Gottipati Ravi Kumar: ప్రజలకు అవగాహన కల్పించాకే స్మార్ట్ మీటర్లు
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:51 AM
ప్రజలకు అవగాహన కల్పించాకే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ ఈపీడీసీఎల్ అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.
ఈపీడీసీఎల్ సమీక్షలో మంత్రి గొట్టిపాటి
విశాఖపట్నం, జూలై 28(ఆంధ్రజ్యోతి): ప్రజలకు అవగాహన కల్పించాకే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ ఈపీడీసీఎల్ అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. విశాఖలో సోమవారం ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ, డైరెక్టర్లు, సీజీఎంలు, జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను ప్రజలకు వివరించి, అపోహలు తొలగించాలి. అప్పటికీ వారు అంగీకరించకపోతే చెక్ మీటరు కూడా ఏర్పాటు చేసి, రెండింటిలో ఎటువంటి తేడా లేదని వారికి అర్థమయ్యేలా చేయాలి. ఎంపిక చేసిన వర్గాల (జర్నలిస్టులు, అపార్టుమెంట్ అసోసియేషన్లకు)కు ముందు ఏర్పాటుచేసి, పరిశీలించాలి. అధిక బిల్లులు, ఇతర చార్జీలు వస్తున్నాయని తేలితే సీఎం దృష్టిలో పెట్టి స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేద్దాం’ అని మంత్రి అన్నారు.