365 కోట్లతో 6 ఫిషింగ్ హార్బర్లు: జనార్దనరెడ్డి
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:36 AM
రాష్ట్రంలో ఆరు ఫిషింగ్ హార్బర్లను ఫేజ్-2లో నిర్మిస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 365 కోట్లు వరకూ ఇస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు.
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరు ఫిషింగ్ హార్బర్లను ఫేజ్-2లో నిర్మిస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 365 కోట్లు వరకూ ఇస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో నౌకా నిర్మాణ పరిశ్రమలకు సంబంధించి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్, షిప్ బ్రేకింగ్ పరిశ్రమలను ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒకచోట షిప్ బిల్డింగ్ ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. తొలుత బుడగట్లపాలెంలో రూ. 186 కోట్లలో షిప్ హార్బర్ నిర్మించాలని అంచనాల సిద్ధం చేశామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ, నౌక నిర్మాణం, రిపేరు, బ్రేకింగ్ యూనిట్లు ఏపీలో ఒక్కటి కూడా లేదన్నారు. గతంలో ఏపీలో నౌకా నిర్మాణ పరిశ్రమ ఉండేదన్నారు. ఆ పరిశ్రమలతో కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాయితీలు ప్రకటిస్తే మంచి సంస్థలు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. అనకాపల్లి ఎమ్మెల్యేల కొణతాల మాట్లాడుతూ, నౌకలకు సంబంధించి ఏపీలో విశాఖపట్నానికి కీలక స్థానం ఉందన్నారు. గతంలో ఇక్కడ ఉన్న నౌకా నిర్మాణ పరిశ్రమను నేవీలో కలిపేశారని చెప్పారు.