Share News

AP Govt: సచివాలయంలోకి స్మార్ట్‌ ఎంట్రీ

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:20 AM

పరిపాలనకు గుండె కాయలాంటి సచివాలయం భద్రత విషయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనుమతి లేకుండా ఎవరుపడితే వాళ్లు లోపలికి ప్రవేశించకుండా పటిష్ఠ చర్యలు చేపట్టింది.

AP Govt: సచివాలయంలోకి స్మార్ట్‌ ఎంట్రీ

  • ఉద్యోగులు, జర్నలిస్టులకు స్మార్ట్‌ కార్డులు

  • సందర్శకులకు క్యూఆర్‌ కోడ్‌తో స్లిప్పులు

  • వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌ తరహా స్టిక్కర్లు

  • భద్రతకు ఆధునిక టెక్నాలజీ వినియోగం

  • చకచకా ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

  • సెక్యూరిటీ లోపాలకు చెక్‌.. భద్రత కట్టుదిట్టం

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పరిపాలనకు గుండె కాయలాంటి సచివాలయం భద్రత విషయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనుమతి లేకుండా ఎవరుపడితే వాళ్లు లోపలికి ప్రవేశించకుండా పటిష్ఠ చర్యలు చేపట్టింది. సెక్యూరిటీ లోపాలకు చెక్‌ పెట్టేందుకు వీలుగా.. స్మార్ట్‌ కార్డులు, క్యూఆర్‌ కోడ్‌ స్లిప్‌లు, స్కిక్కర్ల ద్వారా ఉద్యోగులు, సందర్శకులతోపాటు వాహనాలను లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. అమరావతి సచివాలయ ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ రూంలో సంబంధిత పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు, ఉద్యోగులు, జర్నలిస్టులు ప్రభుత్వం ఇచ్చిన ఐడీ కార్డులు గేటువద్ద భద్రతా సిబ్బందికి చూపించి లోపలకు ప్రవేశించే వారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అందించే మ్యాగ్నెటిక్‌ స్ర్టిప్‌లతో కూడిన స్మార్ట్‌ కార్డులు చూపించే లోపలికి, బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌ కార్డును స్కాన్‌ చేయగానే బ్యారియర్లు ఆటోమేటిక్‌గా తెరుచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎవరు ఎప్పుడు లోపలికి ప్రవేశించింది, ఎప్పుడు బయటకు వెళ్లింది.. అనే వివరాలు స్పష్టంగా రికార్డవుతాయి.


బెంగళూరు కంపెనీకి పనులు..

సచివాలయ సిబ్బంది లోపలికి ప్రవేశించేటప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వారిని గుర్తించాక, స్మార్ట్‌ కార్డును స్కాన్‌ చేయడం ద్వారా లోపలికి ఎంట్రీ అయ్యేలా ప్రోగ్రాం సెట్‌ చేస్తున్నారు. ఈ పనులను బెంగుళూరుకు చెందిన సత్యోలాజీ సంస్థకు అప్పగించారు. సాధారణ పరిపాలనశాఖ నుంచి ఇప్పటికే ఉద్యోగుల డేటాను తీసుకున్న ఆ సంస్థ వారం, పది రోజుల్లో స్మార్ట్‌ ఎంట్రీ పనులు పూర్తిచేస్తుందని, త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. అమరావతి సచివాలయంలో రెగ్యులర్‌తోపాటు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మొత్తం కలిపి రెండు వేల మంది వరకు ఉంటారు. కేబినెట్‌ సమావేశాల సమయంలో, అసెంబ్లీ సమావేశాల సమయంలో సచివాలయానికి సందర్శకుల తాకిడి రెట్టింపవుతుంది. ఆ సమయంలో అందరినీ మాన్యువల్‌గా పరిశీలించి లోపలికి పంపాలంటే కష్టంగా మారుతుంది. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్న టెక్నాలజీతో ఈ పని సులువుకానుంది. అలాగే భద్రత కూడా కట్టుదిట్టమవుతుంది.


అన్ని వివరాలూ క్యూఆర్‌ కోడ్‌లోనే...

సచివాలయంలోని మంత్రుల పేషీల వద్దకు, అధికారుల వద్దకు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం, ఇతర పనుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. వారంతా ఇప్పటివరకు సంబంధిత అధికారి పేషీ నుంచిగానీ, మంత్రి పేషీ నుంచిగానీ వచ్చిన మెసేజ్‌తోపాటు, గేటు వద్ద భద్రతా సిబ్బందికి ఆధార్‌ కార్డు చూపించి పాస్‌ తీసుకుని లోపలికి ప్రవేశించేవారు. ఇక నుంచి అలాకాకుండా వారికిచ్చే పాస్‌లోనే క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి ఇస్తారు. లేదా వారి ఫోన్‌ నంబర్‌కు క్యూఆర్‌ కోడ్‌ పంపుతారు. ఇందులో ప్రతి సందర్శకుడికీ ఒక విజిటింగ్‌ ఐడీ వస్తుంది. దీనిలో పేరు, వయస్సు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని మీద, ఎవరిని కలవడానికి వచ్చారు..? అనే వివరాలన్నీ ఉంటాయు. భద్రతా సిబ్బంది పరీశీలన అనంతరం ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే బ్యారియర్లు తెరుచుకుంటాయి.

వాహనాలకు ప్రత్యేక స్టిక్కర్లు

సచివాలయానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌ తరహాలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ ఎఫ్‌ఐడీ) స్టిక్కర్లు ఇవ్వనున్నారు. ఆ స్టిక్కర్లను అంటించుకున్న వాహనాలు గేటు వద్దకు రాగానే అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలు దానిపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి వాహనాన్ని లోపలకు అనుమతిస్తుంది. కారులో ఎవరు వచ్చారనేది కూడా సీసీ కెమెరాల్లో రికార్డవుతుంది. దీంతో అనుమతి లేకుండా సచివాలయంలోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించే అవకాశం ఉండదు.

Updated Date - Jul 08 , 2025 | 04:21 AM