Share News

Social Media Sparks Wave of Wedding Cancellations: ముహూర్తపు బంధాలపై సోషల్‌ మీడియా పిడుగు

ABN , Publish Date - Dec 16 , 2025 | 04:03 AM

పెళ్లంటే నూరేళ్ల బంధం. రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు.. అనుమానాలు, అపోహలకు తావులేకుండా పెద్దలు కుదిర్చిన వివాహ బంధంలో అమ్మాయి, అబ్బాయి చక్కగా ఇమిడిపోయేవారు. కొండొకచో.......

Social Media Sparks Wave of Wedding Cancellations: ముహూర్తపు బంధాలపై సోషల్‌ మీడియా పిడుగు

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సురేశ్‌ (పేర్లు మార్చాం), బ్యాంక్‌ ఉద్యోగిని శైలజల పెళ్లి కుదిరింది. పట్టుచీరలు, బంగారం కొనడం, శుభలేఖలు పంచడం కూడా పూర్తయింది. మరో వారం రోజుల్లోనే ఆ జంటకు పెళ్లి. ఆ సమయంలో.. సురేశ్‌ తన కాబోయే భార్య శైలజ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను చూశాడు. అందులో కాలేజీ ట్రిప్‌లో స్నేహితులతో సరదాగా ఉన్న ఫొటోలు.. వాటికి వచ్చిన కామెంట్లు చూసి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. శైలజ ఎంత చెప్పినా వినకుండా పెళ్లి రద్దు చేసుకున్నాడు.

  • సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురు

  • మధ్యప్రదేశ్‌లో 40 రోజుల వ్యవధిలో రద్దయిన పెళ్లిళ్ల సంఖ్య 150కి పైమాటే!

  • పచ్చటి కాపురాల్లో సైతం డిజిటల్‌ చిచ్చు

  • కౌన్సెలింగ్‌ తీసుకోవాలని నిపుణుల సూచన

(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)

పెళ్లంటే నూరేళ్ల బంధం. రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు.. అనుమానాలు, అపోహలకు తావులేకుండా పెద్దలు కుదిర్చిన వివాహ బంధంలో అమ్మాయి, అబ్బాయి చక్కగా ఇమిడిపోయేవారు. కొండొకచో.. ఆ పెళ్లి జరగడం ఇష్టంలేనివారు ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలను నమ్మి కొంతమంది వివాహం రద్దుచేసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచం మొత్తాన్నీ అరచేతిలో చూపిస్తున్న సోషల్‌ మీడియా.. ఆకాశరామన్న పాత్ర పోషిస్తోంది. పచ్చటి బంధాల్లో నిప్పు రాజేస్తోంది. పెళ్లికి ఓకే అనుకుని.. ముహూర్తం కూడా పెట్టుకున్నవారు.. కాబోయే భార్య/భర్త సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసిన ఫొటోలు, వారు చేసే కామెంట్ల ఆధారంగా ఆ పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటీవల 40 రోజుల వ్యవధిలో 150కిపైగా జంటలు తమ పెళ్లిని రద్దు చేసుకున్నాయంటే... పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్లిళ్ల రద్దుకు ప్రధాన కారణం (62 శాతం) ఆయా జంటలు తమ తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేసిన ఫొటోలు, కామెంట్లేనంటే అతిశయోక్తి కాదు. అక్కడే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు.. పెళ్లి బంధంతో ఒక్కటవాలని నిర్ణయించుకోవడానికి ముందే ఎదుటివారి సోషల్‌ మీడియా ఫ్రొఫైల్స్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఉదాహరణకు.. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తాను చూడబోయే అమ్మాయి ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను పరిశీలించాడు. అందులో అమె ఒక ఫిట్‌నెస్‌ టైనర్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్‌ అవ్వడం, అతని పోస్టులకు వరుసగా ‘లైక్స్‌’ పెట్టడం చూశాడు. పెళ్లిచూపుల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ‘’అతను నా చిన్ననాటి స్నేహితుడు, అందులో తప్పేముంది?’’ అని ఆమె బదులిచ్చింది. కారణమేదైనా అతడికి ఆ విషయం నచ్చకపోవడంతో ఆ సంబంధం వద్దనుకున్నాడు.


రూ.కోటి బడ్జెట్‌తో సంగీత్‌.. ఆగినపెళ్లి..

