AP Police: సవాళ్లకు సై..
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:40 AM
లాఠీ పట్టుకో.. దొంగలను వెంబడించు.. అనేది పాత ధోరణి. డేటా సేకరించు.. నేరస్తుల ఆట కట్టించు.. అనేది కొత్త మార్గం. ఆధునిక నేరాల కట్టడికి ఆధునిక పోలీసింగ్‌కు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది.
కొత్త కానిస్టేబుళ్లకు స్మార్ట్ శిక్షణ
నయా నేరాల కట్టడికి అధునాతన పోలీసింగ్
త్వరలో డ్యూటీలోకి వస్తున్న ఆరువేల మంది
సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఏఐపై అవగాహన.. నిపుణులతో క్లాసులు..
నంబర్ వన్ ట్రైనింగ్
పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో త్వరలో ప్రారంభం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
లాఠీ పట్టుకో.. దొంగలను వెంబడించు.. అనేది పాత ధోరణి. డేటా సేకరించు.. నేరస్తుల ఆట కట్టించు.. అనేది కొత్త మార్గం. ఆధునిక నేరాల కట్టడికి ఆధునిక పోలీసింగ్‌కు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. ఫ్యూడల్ పోలీసింగ్‌కు టాటా చెప్పి హ్యూమన్ టచ్‌తో కూడిన కార్యచరణకు శ్రీకారం చుట్టనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ కాలేదు ఈ కారణంగా పోలీసు శాఖను మానవ వనరుల కొరత వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత పోలీసు కానిస్టేబుళ్లుగా 6,024 మంది కొత్తగా ఎంపికయ్యారు. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టే సైబర్ కమాండోల్లా వీరందరినీ తీర్చిదిద్దబోతున్నారు. ఇటీవలి ఫలితాల్లో ట్రైనీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన యువకులకు ఈ నెలలో శిక్షణ మొదలు కాబోతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయింది. పొరుగు రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేసిన వారి సర్టిఫికెట్ల పరిశీలనకు ఆయా రాష్ట్రాలకు పంపిన ఏపీ పోలీసు శాఖ, మరో వైపు శిక్షణకు రంగం సిద్ధం చేస్తోంది. విజయనగరం, ఒంగోలు, తిరుపతి, అనంతపురంలోని పోలీసు శిక్షణా కళాశాలలతో(పీటీసీ) పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీటీసీల్లో మూడున్నర వేల మంది సివిల్ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కాబోతోంది. మరోవైపు 2,500మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు బెటాలియన్లలో ట్రైనింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఆరు వేల మందిలో 810మంది బీటెక్, ఎంటెక్, బీసీఏ లాంటి టెక్నికల్ కోర్సులు చేసిన విద్యావంతులున్నారు.
ఇంటర్మీడియట్ అర్హత ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో అత్యధికంగా డిగ్రీ పట్టభద్రులు 4,051మంది ఉండగా ఎంబీఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ లాంటి ఉన్నత విద్య చదివిన వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి మానవ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఇటీవల ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. సమాజాన్ని భయపెడుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను ఎదుర్కునేలా పోలీసుల్ని సంసిద్ధం చేయడం ఎలా.? అనే అంశంపై సమీక్షించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అంది పుచ్చుకున్న అధునాతన పద్ధతులు, మన రాష్ట్రంలో అమలు చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులపైనా సమీక్షించారు. దేశంలోనే నెంబర్ వన్ పోలీస్‌గా ఏపీని నిలబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. ఇందులో ప్రధానమైన సైబర్ నేరాలు, ఫోరెన్సిక్, క్రిమినాలజీ వంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఐజీలు ఆకే రవికృష్ణ(సైబర్), పాలరాజు(ఫోరెన్సిక్), డీఐజీ సత్య యేసుబాబు(ట్రైనింగ్) కసరత్తు చేస్తున్నారు.
ఈ-క్లాసులు.. స్టూడియో సెమినార్లు..
