Share News

SIT: 20న వైవీ విచారణ

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:41 AM

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దేవస్థానం మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని సిట్‌ విచారించనుంది.

SIT:  20న వైవీ విచారణ

  • కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే సిట్‌ నోటీసులు

  • ఆరోగ్యం సహకరించనందున

  • తిరుపతి రాలేనని సుబ్బారెడ్డి సమాచారం

  • విచారణకు హైదరాబాద్‌ వెళ్లనున్న సిట్‌

తిరుపతి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దేవస్థానం మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని సిట్‌ విచారించనుంది. విచారణకు హాజరు కావాల్సిందిగా దర్యాప్తు అధికారులు ఆయనకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే తిరుపతి రావడానికి తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో 20న సిట్‌ అధికారులు హైదరాబాద్‌ వెళ్లి అక్కడే ఆయనను విచారించనున్నట్టు సమాచారం. కల్తీనెయ్యి కేసులో దర్యాప్తు మొదలయ్యాక గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఇప్పటి దాకా విచారించలేదు. టీటీడీకి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? కల్తీ ఎక్కడ జరిగింది? కల్తీ ఎలా చేశారు? అన్న కోణంలోనే విచారణ కొనసాగింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీపైనే దర్యాప్తు బృందం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కీలక వ్యక్తులను విచారించడంపై సిట్‌ దృష్టి సారించింది. నెయ్యి సరఫరాకు సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? వాటిని అమలు చేసిన అధికారులు ఎవరు? అన్న అంశాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ఎక్కువ కాలం పాటు టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి కల్తీ నెయ్యి కేసులో 6నెలలకు పైగా సిట్‌ ఆయనపై దృష్టి పెట్టింది. లోతుగా ఆరా తీస్తే భోలేబాబా డెయిరీ డైరెక్టర్లతో ఆయన పీఏ కడూరు చిన్న అప్పన్న మంతనాలు సాగించినట్టు, ఆర్థిక లావాదేవీలు నడిపినట్టు వెల్లడైంది. అతడిని రెండుసార్లు విచారించిన సిట్‌ గత నెల 29న అరెస్టు చేసి రిమాండుకు పంపింది. 20న సిట్‌ సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉండడంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెయ్యి సేకరణకు టెండరు నిబంధనలు సడలించడం దగ్గర నుంచీ కల్తీ నెయ్యి గురించి తెలిశాక కూడా సరఫరా కొనసాగించడం వరకూ గత ప్రభుత్వంలో టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలలో వైవీ పాత్ర ఎంతవరకూ ఉందనే విషయంపై సిట్‌ ప్రశ్నించే అవకాశముంది. అలాగే బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం, పీఏ చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తాలు డిపాజిట్‌ కావడం వంటి వాటిపై కూడా ఆయన ప్రశ్నలు ఎదుర్కొనే ఆస్కారముంది.

Updated Date - Nov 16 , 2025 | 04:42 AM