Share News

Sit Raids: మిథున్‌రెడ్డి ఇళ్లలో సిట్‌ సోదాలు

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:56 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)...

Sit Raids: మిథున్‌రెడ్డి ఇళ్లలో సిట్‌ సోదాలు

  • హైదరాబాద్‌, తిరుపతిలోని పీఎల్‌ఆర్‌ కార్యాలయాల్లో తనిఖీలు

  • మిథున్‌ తల్లి, పీఎల్‌ఆర్‌ డైరెక్టర్లను తిరుపతిలో ప్రశ్నించిన సిట్‌

  • లిక్కర్‌ స్కామ్‌లో ఆ సంస్థకు నిధుల బదిలీపై విచారణ

  • నాడు పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ ఎండీగా మిథున్‌ తల్లి స్వర్ణలత

అమరావతి, తిరుపతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మంగళవారం సోదాలు చేపట్టింది. మిథున్‌రెడ్డి తల్లి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత, పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్లు శివారెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డిలను ప్రశ్నించింది. హైదరాబాద్‌, తిరుపతి, బెంగుళూరుల్లో సోదాలు చేసిన సిట్‌ అధికారులు మద్యం కేసులో కీలక పాత్ర పోషించిన డికార్ట్‌ లాజిస్టిక్స్‌ నుంచి పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌కు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలిసింది. తిరుపతి మారుతీ నగర్‌లో ఉన్న మిథున్‌రెడ్డి నివాసంలో ఆయన తల్లి స్వర్ణలత (పీఎల్‌ఆర్‌ మాజీ ఎండీ)ను ప్రశ్నించారు. ఆ సమయంలో మిథున్‌రెడ్డి ఇంట్లో లేరని... పెద్దిరెడ్డి మాత్రం ఉన్నారని తెలిసింది. నాడు పీఎల్‌ఆర్‌ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న కారణంగా ఆమె నుంచి లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్లు తీసుకున్నట్టు సమాచారం. సిట్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఎక్కువగా.. తనకేమీ తెలీదని, కుమారుడే చూసుకుంటారని చెప్పినట్లు సమాచారం. ఆ సమయానికి పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్న పీఎల్‌ఆర్‌ నిర్మాణ సంస్థ ఉద్యోగులను కూడా సిట్‌ అధికారులు ప్రశ్నించి స్టేట్‌మెంట్లు తీసుకున్నట్టు తెలిసింది. అనంతరం ఏడు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అవసరమైతే మరోసారి విచారించడానికి వస్తామని సిట్‌ అధికారులు స్పష్టంచేసి వెనుదిరిగారు. సిట్‌ అధికారుల్లో ఒక బృందం తిరుపతిలో తనిఖీలు చేపట్టగా.. మరో రెండు బృందాలు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌, యూసు్‌ఫగూడ ప్రాంతాల్లో ఉంటున్న పీఎల్‌ఆర్‌ డైరెక్టర్లు శివారెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డిని ప్రశ్నించాయి. పీఎల్‌ఆర్‌ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరో వైపు డికార్ట్‌ లాజిస్టిక్స్‌లోనూ సోదాలు నిర్వహించిన సిట్‌ అధికారులు... సిబ్బంది వివరాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా తీసి అవసరమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కోర్టులో దాఖలు చేయబోయే నాలుగో చార్జిషీట్‌లో ఈ వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది. జగన్‌ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంలో మిథున్‌రెడ్డి కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 03:56 AM