Share News

AP CM Chandrababu: ఉద్యోగాల గేట్‌ వే.. నైపుణ్యం పోర్టల్‌

ABN , Publish Date - Oct 31 , 2025 | 05:53 AM

యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్‌.. ఉద్యోగాల గేట్‌వేగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

AP CM Chandrababu: ఉద్యోగాల గేట్‌ వే.. నైపుణ్యం పోర్టల్‌

  • దేశ, విదేశీ ఉద్యోగాల సమాచారమిచ్చేలా అభివృద్ధి

  • ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్‌ మేళాలు

  • వాట్సాప్‌ ద్వారా ఉద్యోగావకాశాల సమాచారం

  • యువత కోరుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ

  • నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

  • క్లస్టర్ల విధానంపై ఆస్ట్రేలియాలో అధ్యయనం: లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్‌.. ఉద్యోగాల గేట్‌వేగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తున్నాయో అందరికీ తెలిసేలా ఆ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. ఇక నుంచి ప్రతినెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్‌ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. 2029 నాటికల్లా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. గురువారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై సీఎం సమీక్ష నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి లోకేశ్‌తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ, ‘యువతకు నైపుణ్య కల్పన కోసం దేశ, విదేశాలకు చెందిన సంస్థలను సంప్రదించాలి. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధీ పొందని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నైపుణ్యం పోర్టల్‌ను తీర్చిదిద్దాలి. అభ్యర్థులు కోరుకునే ఉద్యోగం, ఉపాధి అవకాశాలను పొందేందుకు తగిన వివరాలను పోర్టల్‌లో పొందుపర్చాలి’ అని సూచించారు.


విదేశీ భాషల్ని నేర్చుకునేలా శిక్షణ

‘ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలు, వర్సిటీలు, వివిధ విద్యాసంస్థలతో పరిశ్రమలు, సంస్థలను అనుసంధానించడం ద్వారా ఆయా విద్యా సంస్థలకు భవిష్యత్‌ ఉద్యోగ అవకాశాలను తెలిసేలా చేయాలి. నైపుణ్య పరీక్షకు కూడా పోర్టల్‌లో అవకాశం కల్పించాలి. పాఠశాల స్థాయిలో విద్యార్థుల నూతన ఆవిష్కరణలను మరింత ఉన్నతీకరించేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్టీఐహెచ్‌)తో అనుసంధానించాలి. విదేశాల్లో ఉద్యోగావకాశాలు సులభంగా పొందేందుకు వీలుగా ఆయా దేశాల స్థానిక భాషలను నేర్చుకునేలా శిక్షణ ఇవ్వాలి. ఏపీఎన్‌ఆర్టీ ద్వారా ఉద్యోగ సమాచారం పొందేలా చూడాలి. ఆపోర్టల్‌ ద్వారా యువత కోరుకున్న నైపుణ్య శిక్షణ, ప్రస్తుతమున్న సామర్థ్యాలను మెరుగుపరుచుకునేలా పునఃశిక్షణ, ఉత్తమ శిక్షణ అందించాలి’ అని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జాబ్‌ మేళాల్లో 1.44 లక్షల మందికి ఉద్యోగాలు

రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన జాబ్‌ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని సీఎం తెలిపారు. నైపుణ్యం పోర్టల్‌ నుంచి ఏఐ ద్వారా అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లను రూపొందించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. వాట్సాప్‌ ద్వారా ఉద్యోగావకాశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పారు. శిక్షణ అందించే రంగం, వేదిక, జాబ్‌ మేళాలు నిర్వహించే ప్రాంతం, ఏయే సంస్థల్లో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనే సమాచారం అందించేలా నైపుణ్యం పోర్టల్‌ను తీర్చిదిద్దామని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేలా ఏఐ సిమ్యులేటర్‌ సైతం ‘నైపుణ్యం’ పోర్టల్‌లో అందుబాటులో ఉందని చెప్పారు.

క్లస్టర్ల ఆధారంగా నైపుణ్య శిక్షణ: మంత్రి లోకేశ్‌

క్లస్టర్ల ఆధారంగా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ చెప్పారు. స్పేస్‌, ఆక్వా, క్వాంటమ్‌ తదితర రంగాల్లోని సంస్థలు, పరిశ్రమల్లోని ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను నిరుద్యోగ యువతకు అందించేలా కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, ఈ విధానంపై ఆస్ట్రేలియాలో అధ్యయనం చేస్తున్నామని ముఖ్యమంత్రికి మంత్రి లోకేశ్‌ వివరించారు.

Updated Date - Oct 31 , 2025 | 05:54 AM