Minister Nadendla: స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:32 AM
రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది.
25 నుంచి ఇంటింటికీ ఉచితంగా పంపిణీ: మంత్రి నాదెండ్ల
అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్‌లో పౌరసరఫరాలశాఖ కమిషనర్ సౌరభ్‌గౌర్‌తో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం నమూనా స్మార్ట్ రేషన్ కార్డులను విడుదల చేశారు. ఈ నెల 25న 9 జిల్లాల్లో పండుగ వాతావరణంలో కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. తొలి విడతలో కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, 30నుంచి రెండో విడతలో చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో, మూడో విడతలో సెప్టెంబరు 6నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో, సెప్టెంబరు 15నుంచి బాపట్ల, పల్నాడు, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో పంపిణీ చేస్తామన్నారు.