నత్త నడక!
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:09 AM
జిల్లాలో ఈ-క్రాప్ నమోదు నత్తనడకన సాగుతోంది. జూలైలో ప్రారంభమైన ఈ ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు వరి 3.35 లక్షల ఎకరాల్లో, ఉద్యాన పంటలు 25 వేల ఎకరాల్లో సాగు అయ్యాయి. వాతావరణం వ్యవసాయ పనులకు అనుకూలంగా మారడంతో వరినాట్లు జిల్లాలో దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. సెప్టెంబరు రెండో వారంలో కాలువ శివారు ప్రాంతాల్లోనూ వరినాట్లు పూర్తవుతాయని అంచనాగా ఉంది. ఇటీవల గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయశాఖ అసిస్టెంట్(వీఏఏ)లను ఐదేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నారనే కారణంతో వారిని ఇతర మండలాల్లోని ఆర్‌ఎస్‌కేలకు బదిలీ చేశారు. ఆర్‌ఎస్‌కేలకు నూతనంగా వచ్చిన వీఏఏలకు ఆయా గ్రామాలపై అవగాహన రావడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ఈ-క్రాప్ నమోదు, ఈకేవైసీ ప్రక్రియలను ఎప్పటికి పూర్తిచేస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది ఈ-క్రాప్ నమోదు చేసే సమయంలోనే రైతులతో ఈకేవైసీ కూడా చేయించాలనే నిబంధనను ప్రభుత్వం పెట్టింది.
- సాగని ఈ-క్రాప్ నమోదు
- జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పంటల సాగు
- ఇప్పటి వరకు పూర్తయ్యింది 1.30 లక్షల ఎకరాల్లో..
- ఈ నెల 15తో ఈ-క్రాప్ నమోదుకు తుదిగడువు
- ఎంత వరకు పూర్తవుతుందనే దానిపై సందిగ్ధం!
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లాలో ఈ-క్రాప్ నమోదు నత్తనడకన సాగుతోంది. జూలైలో ప్రారంభమైన ఈ ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు వరి 3.35 లక్షల ఎకరాల్లో, ఉద్యాన పంటలు 25 వేల ఎకరాల్లో సాగు అయ్యాయి. వాతావరణం వ్యవసాయ పనులకు అనుకూలంగా మారడంతో వరినాట్లు జిల్లాలో దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. సెప్టెంబరు రెండో వారంలో కాలువ శివారు ప్రాంతాల్లోనూ వరినాట్లు పూర్తవుతాయని అంచనాగా ఉంది. ఇటీవల గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయశాఖ అసిస్టెంట్(వీఏఏ)లను ఐదేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నారనే కారణంతో వారిని ఇతర మండలాల్లోని ఆర్‌ఎస్‌కేలకు బదిలీ చేశారు. ఆర్‌ఎస్‌కేలకు నూతనంగా వచ్చిన వీఏఏలకు ఆయా గ్రామాలపై అవగాహన రావడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ఈ-క్రాప్ నమోదు, ఈకేవైసీ ప్రక్రియలను ఎప్పటికి పూర్తిచేస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది ఈ-క్రాప్ నమోదు చేసే సమయంలోనే రైతులతో ఈకేవైసీ కూడా చేయించాలనే నిబంధనను ప్రభుత్వం పెట్టింది.
షెడ్యూలు ఇలా
జూలై 20వ తేదీ నుంచి ఈ-క్రాప్ నమోదును ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం 1.30 లక్షల ఎకరాల్లోనే ఈ-క్రాప్ నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ-క్రాప్ నమోదుకు సంబంధించిన జాబితాలను రైతు సేవా కేంద్రాలు, సచివాలయాల వద్ద నోటీస్ బోర్డుల్లో పెట్టాలి. ఈ జాబితాలపై గ్రామ సభలు నిర్వహించి రైతుల సమక్షంలో తనిఖీ పూర్తి చేయాలి. ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించాలి. 30వ తేదీన తుది జాబితాలను ప్రకటించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల 15వ తేదీలోగా ఎంత మేర ఈ-క్రాప్ నమోదును పూర్తి చేస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది.
