DGP Harish Kumar Gupta: సోషల్ మీడియాలో హద్దు మీరితే జైలే
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:23 AM
ద్వేష పూరిత వ్యాఖ్యలు, ప్రాంతీయ వైషమ్యాలతో సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా...
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పోస్టులు పెట్టినా చర్యలు: డీజీపీ
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): విద్వేష పూరిత వ్యాఖ్యలు, ప్రాంతీయ వైషమ్యాలతో సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై రాష్ట్రంలోని సైబర్ విభాగాలు సమన్వయంతో నిఘా పెట్టినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ ఎవరిని ఎవరు కించ పరిచినా... వర్గాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు రేపేలా వ్యాఖ్యలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసినా.. జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. ‘విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు, ప్రభావిత వ్యక్తులు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఆన్‌లైన్ వేదికనూ సృజనాత్మక చర్చల కోసమో.. జ్ఞాన సముపార్జన కోసమో వినియోగించుకోవాలి. ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఉద్రిక్తతలు సృష్టించే వాటిని ఆన్‌లైన్లో వీక్షించి మరొకరితో పంచుకున్నా చట్టం చూస్తూ ఊరుకోదు. ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించే వారిని పోలీసులు వదిలి పెట్టబోరు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని హెచ్చరించారు.