కానిస్టేబుల్ శిక్షణ నాలుగు పీటీసీలతోపాటు జిల్లా కేంద్రాల్లోని డీటీసీల్లో తొమ్మిది నెలల పాటు జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా సిద్ధం చేసి చట్టాల అమలుపై అవగాహన కల్పిస్తారు. క్రమశిక్షణతో పాటు నేర దర్యాప్తులో మెలకువలు, విధి నిర్వహణలో అప్రమత్తత, బాధితులతో ప్రవర్తించే తీరు తదితర అంశాలపై పోలీసు ట్రైనింగ్ కాలేజీల్లోని డీఎస్పీ, సీఐ ర్యాంకు అధికారులు తర్ఫీదు ఇస్తారు. అయితే ఇదంతా మూస పద్ధతి అంటూ పెదవి విరుస్తోన్న వారికి సమాధానంగా అధునాతన పద్ధతుల్లో పోలీసు శిక్షణ ప్రారంభం కాబోతోంది. మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలోని టెక్ టవర్‌లో ఒక ప్రత్యేక స్టూడియోను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి సైబర్ నిపుణులతో పాటు ఫోరెన్సిక్, ఇన్వెన్టిగేషన్, ఆర్థిక మోసాలు, మహిళపై అఘాయిత్యాలు.. తదితర నేరాలపై అవగాహన ఉన్న నిపుణులతో క్లాసులు చెప్పిస్తారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు టెక్ టవర్ స్టూడియో ద్వారా ఆన్‌లైన్ లింక్ పంపి ఉదయం నుంచి సాయంత్రం మధ్యలో ఏ సమయంలో ఏ క్లాసు ఉంటుందో ముందు రోజు షెడ్యూల్ పంపుతారు. ఐపీసీ స్థానంలో వచ్చిన బీఎన్‌ఎస్.. సీఆర్‌పీసీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన బీఎన్‌ఎ్‌సఎస్.. ఎవిడెన్స్ యాక్ట్ బదులు తెచ్చిన భారతీయ సాక్ష్య అభియాన్‌ను కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన వాటిపై కూలంకషంగా వివరిస్తారు. ప్రధానంగా పోలీసులకు సవాలు విసురుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలపై ప్రతి పోలీసుకు అవగాహన పెంచడమే లక్ష్యమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ప్రతి పోలీసుకూ ‘ఐ గాట్ కర్మయోగి’
అధికారులు, సిబ్బంది తమ పనితీరు మెరుగు పరుచుకోవడానికి కేంద్ర హోంశాఖ ‘ఐ గాట్ కర్మయోగి’ యాప్‌ను తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమ పనితీరును మెరుగు పరుచుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ప్రతి పోలీసు తమ యాండ్రాయిడ్ మొబైల్‌లో దీనిని ఇన్‌స్టాల్ చేసుకునేలా పోలీసు శాఖ ప్రోత్సహిస్తోంది. సమకాలీన సవాళ్లను ఎప్పటికప్పుడు ఎదుర్కొనేలా ఇందులో నిపుణులు చెప్పే క్లాసులు విధుల్లో ఉన్న పోలీసులు కుదిరినప్పుడల్లా వినొచ్చు. తమకు దేనిపై అవగాహన లేదదే అంశాన్ని కూడా ఎంపిక చేసుకుని చూసుకోవచ్చు. డిజిటల్ ఫోరెన్సిక్, క్రిమినాలజీ, సైబర్ నేరాలు తదితర సవాళ్లను అధిగమించేందుకు కర్మయోగి యాప్ ఎంతగానో ఉపయోగ పడుతుందని పోలీసు శిక్షణ విభాగం డీఐజీ సత్య యేసుబాబు తెలిపారు.
ఆధునిక యుగం వైపు ఏపీ పోలీసింగ్: డీజీపీ
‘‘కాలంతో పాటు నేరాల్లోనూ సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి పోలీసును తీర్చిదిద్దడమే పోలీసు శాఖ లక్ష్యం.. సంప్రదాయ పోలీసింగ్‌తో పాటు ఆధునిక యుగం వైపు ఏపీ పోలీసింగ్‌ను తీసుకెళ్లబోతున్నాం..’ అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు. ఒకప్పుడు మావోయిస్టు సమస్యను ఎదుర్కోవడానికి గ్రేహౌండ్స్ ఏర్పాటైందని, ఇప్పుడు సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు సవాల్ విసురుతున్నాయని తెలిపారు. ‘‘సైబర్ పోలీసు కమాండోలను తయారు చేస్తున్నాం. నిరంతర శిక్షణ ఇస్తాం. మరో వైపు ట్రైనీ కానిస్టేబుల్లో 810మంది బీటెక్, ఎంటెక్ చదివిన వారున్నారు.. వారిని సైబర్ కమాండోలుగా మలుస్తాం. ఏఐ పోలీసింగ్‌ను అందిపుచ్చుకునేలా సిద్ధం చేస్తాం. సంప్రదాయ పోలీసింగ్‌తో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీని కూడా నేర్పిస్తాం’’ అని వివరించారు. నేరాల కట్టడికి ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ప్రతి పోలీసు స్టేషన్‌కూ డ్రోను ఇవ్వబోతున్నామని తెలిపారు. ‘‘ఐదు జిల్లాల్లో ఏఐ పోలీసింగ్ రాబోతోంది.. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను బలోపేతం చేశాం.. మహిళలపై నేరాలకు పాల్పడిన వారు జీవిత కాలం జైల్లో గడిపేలా యావజ్జీవ శిక్షలు పడుతున్నాయి. అన్ని విభాగాలను బలోపేతం చేసి దేశంలో ఏపీ పోలీసు జెండాను మొదటి స్థానంలో ఎగుర వేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నాం.’’ అని గుప్తా వివరించారు.