Liquor Scam Case: నేడు మిథున్ అరెస్ట్
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:12 AM
మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది!
మిథున్‌కు నోటీసు.. నేడు సిట్ విచారణకు..ఆపై అరెస్ట్
మద్యం కేసులో కీలక పరిణామం
సుప్రీంలోనూ వైసీపీ ఎంపీకి చుక్కెదురు
విచారణకు రావాలంటూ ‘సిట్’ పిలుపు
నేడు హాజరు కానున్న ఏ4 మిథున్ రెడ్డి
విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం
మద్యం స్కామ్‌లో ఆయనే మాస్టర్ మైండ్
‘అంతిమ లబ్ధిదారు’ తర్వాతి స్థానం ఆయనదే
సిట్ దర్యాప్తులో బయటపడ్డ కీలక వివరాలు
300 పేజీలతో ప్రాథమిక చార్జిషీటు సిద్ధం
నాటి మంత్రి నారాయణస్వామికీ సిట్ పిలుపు
అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది! అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పైగా... ఆయనను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరముందని, మద్యం కుట్రలో ఆయన పాత్రపై ఆధారాలూ ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో...తన అరెస్టు తప్పదనే అంచనాకు వచ్చిన మిథున్ రెడ్డి, శనివారం ఉదయం ‘సిట్’ ముందు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.కానీ... ఈలోపే సిట్ అధికారులు ఆయన కు నోటీసు జారీ చేశారు.శనివారం విచారణకు రావాల్సిందిగా ఢిల్లీలో ఉన్న మిథున్ రెడ్డికి నోటీసులు అందజేశారు. ఉదయం 11 గంటల్లోపు ఆయన సిట్ ముందు హాజరయ్యే అవకాశముంది. విచారణ అనంతరం ఆయనను అరెస్టు చూపించి రిమాండ్‌కు తరలిస్తారని తెలుస్తోంది.
అప్రమత్తంగా ‘సిట్’
జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ... ఏ4గా ఉన్నారు. ఇటీవల కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిన కొన్ని గంటల్లోనే ‘సిట్’ అప్రమత్తమైంది. ఆయన దేశం విడిచి వెళ్లిపోకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. మిథున్‌పై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీం కోర్టు కల్పించిన రక్షణ గడువు ముగియడం, ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టి వేయడంతో అప్రమత్తమైన సిట్ ఆయన కదలికలపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి చేరుకుని మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అతిపెద్ద మద్యం స్కామ్‌లో దర్యాప్తు అధికారులకు సహకరించాలంటూ సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేయడంతో మిథున్‌కు అన్ని దారులు మూసుకు పోయాయి. జగన్ హయాంలో ‘స్కామ్’కు అనుకూలంగా మద్యం పాలసీని మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ గుర్తించింది. పాలసీ రూపకల్పన నుంచి పైసా వసూల్ వరకూ ప్రతి చోటా మిథున్ పాత్రపై సిట్ ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి. అయితే... కుంభకోణంలో ‘అంతిమ లబ్ధిదారు’ తర్వాతి స్థానం మిథున్ రెడ్డిదే అని తేల్చింది. ఏ జిల్లా నుంచి ఎంత? ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత? వారాంతానికి వసూలైన సొమ్మెంత? ఆ డబ్బును ఎక్కడ భద్రపరిచాం? ఎవరికి అందజేశాం? తదితర వివరాలన్నీ ‘బిగ్ బాస్’కు మిథున్ చెప్పేవారని తెలుస్తోంది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు సేకరించి హవాలా నెట్‌వర్క్ నడిపిన రాజ్ కసిరెడ్డికి అడుగడుగునా సహకారం అందించిన మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డే అని చెబుతున్నారు. దోపిడీకి అనుగుణంగా కీలక స్థానాల్లో అనుయాయులైన అధికారులను నియమించడంలో.. సరఫరా ఆర్డర్ల జారీ విధానాన్ని ఆటోమెటిక్ నుంచి మాన్యువల్‌గా మార్చడంలో.. ఒక్కో మద్యం కేసు నుంచి దాని ధర ఆధారంగా ఎంత వసూలు చేయాలని నిర్ణయించడంలో తుది నిర్ణయం మిథున్ రెడ్డిదేనని సిట్ దర్యాప్తులో తేలింది.
నేడో రేపో చార్జ్ షీట్
లిక్కర్ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రిలిమినరీ చార్జిషీటును సిద్ధం చేశారు. న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకాకుండా నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారు. వేల కోట్లు దోచుకునే ప్రణాళికతో మద్యం పాలసీ రూపొందించడం నుంచి కమీషన్ల వసూళ్లు, కోట్లులు చేతులు మారిన వైనం, సోదాల్లో లభ్యమైన ఆధారాలు, సాక్షులు చెప్పిన విషయాలు, అరెస్టు చేసిన 11మంది నుంచి రాబట్టిన అంశాలు,.. తదితర ఆధారాలతో 300 పేజీల చార్జిషీట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో... కీలక నిందితుడు మిథున్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగమమైంది. శనివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు తెలిసింది.