Share News

మొంథా టెన్షన్‌!

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:30 AM

అందరిలో ఒక్కటే టెన్షన్‌.. అదే మొంథా టెన్షన్‌. ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ అయ్యింది. మంగళవారం రెడ్‌ అలెర్ట్‌ రానుంది. తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో పూర్తిగా, ఎన్టీఆర్‌ జిల్లాలో వాయువ్య ప్రాంతం, నగరంలో భారీ వర్షాలు పడనున్నాయి. వ్యవసాయ, ఆక్వా రంగాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక అధికారులను నియమించింది. తక్షణ అవసరాల కోసం నిధులు కేటాయించింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.

మొంథా టెన్షన్‌!

- కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ

- రేపు రెడ్‌ అలెర్ట్‌ హెచ్చరికలు

- భారీ వర్షాలు కురిసే అవకాశం

- కృష్ణా పూర్తిగా.. విజయవాడ, వాయువ్య ఎన్టీఆర్‌ ప్రాంతాల్లో ప్రభావం

- వ్యవసాయ, ఉద్యాన పంటల రైతుల్లో ఆందోళన

- ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్న తుఫాను

- మండల స్థాయిలో ప్రత్యేకాధికారుల నియామకం

- ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల ప్రత్యేక అధికారులుగా శశిభూషణకుమార్‌, అమ్రపాలి

అందరిలో ఒక్కటే టెన్షన్‌.. అదే మొంథా టెన్షన్‌. ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ అయ్యింది. మంగళవారం రెడ్‌ అలెర్ట్‌ రానుంది. తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో పూర్తిగా, ఎన్టీఆర్‌ జిల్లాలో వాయువ్య ప్రాంతం, నగరంలో భారీ వర్షాలు పడనున్నాయి. వ్యవసాయ, ఆక్వా రంగాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక అధికారులను నియమించింది. తక్షణ అవసరాల కోసం నిధులు కేటాయించింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఉమ్మడి జిల్లా వాసులను మొంథా తుఫాను టెన్షన్‌ వెంటాడుతోంది. అతి భారీ వర్షాల హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఎన్టీఆర్‌ జిల్లాకు పంచాయతీరాజ్‌ - గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌, కృష్ణాజిల్లాకు ఏపీటీడీసీ ఎండీ అమ్రపాలి నియమతులయ్యారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి కాకినాడకు తూర్పు - ఆగ్నేయంగా 720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతూ వస్తోంది. దీనిని బట్టి చూస్తే ఈ నెల 28వ తేదీ నాటికి తుఫాను ప్రభావం కనిపించే అవకాశం ఉంది. వాయుగుండం దగ్గర పడుతున్న కొద్దీ బలమైన గాలులు, అతి భారీ వర్షాలు రెండు జిల్లాల్లో పడనున్నాయి. వాయుగుండం మచిలీపట్నం, కళింగపట్నం మధ్యన కాకినాడను తాకేలా తీరాన్ని దాటనుందని చెబుతున్నప్పటికీ.. దగ్గరగా వస్తున్నకొద్దీ దిశ మార్చుకుంటే మాత్రం కష్టమవుతుంది. మచిలీపట్నం వైపు దిశ మార్చుకుంటే మాత్రం మనకు ప్రమాదం పొంచి ఉన్నట్టే.

ఇరు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ జారీ

వాతావరణ శాఖ అంచనా మేరకు కృష్ణాజిల్లా పూర్తిగా ఎల్లో అలెర్ట్‌లో ఉండగా.. ఎన్టీఆర్‌ జిల్లాలో మాత్రం విజయవాడ నగరం, ఎన్టీఆర్‌ జిల్లా వాయువ్య ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, జీ కొండూరు, మైలవరం, ఏ కొండూరు, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట మండలాలకు ఎల్లో అలెర్ట్‌ ప్రకటించారు. ఎల్లో అలెర్ట్‌ ప్రకటించడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉంది. ఆదివారం రెండు జిల్లాల్లో వాతావరణ మార్పులు పెద్దగా జరగలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో యధాతథ పరిస్థితులు ఉన్నాయి. కృష్ణాజిల్లాలో మాత్రం స్వల్పంగా మబ్బులు అలుముకున్నాయి. అక్కడక్కడ అతి స్వల్ప వర్షం పడింది. సోమవారం మాత్రం కృష్ణాజిల్లాలో భారీ వర్షాలు పడతాయని, ఎన్టీఆర్‌ జిల్లాలో మాత్రం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మంగళ, బుధవారాలు మాత్రం ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని రెడ్‌ అలెర్ట్‌ను ప్రకటించింది. దీంతో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు పడే ప్రమాదం ఉంది.

పంటలపై ప్రభావం

రెండు జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణాజిల్లాలో 1.61 లక్షల హెక్టార్లలో వరి పంట ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాలో వరి 1.21 లక్షల ఎకరాలు, పత్తి 80 వేల ఎకరాలలో సాగు జరుగుతోంది. ఇవి కాకుండా ఎన్టీఆర్‌ జిల్లాకు అత్యంత ప్రధానంగా ఉద్యాన పంటలైన అరటి, చెరకులతో పాటు కంది, మినుము, పెసర వంటి పంటలు కూడా భారీ వర్షానికి నష్టపోయే అవకాశం ఉంది.

ఆక్వా రైతుల్లో ఆందోళన

కృష్ణాజిల్లాలో ప్రధానంగా ఆక్వా రంగానికి తీరని నష్టం కలిగించే పరిస్థితులు ఉన్నాయి. చేపలు, రొయ్యలు, పీతల సాగు లక్షలాది ఎకరాల చెరువుల్లో జరుగుతోంది. భారీ వర్షాలు కురిస్తే ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దీంతో ప్రత్యేకంగా పెంచుతున్న చేపలు, రొయ్యలు ఎక్కువుగా చనిపోవటానికి అవకాశం ఉంటుంది. బలమైన గాలలు కారణంగా విద్యుత వ్యవస్థ స్తంభిస్తే మాత్రం ఆక్వా రంగానికి పెద్ద నష్టం జరుగుతుంది. చేపలు, రొయ్యలకు ఆక్సిజన్‌ అందకపోతే మాత్రం అవి చనిపోతాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ భయం

రెండు జిల్లాలో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వస్తే పరిస్థితి ఏమిటన్నది కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో క్లౌడ్‌ బరస్ట్స్‌ జరుగుతున్నాయి. కుండపోతగా వర్షాలు కురిస్తే.. రెండు జిల్లాలో ఆక్రమణలో ఉన్న డ్రైనేజీ కాల్వల కారణంగా ఎటు నుంచి ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వస్తాయో తెలియని దుస్థితి నెలకొంది. రెండు జిల్లాల అధికారులు గ్రామ, మండల స్థాయిలో డ్రెయిన్ల ఆక్రమణల తొలగింపు, పూడికతీత పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. కృష్ణాజిల్లాలో దివిసీమ, నాగాయలంక, అవనిగడ్డ, సొర్లగొంది వంటి ప్రాంతాలు ముంపులో చిక్కుకుంటే అనేక గ్రామాలకు రాకపోకలు తెగిపోయే ప్రమాదం ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాలో వాగుల కారణంగా రోడ్లు దెబ్బతింటే అనేక గ్రామాల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులు ఎదుర్కోవాలంటే.. క్షేత్ర స్థాయిలో తక్షణ సన్నద్ధత కోసం చర్యలు చేపట్టేలా యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా, మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Oct 27 , 2025 | 01:30 AM