Share News

Visakhapatnam: గాల్లో తేలినట్టుందే..

ABN , Publish Date - Sep 02 , 2025 | 05:20 AM

గాలిలో తేలియాడుతున్న అద్దాల బ్రిడ్జిపై నుంచి సాగర అందాలను వీక్షిస్తుంటే... ఆ మజానే వేరు..! మాటల్లో వర్ణించలేని ఈ మధురానుభూతిని ప్రకృతి ప్రేమికులకు అందించేందుకు...

Visakhapatnam: గాల్లో తేలినట్టుందే..

  • అద్దాల వంతెనపై నుంచి విశాఖ అందాల వీక్షణ

  • రాష్ట్రంలో తొలిసారిగా కైలాసగిరిపై స్కై బ్రిడ్జి ఏర్పాటు

  • విశాఖ తీరంలో సిద్ధమవుతున్న మరో పర్యాటక ఆకర్షణ

విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గాలిలో తేలియాడుతున్న అద్దాల బ్రిడ్జిపై నుంచి సాగర అందాలను వీక్షిస్తుంటే... ఆ మజానే వేరు..! మాటల్లో వర్ణించలేని ఈ మధురానుభూతిని ప్రకృతి ప్రేమికులకు అందించేందుకు విశాఖ తీరంలో కైలాసగిరిపై ‘స్కై బ్రిడ్జి’ సిద్ధమవుతోంది. విశాఖలోనే కాదు.. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాంటి అద్దాల బ్రిడ్జి త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. వీఎంఆర్‌డీఏ నిర్వహిస్తున్న పర్యాటక కేంద్రం కైలాసగిరిపై పీపీపీ విధానంలో ఈ స్కై బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం రూ.7 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. కేరళలో ఈ తరహా ప్రాజెక్టు స్ఫూర్తితో దానికి కాస్త మార్పులు చేసి ఇక్కడ కైలాసగిరిపై టైటానిక్‌ షిప్‌ వ్యూ పాయింట్‌ పక్కనే స్కై బ్రిడ్జిని నిర్మించారు. ఇది కొండపై నుంచి సముద్రం వైపు సుమారు వంద అడుగుల పొడవు ఉంటుంది. కేంటీ లివర్‌ విధానంలో కింద ఎటువంటి ఆధారం లేకుండా నిర్మించారు. భారత్‌లోనే అతిపెద్ద కేంటీ లివర్‌ గ్లాస్‌ వంతెనగా ఇది నిలవనుంది. సముద్రపు గాలికి తుప్పు పట్టని స్టీల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అద్దాలు, ఇతర రోప్‌లు బెంగళూరు నుంచి తెప్పించారు. దీనిపైకి ఒకేసారి 100 మంది పర్యాటకులు వెళ్లి సముద్రం, పరిసర ప్రాంతాల అందాలను వీక్షించవచ్చు. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తామని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌ తెలిపారు.

Updated Date - Sep 02 , 2025 | 05:21 AM