Dola Shri Balaveeranjaneya Swamy: సాంఘిక సంక్షేమశాఖ అంటే అంత అలుసా?
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:22 AM
హెచ్‌వోడీలు నోడల్ ఏజెన్సీ సమావేశానికి ఎందుకు రారు? సాంఘిక సంక్షేమశాఖ అంటే అధికారులకు అంత చిన్నచూపా....
నోడల్ ఏజెన్సీ సమావేశానికి ఎందుకు రారు?
నిధుల వినియోగంలో అలసత్వాన్ని సహించం
అధికారుల తీరుపై మంత్రి డోలా ఆగ్రహం
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘హెచ్‌వోడీలు నోడల్ ఏజెన్సీ సమావేశానికి ఎందుకు రారు? సాంఘిక సంక్షేమశాఖ అంటే అధికారులకు అంత చిన్నచూపా? అంటూ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అధికారుల గైర్హాజరుపై మండిపడ్డారు. సోమవారం సాంఘిక సంక్షేమశాఖ నోడల్ ఏజెన్సీ సమావేశం సచివాలయంలో మంత్రి అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశానికి పలు శాఖలకు సంబంధించిన హెచ్‌వోడీలు హాజరుకాకపోవడంపై ఆయన నిలదీశారు. హెచ్‌వోడీలు సమావేశానికి రాకపోవడం పేద, బలహీనవర్గాల ప్రజల పట్ల వారికున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఇకపై ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఈ ఏడాది ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై శాఖల వారీగా వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ముగుస్తున్నా... కొన్ని శాఖలు సబ్‌ప్లాన్ నిధుల వినియోగంలో ఎందుకు వెనుకబడ్డాయని ప్రశ్నించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు నూరుశాతం ఖర్చు చేయాలని, నిధుల వినియోగంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. సబ్‌ప్లాన్ నిధుల వినియోగానికి అంచనాలు రూపొందించేటప్పుడు ఊహాగానాలతో లెక్కలు వేయకుండా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నిర్దిష్టమైన ప్రణాళికలతో అంచనాలు రూపొందించాలని నిర్దేశించారు.