Job Opportunities: వాయిదాల్లో నైపుణ్యం
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:01 AM
యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నైపుణ్యం’ పోర్టల్‌పై నైపుణ్యాభివృద్ధి శాఖ తీవ్ర కాలయాపన చేస్తోంది.
పోర్టల్ ప్రారంభంలో నైపుణ్యాభివృద్ధి శాఖ తీవ్ర కాలయాపన
సీఎం, మంత్రి ఆదేశించినా పరిస్థితి మారలేదు
యువతకు ఎదురుచూపులు తప్పట్లేదు
నైపుణ్య గణన అడ్రస్ గల్లంతు.. పైలెట్‌తోనే సరి
సర్వేనీ దాచిపెట్టిన నైపుణ్యాభివృద్ధి సంస్థ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నైపుణ్యం’ పోర్టల్‌పై నైపుణ్యాభివృద్ధి శాఖ తీవ్ర కాలయాపన చేస్తోంది. పోర్టల్ అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా, వెబ్‌సైట్ మాత్రం ప్రారంభం కావడం లేదు. మరోవైపు ప్రతిష్ఠాత్మకం అని ప్రకటించి చేపట్టిన నైపుణ్య గణన అడ్రస్ లేకుండా పోయింది. ఆరు నెలల్లో రాష్ట్రమంతా నైపుణ్య గణన పూర్తిచేస్తామని అప్పట్లో కూటమి ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటికి ఏడాదిన్నర దాటినా అసలు పైలెట్ ప్రాజెక్టు ఏమైందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం నైపుణ్యం పోర్టల్ అయినా అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు, నైపుణ్యం, జాబ్ మేళాలకు సంబంధించిన సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని యువత ఎంతగానో ఎదురుచూస్తోంది. కానీ నైపుణ్యాభివృద్ధి శాఖ మాత్రం అసలు ఆ వెబ్‌సైట్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వట్లేదు. పోర్టల్ ప్రారంభించేస్తున్నాం అంటూ మూడు, నాలుగు నెలలుగా హడావుడి చేస్తున్నారు. సెప్టెంబరులోనే పోర్టల్ ప్రారంభించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఆదేశించినా ఫలితం లేదు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పోర్టల్ ప్రారంభించాలని ఆ సదస్సుకు ముందు జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అయినా దానిపై ఎలాంటి పురోగతి కనిపించలేదు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయట్లేదు. కనీసం ఎప్పుడు పోర్టల్ అందుబాటులోకి వస్తుందనే సమాచారం కూడా యువతకు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
సమగ్రంగా పోర్టల్ తయారీ
నైపుణ్యం వెబ్‌సైట్‌ను సమగ్రంగా రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు వెల్లడించింది. యువత వెబ్‌సైట్‌లోకి వెళ్లి వారి వివరాలను ఇస్తే ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ తయారవుతుంది. అలాగే వారి నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు దేశంలో ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయనే సమాచారం కూడా అందుబాటులో ఉంచుతారు. నైపుణ్య కోర్సులు వాటి వివరాలు, నైపుణ్య కేంద్రాలు ఎక్కడున్నాయనే సమాచారం కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించే జాబ్‌మేళాల సమాచారం కూడా అందులో పెడతారు. యువత వారికి ఉన్న నైపుణ్యాలతో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? అనే అవకాశం కూడా లభిస్తుంది. ఈ పోర్టల్‌ను స్కిల్ ఇండియా పోర్టల్‌తోనూ అనుసంధానం చేస్తున్నారు.
నైపుణ్య గణన ఏమైంది?
మరోవైపు నైపుణ్య గణన అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రంలో 18 నుంచి 59ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కరి నైపుణ్యాలపై సర్వే చేయడం దీని ఉద్దేశం. తద్వారా రాష్ట్రంలో ఏ నైపుణ్యాలున్న వారు ఎంతమంది ఉన్నారు? వారి నైపుణ్యాలకు తగ్గట్టుగా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి? నైపుణ్యాలను మరింతగా ఎలా మెరుగుపరచాలి? అనేవి తెలుసుకునేందుకు, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకునే లక్ష్యంతో దీనిని చేపట్టారు. తొలుత మంగళగిరి నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా నైపుణ్య గణన ప్రారంభించారు. దీనిపై పలుమార్లు సీఎంకు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధి సంస్థ దానిపై మౌనాన్ని పాటిస్తోంది. చివరికి మంగళగిరి పైలెట్ సర్వే వివరాలను కూడా బయటపెట్టకుండా దాచిపెట్టింది.