జియో రీఫెన్సింగ్ విధానం అమలు
ఈ సారి ఈ-క్రాప్ నమోదులో నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. జియో రీఫెన్సింగ్ విధానంలో రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే గ్రామ వ్యవసాయశాఖ అసిస్టెంట్లు(వీఏఏ), వీఆర్వోలు పొలం వద్దకు వెళ్లి సంబంధిత భూమి సర్వే నెంబర్ల ఆధారంగా పంట వివరాలను ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక పద్ధతిలో నమోదు చేయాలి. ఈ-క్రాప్ నమోదు చేసే సమయంలో రైతులు అందుబాటులో లేకున్నా.. పొలంలో వాస్తవంగా ఏయే రకాల వరివంగడాలు సాగు చేశారో నమోదు చేయాలి. భూమి యజమాని తన పొలాన్ని కౌలుకు ఇస్తే సాగు చేసే కౌలు రైతుల పేరుతోనే ఈ-క్రాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంది. జిల్లాలో కౌలు రైతు గుర్తింపు కార్డులను 57వేల మందికి మాత్రమే ఇచ్చారు. వారి పేరున ఈ-క్రాప్‌లో పంట వివరాలు ఎంతమేరకు నమోదు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. భూమి సాగుచేస్తున్న వారిపేరు, భూమి సర్వే నెంబరు, రైతుల బ్యాంకు ఖాతాల నెంబర్లను ఈ-క్రాప్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. గతంలో పొలం వద్దకు వెళ్లకుండానే ఈ-క్రాప్ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేవారు. దీంతో రైతులు పంటను విక్రయించే సమయంలో, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో పంటను నష్టపోతే పరిహారం, పంట బీమా పొందేందుకు దరఖాస్తు చేసుకునే సమయంలో పలు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ ఏడాది ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదు చేయాలంటే గ్రామ వ్యవసాయశాఖ అసిస్టెంట్లు, వీఆర్వోలు ఖచ్చితంగా పొలం వద్దకు వెళ్లాలనే నిబంధన విధించారు. కొన్ని గ్రామాల్లో వ్యవసాయశాఖ అసిస్టెంట్‌లు లేరనే కారణంతో ఇన్‌చార్జిలను నియమించి ఈక్రాప్ నమోదును ఆలస్యంగా ప్రారంభించారు.
అసైన్డ్, లంక భూముల్లోని పంటల సంగతేంటి?
తీర ప్రాంతంలోని బందరు, పెడన, కృత్తివెన్ను, కోడూరు, నాగాయలంక తదితర మండలాల్లో అసైన్డ్ భూముల్లోనూ రైతులు వరిసాగు చేస్తున్నారు. ఈ పంట వివరాలను ఈ-క్రాప్‌లో నమోదు చేస్తారా లేదా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. చల్లపల్లి, తోట్లవల్లూరు, ఘంటసాల, అవనిగడ్డ, పెనమలూరు, మోపిదేవి మండలాల్లోని లంక భూముల్లో చెరకు, కంద, పసుపు, కూరగాయలు, పూల తోటలను రైతులు సాగు చేశారు. లంక భూముల్లో సాగు చేసిన పంట వివరాలను ఏ ప్రాతిపదికన ఈ-క్రాప్‌లో నమోదు చేస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది అధిక శాతం లంకభూములకు సర్వే నెంబర్లు ఉండవు. రెవెన్యూ రికార్డులలో చల్లపల్లి రాజా భూములు లేదా లంక ల్యాండ్స్ అని మాత్రమే నమోదై ఉంటుంది. లంక భూముల్లో సాగు చేసిన పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేసే అంశంపై కూటమి ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.