Share News

Building Permit Fraud: సాఫ్ట్‌గా.. సర్కారుకే టోకరా

ABN , Publish Date - Jul 09 , 2025 | 07:34 AM

భవన నిర్మాణ అనుమతుల జారీని వేగవంతం చేయాలి.. పట్టణ ప్రణాళికా విభాగంలో వేళ్లూనుకున్న అవినీతిని అంతమొందించాలి.. ఇదీ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం!

Building Permit Fraud: సాఫ్ట్‌గా.. సర్కారుకే టోకరా

  • భవన నిర్మాణ అనుమతుల వ్యవస్థ కూడా పక్కదారి

  • వెలుగులోకి ‘సాఫ్టెక్‌’ సిబ్బంది మోసాలు

  • లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో కుమ్మక్కు

  • ప్రభుత్వాదాయానికి పలు రకాలుగా గండి

భవన నిర్మాణ అనుమతుల జారీని వేగవంతం చేయాలి.. పట్టణ ప్రణాళికా విభాగంలో వేళ్లూనుకున్న అవినీతిని అంతమొందించాలి.. ఇదీ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం! అయితే, ప్లాన్ల అనుమతుల విషయంలో నేరుగా పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల పాత్రను తప్పించి లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల దశలోనే ప్రాథమికంగా అనుమతులిచ్చేలా సరికొత్త ఆన్‌లైన్‌ వ్యవస్థను తీసుకు వచ్చినా.. అక్రమాలు ఆగటం లేదు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన నూతన విధానాన్ని కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు. అంతకుముందు అధికారులు అవినీతికి పాల్పడితే.. ‘కొందరు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లే’.. ‘సాఫ్టెక్స్‌’ సాంకేతిక సిబ్బందితో కలిసి అవినీతికి తెరతీస్తున్నారు!

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధి ఉన్నతాధికారుల దృష్టికి ఇటీవల కాలంలో భవన నిర్మాణాల విషయంలో పలు సంఘటనలు ఫిర్యాదులుగా వస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ విభాగాల అధికారుల లాగిన్‌ ఐడీలకు కనెక్ట్‌ అవుతూ ప్రైవేటుగా అప్లికేషన్లను యాక్సెస్‌ చేస్తున్న విషయం సీఆర్‌డీఏ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. సీఆర్‌డీఏనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఈ నయా దందా జరుగుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్లాన్‌ కోసం దరఖాస్తు చేస్తే ఒక పట్టాన ఆయా పట్టణాభివృద్ధి సంస్థలకు రావటం లేదు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు అప్‌లోడ్‌ చేసిన ఫైల్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు రావాలంటే మధ్యలో సంధానకర్తగా సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ నిర్వహణను సాఫ్టెక్‌ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థకు చెందిన సాంకేతిక సిబ్బంది.. నూతన విధానంలో అవినీతికి తెరతీస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.


ఆ దరఖాస్తులే టార్గెట్‌!

నూతన భవన నిర్మాణాలకు నిబంధనల ప్రకారం ప్లాన్లకు దరఖాస్తు చేసుకునే వారి విషయంలో సమస్యలు రావటం లేదు కానీ, నిబంధనల ఉల్లంఘనకు అవకాశం ఉన్న దరఖాస్తుల విషయంలో మాత్రం సాఫ్టెక్‌కు చెందిన కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఉదాహరణకు నూతన నిబంధనల ప్రకారం 30 అడుగుల రోడ్డు తప్పనిసరి. ప్లాన్‌ కోసం దరఖాస్తు చేసుకోగానే లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ స్థాయిలో ముందుగా అనుమతి వచ్చేస్తుంది. దరఖాస్తుదారుడు ఇల్లు కట్టుకుందామనుకుంటే 30 అడుగులు రోడ్డు లేకపోతే దానికి అనుగుణంగా తన సొంత స్థలాన్ని స్థానిక పంచాయతీకి దాన పత్రంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చేముందు సీఆర్‌డీఏ టౌన్‌ప్లానింగ్‌ విభాగం నుంచి కానీ ఇతర పట్టణాభివృద్ధి సంస్థలు కానీ ఎండార్స్‌మెంట్‌ జారీ చేస్తాయి. ఈ ఎండార్స్‌మెంట్ల కోసం సీఆర్‌డీఏ, పట్టణాభివృద్ధి సంస్థల కార్యాలయాలకు వెళితేఅసలు మీ ప్లాన్‌ దరఖాస్తులే రాలేదన్న సమాధానాలు రావటంతో దరఖాస్తుదారులు విస్తుపోతున్నారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ దగ్గర అప్లికేషన్‌ను చెక్‌ చేసుకోమని చెబుతున్నారు. దీంతో సర్వేయర్‌ దగ్గరకు వెళ్లి మరో అప్లికేషన్‌ పెట్టించటం పరిపాటిగా మారుతోంది. కొంతమంది ఇంజనీర్లు, సాఫ్టెక్‌ సాంకేతిక ఉద్యోగులు కొందరు కలిసి ఈ పనులు చేయిస్తున్నారని తెలుస్తోంది.


లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ స్థాయిలో అనుమతులు వచ్చేస్తున్నాయి కాబట్టి భవన నిర్మాణదారుడు ప్లాన్‌కు తగినట్టుగా నిర్మించాల్సి ఉంటుంది. ఉల్లంఘనలకు పాల్పడితే ఆ తర్వాత టౌన్‌ప్లానింగ్‌ అధికారుల స్థాయిలో తనిఖీలు చేసేటపుడు గుర్తిస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చే అవకాశం ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు సర్వేయర్లు సాఫ్టెక్‌ ఉద్యోగులతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. దీంతో అప్లికేషన్‌ నంబర్‌ వచ్చినా.. అది సీఆర్‌డీఏ అధికారులకు వెళ్లటం లేదు. సాఫ్టెక్‌ సంస్థలో పనిచేస్తున్న అవినీతి సిబ్బంది ఆ అప్లికేషన్‌ను తెలివిగా హోల్డ్‌లో పెడతారు. ఇలా అనేకసార్లు యజమానులను ఇబ్బంది పెట్టిన తర్వాత సాఫ్టెక్‌ దగ్గర సరిచేసుకోవచ్చని సర్వేయర్‌లు చెబుతారు. భవన నిర్మాణదారులు సాఫ్టెక్‌ సిబ్బందిని ఆశ్రయించగానే.. సీఆర్‌డీఏ, పట్టణాభివృద్ధి సంస్థల లాగిన్లలో దరఖాస్తు కనిపిస్తుంది. బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆపై స్థాయి అధికారుల లాగిన్‌ ఐడీల ద్వారా అప్లికేషన్లను యాక్సెస్‌ చేస్తున్నారనే అంశాలు పట్టణాభివృద్ధి సంస్థల అధికారుల దృష్టికి వచ్చాయి. ప్లాన్‌ అనుమతి ఇచ్చిన తర్వాత, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన తర్వాత ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి. ప్లాన్‌కు అనుగుణంగానే నిర్మాణాలు సాగినట్టుగా కొలతలను నిర్దేశిస్తూ డిజైన్లను మార్చుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలుగా ఆన్‌లైన్‌లో సక్రమ కట్టడాలుగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి నష్టంకలిగించే విధంగా కొలతలను కుదించేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!

Updated Date - Jul 09 , 2025 | 07:34 AM