అడ్డంకులెన్నో..!
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:14 AM
మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారి-65 విస్తరణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. క్రాస్ క్లోవర్ లీఫ్ ఆకృతి నిర్మాణ ప్రాంతంలో భూముల సేకరణపై ఆయా రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రహదారి నిర్మాణం కోసం ఇప్పటికే రెండు సార్లు భూములు ఇచ్చామని, మూడో సారి ఇవ్వాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. న్యాయవాదుల ద్వారా తమ అభ్యంతరాలను కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన ఆయన పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని ఫైల్‌ను మోర్త్ అధికారులకు పంపించారు.
- మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి-65 విస్తరణపై నీలినీడలు
- క్రాస్ క్లోవర్ లీఫ్ ఆకృతి నిర్మాణ ప్రాంతంపై రైతుల అభ్యంతరం
- ఇప్పటికే రెండు సార్లు భూములిచ్చాం.. మూడో సారి అంటే ఎలా?
- న్యాయవాదుల ద్వారా కలెక్టర్‌కు తమ అభ్యంతర పత్రాలు
- స్పందించిన కలెక్టర్.. మోర్త్ అధికారులకు ఫైల్
- పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారి-65 విస్తరణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. క్రాస్ క్లోవర్ లీఫ్ ఆకృతి నిర్మాణ ప్రాంతంలో భూముల సేకరణపై ఆయా రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రహదారి నిర్మాణం కోసం ఇప్పటికే రెండు సార్లు భూములు ఇచ్చామని, మూడో సారి ఇవ్వాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. న్యాయవాదుల ద్వారా తమ అభ్యంతరాలను కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన ఆయన పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని ఫైల్‌ను మోర్త్ అధికారులకు పంపించారు.
(ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం):
మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి-65, జాతీయ రహదారి- 216 ఎస్.ఎన్.గొల్లపాలెం వద్ద కలుస్తాయి. ఇక్కడ మచిలీపట్నం పోర్టు నుంచి సరుకు ఎగుమతులు, దిగుమతుల కోసం క్రాస్ క్లోవర్ లీఫ్ ఆకృతిలో భారీ స్థాయిలో రహదారిని విస్తరించనున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 80 ఎకరాలకుపైగా భూమి అవసరమని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కోసం గత సెప్టెంబరు 26వ తేదీన గెజిట్ నోటిఫికేషన్‌ను తయారు చేశారు. అక్టోబరు 14వ తేదీన పత్రికా ప్రకటనను జారీ చేశారు. దీంతో రైతులు గతంలోనే రహదారికి రెండు సార్లు భూమిని ఇచ్చామని, మూడో సారి భూమిని ఇవ్వలేమని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
రైతుల అభ్యంతరాలు ఇవీ
- మచిలీపట్నం పోర్టు అభివృద్ధి జరిగితే మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు పర్యాటకంగాను ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దీంతో నగర జనాభా 10 లక్షల వరకు చేరే అవకాశం ఉంది.
- మచిలీపట్నం పోర్టు అభివృద్ధి చెందితే నగరాన్ని ఎలా విస్తరించాలనే అంశంపై గతంలో మచిలీపట్నం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్లాన్‌లో ఎస్.ఎన్.గొల్లపాలెం వద్ద రహదారి విస్తరణకు బదులుగా, గూడూరు మండలం తరకటూరు నుంచి జాతీయ రహదారిని ప్రారంభించి మచిలీపట్నం మండలంలో జాతీయ రహదారి 216 కలిసే ప్రాంతం హర్ష కాలేజీ వరకు ఎలాంటి మలుపులు లేకుండా నిర్మాణం చేయాలని నమూనా తయారు చేశారు. ఈ ప్లాన్‌ను అమలు చేయాలి.
- మచిలీపట్నం మాస్టర్ ప్లాన్‌లో చూపిన విధంగా కాకుండా, మోర్త్ అధికారులు మచిలీపట్నం నగరం అంచున క్రాస్ క్లోవర్ లీఫ్ ఆకృతిలో నిర్మాణం చేసేందుకు, అది కూడా నేరుగా కాకుండా ‘వి’ ఆకారంలో ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు నమూనాను రూపొందింంచారు. ఈ ప్రతిపాదనతో మచిలీపట్నం నగరానికి వాయు కాలుష్యంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయి.
- మచిలీపట్నం నగరం అభివృద్ధికి ఈ రహదారి విస్తరణ అడ్డంకిగా మారుతుంది. ఇప్పటికే మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధి కోసం రెండు విడతలుగా భూమిని సేకరించారు. మళ్లీ మూడో సారి భూమిని సేకరించడం రైతులను తీవ్ర ఇబ్బందుల పాలుజేయడమే.
- ప్రస్తుతం ఎస్.ఎన్.గొల్లపాలెం వద్ద ఎకరం భూమి రిజిస్ర్టార్ కార్యాలయంలో రూ.80 లక్షలుగా ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి రూ.10 కోట్ల వరకు ధర పలుకుతోంది. ఇంతటి విలువైన భూమిని ఇప్పటికే రెండు సార్లుగా ఇచ్చామనీ, మరో విడత ఇచ్చేందుకు సిద్ధంగా లేమంటూ న్యాయవాదుల సలహాలు తీసుకుని రెండు విడతలుగా కలెక్టర్ బాలాజీని కలిసివినతిపత్రాలు అందజేశారు.
మోర్త్ అధికారుల దృష్టికి రైతుల అభ్యంతరాలు
మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి-65ను ఎస్.ఎన్.గొల్లపాలెం వద్ద క్రాస్ క్లోవర్ లీఫ్ ఆకృతిలో విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌పై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇచ్చిన వినతి పత్రాలను కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. అనంతరం వాటిని రైతులకు తగు న్యాయం చేయాలని మోర్త్ అధికారులకు పంపారు. కలెక్టర్ పంపిన ఫైలుపై మోర్త్ అధికారులు సముచిత నిర్ణయం తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తామని భూమి కోల్పోయే రైతులు అంటున్నారు. ఈ వ్యవహారంపై రానున్న రోజుల్లో అధికారులు, రైతులు తీసుకునే నిర్ణయంపైనే రహదారి విస్తరణ ఆధారపడి ఉంటుంది.
పెడనలో డీపీఆర్‌ను మార్చివేశారా!
పెడన తోటమూల సెంటరు నుంచి గుడివాడ, హనుమాన్‌జంక్షన్ మీదుగా జాతీయ రహదారి-30ను విస్తరించేందుకు డీపీఆర్‌ను తయారు చేశారు. పెడన వద్ద తమ భూములు కొంతమేర పోతే మిగిలిన భూములకు ధర పెరుగుతుందనే కారణంతో ఈ రహదారి విస్తరణను వివిధ రూపాల్లో మలుపులు తిప్పారనే ఆరోపణలు కొందరు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. పాఠశాల ఆవరణ స్థలంతో పాటు, కొన్ని గృహాలను తొలగించేలా డీపీఆర్‌ను తయారు చేశారు. దీంతో స్థానిక రైతులు కొందరు జాతీయ రహదారి-30 కోసం రూపొందించిన డీపీఆర్‌లో మోర్త్ అధికారులు పొరపాట్లు చేశారని, వాటిని సరిదిద్దాలని కోరుతూ కలెక్టర్, మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.