Road Accident: దూసుకొచ్చిన మృత్యువు
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:44 AM
రహదారులు రక్తమోడాయి. నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల్లో ఆగి ఉన్న వాహనాలను వేరే వాహనాలు మృత్యువులా దూసుకొచ్చి ఢీకొనడంతో ఆరుగురు బలయ్యారు.
రెండు ప్రమాదాల్లో ఆరుగురు బలి
నంద్యాలలో ప్రైవేట్ బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరు టెకీలు మృతి
సిక్కోలులో లారీని ఢీకొన్న కారు
నలుగురు మధ్యప్రదేశ్‌వాసుల దుర్మరణం
మొత్తం 15 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
డ్రైవర్ల నిద్రమత్తు, అతివేగమే ప్రమాదాలకు కారణం!
ఆళ్లగడ్డ, కోటబొమ్మాళి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రహదారులు రక్తమోడాయి. నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల్లో ఆగి ఉన్న వాహనాలను వేరే వాహనాలు మృత్యువులా దూసుకొచ్చి ఢీకొనడంతో ఆరుగురు బలయ్యారు. మృతుల్లో నలుగురు మధ్యప్రదేశ్‌వాసులు కాగా, హైదరాబాద్‌కు చెందిన.. స్నేహితులైన ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. రెండు ఘటనల్లోనూ డ్రైవర్లు నిద్రమత్తులో, వాహనాలను అతివేగంగా నడపడంతో ప్రమాదాలకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. వివరాలివీ.. మైత్రి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి 33 మంది ప్రయాణికులతో శనివారం పుదుచ్చేరికి బయలు దేరింది. ఆదివారం తెల్లవారుజామున నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె మెట్ట వద్దకు రాగానే ఇద్దరు ప్రయాణికులు బహిర్భూమికి వెళ్లాలని డ్రైవర్‌ను కోరడంతో ఆయన బస్సును హైవే పక్కన నిలిపారు. ఇంతలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ.. బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో వెనుక సీట్లలో కూర్చున్న పుదుచ్చేరికి చెందిన పి.హరిత(23), జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గడ్డం బద్రీనాథ్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిదిమంది గాయపడగా ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన బండ్ల శ్రావ్య, రాయచోటికి చెందిన ఖాదర్‌వలీ, ఆశాబేగం, లారీ డ్రైవర్ సురేశ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నంద్యాల ఆసుపత్రికి తరలించారు.
సీటు మారిన వ్యక్తి సేఫ్.. ఆ స్థానంలో కూర్చొన్న యువతి బలి
గడ్డం బద్రీనాథ్, హరిత స్నేహితులు. వీరు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పుదుచ్చేరిలో ఉన్న స్నేహితులను కలిసి.. అక్కడ విహార యాత్రకు వెళ్లాలని హైదరాబాద్ నుంచి మైత్రి ట్రావెల్ బస్సులో బయలుదేరారు. సీటు నంబరు ఎఫ్-6 బద్రీనాథ్‌కు, ఎఫ్-2 హరితకు రిజర్వ్ అయింది. అయితే తనకు రిజర్వ్ అయిన ఎఫ్-2 సీట్‌లో కూర్చోవాలని హరిత ఎఫ్-4 సీటులో కూర్చున్న హైదరాబాద్‌కు చెందిన నరసింహారెడ్డిని కోరింది. దీంతో ఇద్దరూ తమ సీట్లను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. స్నేహితులిద్దరూ సమీపంలోని సీట్లలో కూర్చున్నారు. ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందగా, నరసింహారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు.
దక్షిణాది తీర్థయాత్రలకు వస్తూ..
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో హైవేపై ఆగి ఉన్న లారీని ఓ తుఫాన్( ట్రావెల్ కారు) వాహనం ఢీకొంది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన బోరో సింగ్ పవర్(60), విజయ్‌సింగ్ తోమర్(65), ఉషీర్‌సింగ్(62), సంతోషిబాయి(62) మృతి చెందారు. శకుంతల బాయి, సుమన్‌బాయి, సంతోషి బాయి, సావిత్రిబాయి, సహస్రబాయితో పాటు వాహన డ్రైవర్ సునీల్ సింగ్ పటేల్ తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీప ఖండవ జిల్లా నేతన్య గ్రామానికి చెందినవారు. ఈ నెల 10న ఉత్తర, దక్షిణాది యాత్రల కోసం తుఫాన్ వాహనంలో బయలుదేరారు. నేపాల్, కాశీ, గోరక్‌పూర్, మధుబనీ, గయా పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న తర్వాత శనివారం పూరి చేరారు. అక్కడ జగన్నాథుడిని దర్శించుకుని శ్రీశైలం వెళ్లేందుకు పయనమయ్యారు. శనివారం రాత్రి 2.30 గంటల సమయంలో కోటబొమ్మాళిలోని ఎత్తురాళ్లపాడు వద్ద హైవేపై ఆగిఉన్న లారీని వీరి వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వాహన డ్రైవర్ సునీల్ సింగ్ పటేల్ కారు వేగంగా నడుపుతుండగా.. నిద్ర ముంచుకురావడంతో అదుపు తప్పి లారీని ఢీకొన్నట్లు ప్రాథమిక సమాచారం.
మధ్యప్రదేశ్ సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్..!
మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆర్‌ఎస్ఎస్ ప్రతినిధుల సమాచారం మేరకు నరసన్నపేటలోని ఆర్‌ఎస్ఎస్ కార్యకర్తలు స్పందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేయించడంతోపాటు అన్నపానీయాలు అందజేశారు. ఘటనపై మధ్యప్రదేశ్ సీఎంవో కార్యాలయం నుంచి ఆంరఽధా సీఎంవో కార్యాలయానికి సమాచారం వచ్చింది. దీంతో సీఎంవో కార్యాలయ ఆధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని స్పష్టం చేశారు.