మరో రెండు హత్యలకు స్కెచ్!
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:50 AM
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరొకరితో ప్రేమాయణం నడుపుతోందని.. పిల్లలు కూడా తనకు పుట్టలేదనే అనుమానంతో అతడు ఉన్మాదిగా మారాడు. నాన్న అంటూ ఆప్యాయంగా పిలిచే ఇద్దరు బిడ్డలను కర్కశంగా చంపేశాడు. ఆ తర్వాత విదేశాల్లో ఉన్న భార్యను రప్పించి ఆమెను, ఆమెతో చనువుగా ఉండే వ్యక్తిని కూడా అంతం చేయడానికి స్కెచ్ వేసుకున్నాడు. అందర్నీ తప్పుదోవ పట్టించేందుకు తాను చనిపోతున్నానని లేఖ రాసి అదృశ్యమైన వేములవాడ రవిశంకర్ ఎట్టకేలకు సింహాచలంలో పోలీసులకు చిక్కాడు. మైలవరంలో ఈ నెల 8వ తేదీన జరిగిన అక్కాతమ్ముళ్ల హత్య 12 తేదీన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో అతడు హత్యల ప్రణాళికలను వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ సారి భార్య చంద్రిక, ఆమెతో చనువుగా ఉండే వ్యక్తి లక్ష్యం
భీమవరంలో భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం
మైలవరంలో ఇద్దరు చిన్నారుల హత్య కేసులో వెలుగులోకి కొత్త కోణం
సింహాచలం బస్టాండ్‌లో చిక్కిన నిందితుడు రవిశంకర్
పిల్లలను చంపినట్టు ముందుగా హోటల్ యజమానికి చెప్పిన నిందితుడు
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరొకరితో ప్రేమాయణం నడుపుతోందని.. పిల్లలు కూడా తనకు పుట్టలేదనే అనుమానంతో అతడు ఉన్మాదిగా మారాడు. నాన్న అంటూ ఆప్యాయంగా పిలిచే ఇద్దరు బిడ్డలను కర్కశంగా చంపేశాడు. ఆ తర్వాత విదేశాల్లో ఉన్న భార్యను రప్పించి ఆమెను, ఆమెతో చనువుగా ఉండే వ్యక్తిని కూడా అంతం చేయడానికి స్కెచ్ వేసుకున్నాడు. అందర్నీ తప్పుదోవ పట్టించేందుకు తాను చనిపోతున్నానని లేఖ రాసి అదృశ్యమైన వేములవాడ రవిశంకర్ ఎట్టకేలకు సింహాచలంలో పోలీసులకు చిక్కాడు. మైలవరంలో ఈ నెల 8వ తేదీన జరిగిన అక్కాతమ్ముళ్ల హత్య 12 తేదీన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో అతడు హత్యల ప్రణాళికలను వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
పశ్చిమ గోదావరి భీమవరానికి చెందిన చంద్రికను మైలవరానికి చెందిన రవిశంకర్ ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆమెకు లక్ష్మీహిరణ్య(9), లీలాసాయి(7) పుట్టారు. తొలుత ఈ కుటుంబం భీమవరంలో ఉండేది. అక్కడే రవిశంకర్ హోటల్‌లో పనిచేసేవాడు. అక్కడ బాబీ అనే వ్యక్తితో చంద్రిక సన్నిహితంగా ఉండేది. దీన్ని గమనించిన రవిశంకర్‌కు ఆమెపై అనుమానం పెరిగింది. లక్ష్మీహిరణ్య, లీలాసాయి తనకే పుట్టారా అన్న అనుమానం బలపడింది. రోజురోజుకు చంద్రిక, బాబీల వ్యవహారం శ్రుతిమించుతుండడంతో భీమవరం నుంచి మైలవరానికి మకాం మార్చాడు. ఇక్కడ ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. చంద్రిక ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లింది. ఆమె అక్కడికి వెళ్లడం వెనుక బాబీ ప్రోద్బలం ఉన్నట్టు తెలిసింది.
కొడుకును ఉరితీసి.. కుమార్తెను ఊపిరాడకుండా చేసి..
