Share News

Liquor Scam: చెవిరెడ్డి లీలలు, వెంకటేశ్‌ విన్యాసాలతోనేడు మూడో చార్జిషీటు!

ABN , Publish Date - Sep 15 , 2025 | 03:31 AM

జగన్‌ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో మూడో చార్జిషీటు సిద్ధమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సోమవారం దానిని బెజవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు...

Liquor Scam: చెవిరెడ్డి లీలలు, వెంకటేశ్‌ విన్యాసాలతోనేడు మూడో చార్జిషీటు!

  • మద్యం స్కాంలో వారిద్దరి బాగోతాన్నికోర్టుకు వివరించనున్న సిట్‌

  • రాజ్‌ కసిరెడ్డి నుంచి ముడుపుల సొమ్ము

  • తీసుకుని వైసీపీ అభ్యర్థులకు పంపిణీ బాలాజీ కుమార్‌, నవీన్‌ పాత్రనూ

  • పొందుపరిచే అవకాశం నారాయణస్వామి తదితరుల వాంగ్మూలాలు, నగదు డంప్‌లు, మనీ రూటింగ్‌ వివరాలు కూడా

అమరావతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో మూడో చార్జిషీటు సిద్ధమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సోమవారం దానిని బెజవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు చేసిన సిట్‌.. గత నెల 12న మరో అనుబంధ చార్జిషీటును కోర్టులో దాఖలు చేయడం తెలిసిందే. అందులో కోర్టు ప్రస్తావించిన చిన్న చిన్న పొరపాట్లను సరిచేసి సమర్పించింది. మొదటి చార్జిషీటులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేరు ప్రస్తావించిన సిట్‌.. రెండోదాంట్లో మరిన్ని కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సోమవారం వేస్తున్న మరో అనుబంధ చార్జిషీటులో వైసీపీ ప్రధాన కార్యదర్శి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన సన్నిహిత వ్యాపార భాగస్వామి వెంకటేశ్‌నాయుడు, చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకులు బాలాజీ కుమార్‌ యాదవ్‌(ఏ-35), ఎద్దల నవీన్‌ కృష్ణ(ఏ-36) పాత్రను వివరించనున్నట్లు తెలిసింది. మద్యం ముడుపుల తరలింపులో క్రియాశీల పాత్ర పోషించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(ఏ-38).. మద్యం సరఫరాదారుల నుంచి హైదరాబాద్‌లో రాజ్‌ కసిరెడ్డి (ఏ-1) వసూలు చేసిన సొమ్మును 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలోకి తరలించడం ప్రారంభించారు. తన దగ్గర పనిచేసే వ్యక్తులు, అనుచరులు, గన్‌మెన్లు, డ్రైవర్ల ద్వారా కోట్లాది రూపాయలు తీసుకొచ్చారు. తాడేపల్లి

ప్యాలె్‌సకు సమీపంలో డంప్‌ ఏర్పాటు చేసుకుని నాలుగు జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు 250 కోట్ల నుంచి రూ.300 కోట్లు పంపిణీ చేసినట్లు సిట్‌ గుర్తించింది. ఈ సొమ్మును హైదరాబాద్‌లోని రాజ్‌ కసిరెడ్డి గ్యాంగ్‌ వెంకటేశ్‌ నాయుడికి అందజేస్తే.. తర్వాత తిరుపతి అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ(తుడా) వాహనాల్లో చెవిరెడ్డి అనుచరులు హైదరాబాద్‌కు వెళ్లి డబ్బులు తీసుకొచ్చి ఏపీలో వైసీపీ నేతలకు చేర్చారు. ఈ క్రమంలో గత ఏడాది మే 9న.. లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో హైదరాబాద్‌ నుంచి తీసుకొస్తున్న రూ.8.37 కోట్లు ఎన్టీఆర్‌ జిల్లా సరిహద్దులో చిల్లకల్లు పోలీసుల తనిఖీల్లో బయట పడింది. ఆ సొమ్ము ఎవరిదని ఆరా తీసిన సిట్‌ అధికారులు.. మద్యం ముడుపులు అందుకుని వైసీపీ అభ్యర్థులకు ఇచ్చేందుకు తెస్తున్నట్లు తేలడంతో జప్తు చేశారు. ఆ డబ్బులు లెక్క పెట్టిన వీడియోలను వెంకటేశ్‌ నాయుడి సెల్‌ఫోన్‌లో గుర్తించి ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో నిర్ధారించుకున్నారు. ఈ ఆధారాలు చూపించి చెవిరెడ్డి, వెంకటేశ్‌నాయుడి పాత్రను కోర్టుకు వివరించనున్నట్లు సమాచారం.


పరారీ యత్నంలో పట్టివేత

మద్యం స్కాంలో తమను నిందితులుగా చేర్చినట్లు తెలియగానే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్‌నాయుడు శ్రీలంక మీదుగా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశారు. అప్పటికే సీఐడీ లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేయడంతో బెంగళూరు విమానాశ్రయంలో జూలై 17న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని సిట్‌ అధికారులకు అప్పగించారు. మరోవైపు బాలాజీ కుమార్‌ యాదవ్‌, ఎద్దల నవీన్‌ కృష్ణ పారిపోయి మధ్యప్రదేశ్‌లో మకాం వేశారు. వారి ఆచూకీ గుర్తించిన సిట్‌ అక్కడకు వెళ్లి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. చెవిరెడ్డి, వెంకటేశ్‌ విజయవాడ జిల్లా జైల్లో ఉండగా.. నవీన్‌, బాలాజీ గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు.

స్థానికంగా స్థిరాస్తుల.. ఆఫ్రికాలో పెట్టుబడులు..

మద్యం ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని చెవిరెడ్డి దారి మళ్లించి స్థిరాస్తి కొనుగోలు చేసినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. ఇటీవల తిరుపతిలో జరిపిన సోదాల్లో గూడూరులో రూ.6 కోట్లకు కొనుగోలు చేసి 26 కోట్లకు విక్రయించిన భూమి వివరాలు బయట పడ్డాయి. ఆ సొమ్ముతో తిరుపతి పరిసరాల్లో రైతుల నుంచి భూములు కొని.. తుడా నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించి భారీ ధరకు విక్రయించి రూ.వందల కోట్లు ఆర్జించినట్లు తేలింది. ఆ సొమ్మును ఆఫ్రికా దేశాల్లో మైనింగ్‌పై పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం. డొల్ల కంపెనీలు సృష్టించి మనీ రూటింగ్‌కు పాల్పడిన చెవిరెడ్డి.. స్థానికంగా భూముల కొనుగోలులో యజమానులను మోసగించినట్లు తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి భార్య నుంచి దక్కించుకున్న భూమి రిజిస్ట్రేషన్‌లో బయటపడింది. వీటితో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌) నారాయణస్వామి వాంగ్మూలం, విదేశాల్లో దాక్కుని ఇటీవలే సిట్‌ ముందుకొచ్చి వాస్తవాలు వెల్లడించినవారి వాంగ్మూలాలు సైతం తాజా చార్జిషీటులో పొందుపరిచే అవకాశముంది.

Updated Date - Sep 15 , 2025 | 07:28 AM