సికింద్రాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు పెళ్లి సందర్భంగా సంగీత్‌ వేడుకకు కోటి రూపాయలకు పైగా ఖర్చుచేశారు. వేడుక ఘనంగా జరిగింది. కానీ.. సంగీత్‌ అయిన మరుసటి రోజు ఉదయం వధువు తన పాత స్నేహితుడితో చాటింగ్‌లో ఉండటాన్ని వరుడు గమనించాడు. పెళ్లి రద్దు చేసుకున్నాడు. అలాగే.. ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రియ.. నిత్యం ఇన్‌స్ర్టాగ్రామ్‌లో సరదాగా రీల్స్‌ చేస్తుండేది. అందులో భాగంగా ఆమె కొందరు యువ స్నేహితులతో కలిసి డ్యాన్స్‌ చేసేది. సరదాగా నటించేది. ఆ అమ్మాయికి రాహుల్‌ అనే అబ్బాయితో పెళ్లి కుదిరింది. అయితే.. ఆమె రీల్స్‌ చూసిన రాహుల్‌.. ‘పెళ్లయిన తర్వాత ఇలా చేయడం పద్ధతి కాదు. ఇవన్నీ నీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తాయి’ అని చెప్పాడు. ఆమె సర్దిచెప్పడానికి ప్రయత్నించినా రాహుల్‌ సోషల్‌ మీడియాలో ఆమె ఓవర్‌ ఎక్స్‌ఫోజ్‌ అవుతోందని నమ్మి ఆమెను పూర్తిగా అర్థం చేసుకోకుండానే పెళ్లిని రద్దు చేసుకున్నాడు. పెళ్లయిన జంటలనూ ఈ సోషల్‌ మీడియా సందేశాలు విడదీస్తున్నాయి. ఉదాహరణకు.. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న వంశీ, లక్ష్మీలకు (పేర్లు మార్చాం) ఘనంగా పెళ్లయింది. ఆరు నెలల తర్వాత వంశీకి, లక్ష్మీ పాత ఫేస్‌బుక్‌ మెసేజ్‌లు కనిపించాయి. అందులో లక్ష్మి తన మాజీ బాయ్‌ప్రెండ్‌తో పెళ్లికి ముందు చేసిన చాటింగ్‌ ఉంది. బాయ్‌ఫ్రెండ్‌ విషయం ‘పెళ్లికి ముందు ఎందుకు నాకు చెప్పలేదు’ అంటూ గొడవ మొదలు పెట్టాడు. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.


చర్చనీయాంశంగా స్మృతి మందన్న పెళ్లి రద్దు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన స్మృతి మందన్నకు.. సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌తో వివాహం ఖరారై.. చివరినిమిషంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి నిర్వహించిన అనేక ప్రీవెడ్డింగ్‌ షూట్‌లు, సంగీత్‌ ఈవెంట్లు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తీరా.. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి ఆసుపత్రిలో చేరడంతో పెళ్లి వాయిదావేసి.. ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. పలాష్‌ గతంతో ఇతరులతో సన్నిహితంగా ఉన్న చాటింగ్‌, చిత్రాలు బయటికి రావడంతోనే ఈ పెళ్లి రద్దయింద నే వాదనా ఉంది. వీరి పెళ్లి రద్దయిన సంగతి.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అనుమానాలు వద్దు..

బంధాలు బీటలువారడానికి కారణమవుతున్న సోషల్‌ మీడియా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే.. పెళ్లితో ఒక్కటి కావాలనుకుంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు, వారి కుటుంబాలు పరిపక్వతతో వ్యవహరించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎదుటివారి సోషల్‌ మీడియా కామెంట్లు, వాటిలో పెట్టే ఫొటోలు, వీడియోలు.. ఇలా ప్రతిదాన్నీ అనుమానాస్పద దృష్టితో చూడకూడదని చెబుతున్నారు. ఒకవేళ గతంలో ఎవరితోనైనా బంధంలో ఉం డి, దాన్నుంచి బయటపడితే.. పెళ్లి కుదిరే సమయంలోనే ఆ విషయాన్నినిజాయితీగా చెప్పడం అనుమానాలను నివారించడానికి ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. అలాగే.. ఇద్దరూ ఎంత సమయం ఫోన్‌లో గడపాలి? ఎలాంటి పోస్టులు పెట్టాలి? ఎవరితో చాట్‌ చేయాలి? అనే విషయాలపై ఇద్దరూ కలిసి ముందే మాట్లాడుకోవాలని.. ఒక డిజిటల్‌ సరిహద్దును ఏర్పరచుకోవాలని సలహా ఇస్తున్నారు. జీవితభాగస్వామి మొబైల్‌ను.. వారి అనుమతి లేకుండా, అనుమానంతో తరచుగా చెక్‌ చేయకూడదని, ఇది వారి వ్యక్తిగత గోప్యత హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేస్తున్నారు. సోషల్‌ మీడియా పోస్టుల వల్ల అనుమానాలు పెరిగి గొడవలకు దారితీస్తే.. విడాకులు, పెళ్లి రద్దు వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదని, కౌన్సిలింగ్‌ నిపుణులను ఆశ్రయించడం ఉత్తమం అని వారు సూచిస్తున్నారు.

  • ఒక బహుళజాతి కంపెనీలో పనిచేసే అంకితకు (పేరు మార్చాం).. అమెరికాలో స్థిరపడిన తెలుగు అబ్బాయి మోహిత్‌కు పెళ్లి నిశ్చయమైంది. కానీ.. ఆఫీసు వాళ్లు ఇచ్చిన ఒక పార్టీలో మోహిత్‌ తన సహూద్యోగితో సన్నిహితంగా ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో చూసింది. ఆ సహూద్యోగి పోస్ట్‌కి మోహిత్‌ పెట్టిన కామెంట్‌ను తప్పుగా అర్థం చేసుకుంది. ఎంతో మంది చెప్పినా వినకుండా పెళ్లి రద్దు చేసుకుంది.

  • పెళ్లిళ్లు పెటాకులవడం కాదు... పెట్టుకున్న ముహూర్తానికి పెళ్లిపీటలు ఎక్కకముందే ఆ బంధాలు పెటాకులవుతున్న వైనమిది! పసుపు పారాణితో పచ్చటి పందిట్లో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాల్సిన జంటల మధ్య సోషల్‌ మీడియా పెడుతున్న చిచ్చు ఇది!!

Updated Date - Dec 16 , 2025 | 04:03 AM