Tragic Loss: ఆరుగురు చిన్నారులను మింగిన నీటికుంట
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:11 AM
నీటి కుంటే ప్రాణాలు మింగేస్తుందని ఆ చిన్నారులకు తెలియదు. కేరింతలు కొడుతూ దానిలో స్నానానికి దిగారు.
ఆరుగురు బాలుర జలసమాధి
కర్నూలు జిల్లాలో మహా విషాదం
చిగిలి గ్రామంలో ఎర్రగరుసు తవ్వకాలు
ఆ గుంతల్లోకి భారీగా చేరిన వర్షపు నీరు
బడి వదిలాక స్నానానికి వెళ్లిన చిన్నారులు
ఒక్కొక్కరుగా నీట మునిగి మృత్యువాత
గ్రామంలో అలుముకున్న విషాదం
ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి
కర్నూలు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): నీటి కుంటే ప్రాణాలు మింగేస్తుందని ఆ చిన్నారులకు తెలియదు. కేరింతలు కొడుతూ దానిలో స్నానానికి దిగారు. ఒక్కొక్కరుగా మునిగిపోయి కాసేపటికే విగతజీవులయ్యారు. ఈ మహా విషాదం బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లాలో జరిగింది. ఐదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఎర్రమట్టి (గరుసు) తవ్విన గుంతలో నిలిచిన వర్షపు నీటిలో మునిగి మృత్యుఒడి చేరారు. చిన్నారుల మృతితో ఆస్పరి మండలం చిగిలి గ్రామం శోకసంద్రంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. చిగిలిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎర్రబాట శశికుమార్ (10), ఎర్రబాట కిన్నెరసాయి (10), కేసరం సాయికిరణ్ (10), ఉప్పలపాటి బీమా (10), గడ్ల వినయ్ (10), షేక్ మహాబూబ్ (10)తో పాటు దుర్గాప్రసాద్ ఐదో తరగతి చదువుతున్నారు. ఈ ఏడుగురు సాయంత్రం 3:35 గంటలకు పాఠశాల వదిలాక సరదాగా స్నానం చేద్దామని గ్రామానికి అర కిలో మీటరు దూరంలోని స్థానిక కొండల్లో ఎర్రమట్టి (గరుసు) తవ్వకాల వల్ల ఏర్పడ్డ గుంతల వద్దకు వెళ్లారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి గుంతలన్నీ నీటితో నిండిపోయాయి. దుర్గా ప్రసాద్ గట్టుపైనే నిల్చుండగా మిగిలిన ఆరుగురు చిన్నారులు ఓ నీటి కుంటలోకి దిగి మునిగిపోయారు. ఇది గమనించి గట్టుపై ఉన్న దుర్గాప్రసాద్ పరుగున వచ్చి ఊరి చివర ఉన్న గొర్రెల కాపరి చిన్నకు చెప్పాడు. అతను స్థానికంగా ఉన్న వడ్డే బాలరాజు, వీరశేఖర్‌ల విషయం చెప్పి అప్రమత్తం చేశాడు. వారు వెంటనే ఆ నీటి గుంత వద్దకు చేరుకున్నారు. అప్పటికే చిన్నారులు నీట మునిగిపోయారు. ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. కొన ఊపిరితో ఉన్న ఎర్రబాట కిన్నెరసాయిని ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. చిన్నారుల మృత్యువాతతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విద్యార్థుల మృతి తెలిసి సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. ఆ చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్ బాలుర మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
