్యాండ్స్‌) భూములు, ఏపీఐఐసీ భూములు, అటవీ భూముల నుంచి మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. భారీ ఎస్కవేటర్‌ సహాయంతో రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. నిత్యం వంద టిప్పర్ల వరకూ మట్టిని వివిధ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు అదేదో తమ సొంత ఆస్తి అన్నట్లుగా మట్టిని అమ్ముతున్నారు. నందిగామ, జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు తదితర ప్రాంతాల్లోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు భారీగా మట్టిని సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క టిప్పర్‌కు యాభై నుంచి డెబ్బై టన్నుల మట్టిని లోడ్‌ చేస్తూ అందిన చోట అందిన ధరకు అమ్ముతున్నారు. నిరంతరాయంగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారానికి అడ్డు లేకుండా ఉండేందుకు గాను ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని కూడా కలుపుకొని దోపిడీ చేస్తున్నట్లు తెలిసింది. వైసీపీ నేతలు, వైసీపీకి ఓటు వేసిన వారంటే మాకు గిట్టదు అన్నట్లు సవాళ్లు విసిరే అధికార పార్టీ నాయకులు దోపిడీ విషయంలో మాత్రం అన్నదమ్ముల్లా మెసలడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీఐఐసీ భూముల్లో భారీగా గోతులు

గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెద్దవరం వద్ద 1100 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ఏపీఐఐసీ సుమారు వంద కోట్లతో ఆ భూమిని అభివృద్ధి పరిచి పరిశ్రమలకు విక్రయించేందుకు సిద్ధం చేసింది. ఆ భూముల నుంచి సైతం అక్రమార్కులు మట్టిని కొల్లగొడుతున్నారు. రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో పరిశ్రమల కోసం సిద్ధం చేసిన భూమిని గోతులమయంగా మారుస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే ఏపీఐఐసీ మరో వంద కోట్లు వెచ్చించినా ఆ భూములను పరిశ్రమల కోసం సిద్ధం చేయలేని స్థితి నెల కొంటుంది. మరో వైపు ఆధ్యాత్మికతకు, ఆహ్లాద వాతావరణానికి నెలవైన పల్లగిరి, రాఘవాపురం కొండలను కూడా కరిగించేస్తున్నారు. ఇంత పెద్దయెత్తున మట్టి దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పవిత్రమైన ఆ కొండలను నాశనం చేస్తున్నారు. ఏసీపీ, ఆర్‌డీవో, తహసీల్దార్‌, మైనింగ్‌ కార్యాలయాలకు అతి సమీపంలో ఉన్న ఈ రెండు కొండలు దోపిడీకి గురి కావడం పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు. సాధారణ ప్రజలు ఒక బొచ్చ మట్టి తెచ్చుకుంటే వెంటాడి పట్టుకొనే అఽధికారులు ఎందుకు మిన్నకుండి పోతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి అక్రమార్కుల చెర నుంచి మట్టిని రక్షించాల్సి ఉంది.

రోడ్లన్నీ మళ్లీ ధ్వంసం

వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రోడ్లకు కూటమి ప్రభుత్వం అతి కష్టం మీద ప్యాచ్‌లు వేయించింది. అవసరమైన చోట మరమ్మతులు చేయించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేసింది. భారీగా దెబ్బతిన్న చందర్లపాడు మండలం కాండ్రపాడు నుంచి నందిగామ మండలం చెర్వుకొమ్ముపాలెం వరకూ 2.8 కిలోమీటర్లు రూ.98 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. మూడు నెలల క్రితమే నిర్మించిన ఈ రోడ్డుపై అక్రమార్కులు అధిక లోడ్‌తో మట్టి అక్రమ రవాణా చేస్తుండటంతో తిరిగి దెబ్బతినే స్థితికి చేరుతోంది. నిన్నమొన్నటి వరకూ అధాన్నంగా ఉన్న రోడ్లపై అతికష్టంగా ప్రయాణించిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అందించిన సదుపాయాన్ని అక్రమార్కులు చిదిమివేస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే అధికార పార్టీ పెద్దలు, పోలీసుల పేర్లు చెప్పి ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి దోపిడీతో రూపు మారుతున్న ఏపీఐఐసీ భూములను, ఎంసీ భూములను రక్షించాల్సి ఉంది.

Updated Date - Apr 30 , 2025 | 01:31 AM