Share News

TTD: వైసీపీ నేతల దర్శనాలపై సోషల్‌ దుమారం

ABN , Publish Date - Dec 31 , 2025 | 06:07 AM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైసీపీ నేతలకు ఇష్టానుసారం వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారంటూ మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తింది.

TTD: వైసీపీ నేతల దర్శనాలపై సోషల్‌ దుమారం

  • సామాజిక మాధ్యమాల్లో వైరల్‌, టీటీడీ వివరణ

తిరుపతి, డిసెంబరు 30 (ఆంరఽధజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైసీపీ నేతలకు ఇష్టానుసారం వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారంటూ మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తింది. దీంతో అది నిజం కాదంటూ టీటీడీ వివరణ ఇచ్చింది. మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వేకువజామున పెద్దసంఖ్యలో ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో వైసీపీకి చెందిన నేతలు కూడా పలువురు ఉన్నారు. ఈ ఫొటోలు, వీడియోలను కొందరు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. వీరిలో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు ఉండటంతో ఈ వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగింది. అప్రమత్తమైన టీటీడీ స్పందిస్తూ.. వైసీపీ నేతలుగా ఎవరికీ దర్శనాలు కల్పించలేదని పేర్కొంది. ఆ విధంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు.. నిబంధనల ప్రకారమే ఒక్కొక్కరి లేఖపై ఆరుగురికి దర్శనాలు కల్పించామని వివరణ ఇచ్చింది. ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ లేఖపై దేవినేని అవినాశ్‌కు దర్శనం కల్పించగా, మరో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి లేఖపై మాజీ మంత్రి రోజాకు దర్శనం కల్పించామని తెలిపింది. వైసీపీ నేతలకు నిబంధనలకు విరుద్ధంగా దర్శనాలు అని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని పేర్కొంది.

Updated Date - Dec 31 , 2025 | 06:10 AM