CM Chandrababu: జూన్‌లోగా 1.4 కోట్ల స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:08 AM
రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను(ఎ్‌ఫబీఎంఎస్) అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
మెరుగైన సంక్షేమం, సేవల కోసమే.. కార్డులో సమస్త సమాచారమూ ఉండాలి
ఆర్టీజీఎస్ డేటా లేక్ నుంచి తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను(ఎ్‌ఫబీఎంఎస్) అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని ఆయన సూచించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై సోమవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవల్ని, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలి. రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలి. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలి. 25 రకాల వివరాలతో పాటు పీ4 లాంటి అంశాలను అందులో చేర్చాలి. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలి. వాక్సినేషన్, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్‌షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలి. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్‌బీఎంఎస్ వ్యవస్థను పరిమితం చేయవద్దు. పౌరులకు చెందిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలి. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడంతో పాటు సులభంగా పౌరసేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేలా చూడాలి. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను పొందేలా చూడాలి. ఆధార్ సహా అన్ని వివరాలు ఈ ఒక్క కార్డు ద్వారా తెలిసేలా రూపొందించాలి. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్‌లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.