SIT Probe: జోగికి కల్తీ మద్యం ముడుపులు
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:58 AM
నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు సోదరులకు, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు మధ్య ఆర్థిక వ్యవహారాలపై సిట్ అధికారులు...
మాజీ మంత్రికి వాటాలు ఇచ్చాం.. అంగీకరించిన అద్దేపల్లి జనార్దనరావు
రెండోరోజూ కొనసాగిన జనార్దనరావు సోదరుల విచారణ
విజయవాడ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు సోదరులకు, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు మధ్య ఆర్థిక వ్యవహారాలపై సిట్ అధికారులు గట్టి ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. జోగి రమేశ్‌కు వాటా ఇచ్చినట్టు విచారణలో జనార్దనరావు అంగీకరించినట్టు సమాచారం. అన్నదమ్ములను శనివారం రెండోరోజు విచారణలో భాగంగా వేర్వేరు గదుల్లో ఉంచి సిట్ అధికారులు ప్రశ్నిస్తూ, ఆడియో, వీడియోలో రికార్డు చేయించారు. ఇప్పటికే జనార్దనరావు విడుదల చేసిన వీడియోలో కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేశ్ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో కొవిడ్ సమయం నుంచి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు ఆయన అంగీకరించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేసిన జనార్దనరావు నాడు వైసీపీ ప్రభుత్వంలోని కొంతమందికి నెలవారీగా మామూళ్లు ముట్టజెప్పినట్టు అధికారులు సమాచారం రాబట్టారు. ఆ ముడుపులను ఎవరి ద్వారా ఎవరెవరికి జనార్దనరావు పంపారన్న వివరాలను తెలుసుకున్నారు. ఇందులో జోగి రమేశ్ పేరును వెల్లడించినట్టు తెలిసింది. కాగా, నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో కొంతమంది పేర్లు మాత్రమే ఇప్పటివరకు బయటకు వచ్చాయి. మిగిలినవారి పాత్రపై జనార్దనరావు సోదరులను రెండు రోజులుగా సిట్ అఽధికారులు ప్రశ్నిస్తున్నారు. జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో ఉన్న డిస్టిలరీల్లో తనకు వాటా ఉందని జనార్దనరావు అంగీకరించినట్టు తెలిసింది. కల్తీమద్యం తయారీలో మరిన్ని మెళకువలను గ్రహించడానికే ఆఫ్రికా వెళ్లినట్టు ఆయన తెలిపినట్టు సమాచారం.