బహ్రెయిన్ వెళ్లొద్దని రవిశంకర్ చెబుతుండటంతో పలుమార్లు ఇద్దరి మధ్య వివాదాలు జరిగాయి. అయినా ప్రియుడు చెప్పినట్టుగానే ఆమె బహ్రెయిన్ వెళ్లింది. పిల్లలపై ఆది నుంచి అనుమానంతో ఉన్న రవిశంకర్‌కు అవకాశం దొరికింది. ఈ నెల ఎనిమిదో తేదీన కుమార్తె లక్ష్మీహిరణ్య, కుమారుడు లీలాసాయికి మరణశాసనం రాశాడు. ఆ రోజు ఉదయం 11 గంటల సమయంలో చంద్రిక చీరను తీసి పైన ఉన్న సీలింగ్‌కు కట్టి ఉరివేసుకున్నట్టుగా మెడలో వేసుకున్నాడు. దీన్ని చూసిన కుమారుడు తండ్రిని ప్రశ్నించాడు. చీరను సీలింగ్‌కు కడుతున్నావు ఉరి వేసుకుంటావా నాన్న అని అడిగాడు. అటువంటిదేమీ లేదని చెప్పిన రవిశంకర్ మెడలో వేసుకుని చూడు అని లీలాసాయికి ఉరిని బిగించి వదిలేశాడు. అది బిగుసుకుపోవడంలో విలవిలాడుతూ ఆ బాలుడు ప్రాణాలు వదిలేశాడు. దీన్ని మంచం పక్కనే ఉన్న లక్ష్మీహిరణ్య గమనించి భయంతో దాక్కుంది. కుమార్తెను బలవంతంగా మంచంపై పడుకోబెట్టి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశాడు. లక్ష్మీహిరణ్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఉరికి వేలాడుతున్న లీలాసాయిని దించి కుమార్తె పక్కన పడుకోబెట్టాడు. తర్వాత చీరను విప్పేసి మామూలుగా మడతపెట్టి యథాస్థానంలో ఉంచాడు. తర్వాత చాలా తెలివిగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక లేఖను రాసిపెట్టాడు. నిద్రలో పిల్లలు ఇద్దరూ చనిపోయిన భావన కలిగేలా సీన్ చూపించాడు. అనంతరం తలుపులకు గడియ పెట్టి తాళాలు వేశాడు. పొలాల్లో ఉండే గడ్డి మందు డబ్బాను ఇంటి బయట ఉన్న స్టూల్‌పై పెట్టాడు. పిల్లలకు ఆహారంలో గానీ, డ్రింక్‌లో గానీ ఈ మందు కలిపి ఇచ్చాడన్న కోణం స్పృశించేలా చేశాడు.
భార్య, బాబికి స్కెచ్ రెడీ
రవిశంకర్ అనుమానంతో ఒక్కొక్కరిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా పిల్లలు ఇద్దరిని చంపేశాడు. ఇది జరిగిన తర్వాత బహ్రెయిన్‌లో ఉంటున్న భార్య చంద్రిక వస్తుందని భావించాడు. పిల్లల మరణ వార్త మరుగున పడిన తర్వాత ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. చంద్రికను చంపిన తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతున్న బాబిని హత్య చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన రెండు ప్రణాళికలను రవిశంకర్ సిద్ధం చేసుకున్నాడు. చంద్రిక, బాబిలను చంపడానికి నిర్ణయించుకున్నప్పటికీ ఎలా చంపాలన్న దానిపై రవిశంకర్ ఒక స్పష్టతకు రాలేదని తెలుస్తోంది.
మంటల్లో సిమ్‌కార్డు పడేసి..
లక్ష్మీహిరణ్య, లీలాసాయిని చంపేసిన తర్వాత రవిశంకర్ ఇంటి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లాడు. ఇక్కడ మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి తాగాడు. సరిగ్గా ఇక్కడ ఉన్నప్పుడే మైలవరం నుంచి హోటల్ యజమాని ఫోన్ చేశాడు. తొమ్మిదో తేదీన పనికి వస్తున్నావా లేదా అని అడిగాడు. అప్పుడు అతడికి జరిగిన విషయం మొత్తం రవిశంకర్ చెప్పినట్టు సమాచారం. తన ఇద్దరు పిల్లలను చంపుకున్నానని, తాను ఏదో ఒకటి చేసుకుంటానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మళ్లీ ఇంకా ఫోన్లు వస్తాయని భావించి కొండపల్లి ఖిల్లా రోడ్డులో మండుతున్న చెత్తలో సిమ్ తీసి పడేశాడు. ఆ తర్వాత విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాడు. అక్కడ కొత్త సిమ్‌కార్డు తీసుకుని స్మార్ట్‌ఫోన్‌లో వేసుకున్నాడు. అక్కడి నుంచి సింహాచలం వెళ్లి మైలవరంలో ఉన్న ఓ వ్యక్తికి ఫోన్ చేశాడు. ఈ సిగ్నల్‌ను ట్రాక్ చేసిన పోలీసులు సింహాచలం బస్టాండ్‌లో రవిశంకర్‌ను పట్టుకున్నారు. పిల్లలను చంపడానికి ముందు నుంచి రవిశంకర్ గడ్డం పెంచుకున్నాడు. సింహాచలంలో గడ్డం తీసేశాడు. బస్టాండ్‌లో అతడిని పోలీసులు గుర్తించినా రవిశంకరేనా అన్న సందిగ్ధం కలిగింది. అతడిపై పోలీసులు చేయి వేయగానే సార్... అంటూ కంగారుపడ్డాడు. రవిశంకర్‌ను అరెస్టు చేసి మైలవరం తీసుకొచ్చి శనివారం విచారించారు. ఈ వివరాలను పోలీసులు ఆదివారం అధికారికంగా వెల్లడించబోతున్నారు.