SIT: కల్తీ నెయ్యి ముడుపులు ఎవరికి చేరాయి
ABN , Publish Date - Nov 23 , 2025 | 04:45 AM
కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నకు అందిన ముడుపులు, అవి ఎవరికి చేరాయి అన్న అంశంపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
వాటిలో వైవీ సుబ్బారెడ్డి వాటా ఎంత
ఢిల్లీలో సిట్ మకాం.. హవాలా ఏజెంట్ల విచారణ
ప్రీమియర్ డెయిరీ చిన్న అప్పన్నకు ఇచ్చిన ముడుపులపై ఆరా
తిరుపతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నకు అందిన ముడుపులు, అవి ఎవరికి చేరాయి అన్న అంశంపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా సిట్ అధికారుల బృందం గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసింది. ప్రీమియర్ డెయిరీ నుంచీ చిన్న అప్పన్నకు రెండు విడతలుగా ముడుపులు ముట్టినట్టు సిట్ ఇదివరకే గుర్తించిన సంగతి తెలిసిందే. వాటిలో కొంతగానీ, పూర్తిగా గానీ వైవీ సుబ్బారెడ్డికి చేరాయా అన్నదానిపై సిట్ దృష్టి సారించింది. ఇటీవల కస్టడీలో చిన్న అప్పన్నను ఐదు రోజుల పాటు ప్రశ్నించినప్పటికీ ఉపయోగపడే సమాచారమేదీ లభించలేదు. ముఖ్యంగా నాటి వైవీ సుబ్బారెడ్డికి ముడుపులు ముట్టాయా? లేదా; అన్నది తేల్చే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సిట్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. చిన్న అప్పన్నకు ముడుపులు అందించిన హవాలా ఏజంట్ల నుంచే సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. దీనికోసం సిట్ అధికారుల బృందం ఢిల్లీలో గత రెండు రోజులుగా మకాం వేసి హవాలా ఏజంట్లను విచారిస్తున్నట్టు సమాచారం. చిన్న అప్పన్నకు ఇచ్చిన ముడుపులు తర్వాత ఎవరికి చేరాయి అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ముడుపులు పూర్తిగా, లేదా కొంత మేర వైవీ సుబ్బారెడ్డికి చేరి ఉంటాయని సిట్ అనుమానిస్తోంది. వైవీ పీఏ కాబట్టే టీటీడీ వ్యవహారాల్లో చిన్న అప్పన్న జోక్యం చేసుకోగలిగాడని సిట్ విశ్వసిస్తోంది. రూ. కోట్ల విలువైన నెయ్యి సరఫరాను ప్రభావితం చేయాలంటే చిన్న అప్పన్న స్వతంత్రంగా చేయలేడని, వైవీ సుబ్బారెడ్డికి తెలియకుండా ఆ స్థాయిలో దందా చేయగలిగే అవకాశం లేదని సిట్ భావిస్తోంది. ఒకవేళ వైవీ సుబ్బారెడ్డికి చేరని పక్షంలో ఆ ముడుపులు ఏమయ్యాయి? అన్నది కూడా తేల్చాల్సి వుంది. ఇప్పటికే కీలక వ్యక్తుల్ని విచారించడం పూర్తవడంతో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కూడా దాదాపు ముగిసినట్టు సమాచారం. ఒక బృందం చిన్న అప్పన్నకు ముడుపులపై ఆరా తీస్తుండగా, మిగిలిన బృందాలు తదుపరి చార్జిషీటుపై కసరత్తు మొదలుపెట్టినట్టు తెలిసింది.