SIT Investigation: కల్తీ నెయ్యి కేసులో మరిన్ని అరెస్టులు
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:10 AM
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో ఐదుగురు టీటీడీ ఉద్యోగుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. త్వరలో వారిని సిట్ అధికారులు అరెస్టు చేయనున్నారు.
త్వరలో ఐదుగురు టీటీడీ ఉద్యోగులు అదుపులోకి?
ఈవోకు సమాచారమిచ్చిన సిట్
మొత్తం 9మందిపై కేసు.. ఇప్పటికే ఒకరి అరెస్ట్
తిరుపతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో ఐదుగురు టీటీడీ ఉద్యోగుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. త్వరలో వారిని సిట్ అధికారులు అరెస్టు చేయనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... టీటీడీ ఉద్యోగుల అరెస్టు గురించి ముందస్తుగా టీటీడీ ఈవోకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. కల్తీ నెయ్యి సరఫరా దందాలో భోలే బాబా డెయిరీ ప్రతినిధులకు సహకరించిన ఆరోపణలపై సిట్ అధికారులు టీటీడీకి చెందిన మొత్తం 9 మంది అధికారులు, ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు తొలి దశలో ప్రొక్యూర్‌మెంట్ విభాగానికి చెందిన నాగేంద్రప్రసాద్ (ఏ9), కరమల శేఖర్(ఏ10) అనే ఇద్దరు కింది స్థాయి ఉద్యోగులను కేసులో నిందితులుగా చేర్చారు. అయితే వారిని ఇంత వరకూ అరెస్టు చేయలేదు. తర్వాత గత నెల 23వ తేదీన ఏకంగా ఏడుగురు టీటీడీ అధికారులు, ఉద్యోగులను కేసులో నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ క్రమంలోనే 9 మందిలో ఒకరైన ప్రొక్యూర్‌మెంట్ మాజీ జీఎం సుబ్రమణ్యాన్ని(ఏ29) అరెస్టు చేశారు. కల్తీ నెయ్యి కేసులో అరెస్టు అయిన టీటీడీ తొలి ఉద్యోగి ఆయనే. ప్రస్తుతం ఆయన రిటైర్డ్ అయ్యారు.
మిగిలిన నిందితుల్లో ముగ్గురు రిటైర్డ్ కాగా, ఐదుగురు సర్వీసులో ఉన్నారు. తిరుమల గోడౌన్ కీపర్‌గా విధులు నిర్వహించిన డిప్యూటీ ఈవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పల్లి ఈశ్వర్‌రెడ్డి (ఏ25), గతంలో ప్రొక్యూర్‌మెంట్ జీఎం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ముద్దు వెంకట అనిల్‌కుమార్ (ఏ26), తిరుపతి గోడౌన్ డిప్యూటీ ఈవోగా పనిచేసి రిటైరైన పోలేపల్లి వెంకట నటేష్ బాబు (ఏ27), ప్రొక్యూర్‌మెంట్ జీఎంగా పనిచేసి రిటైరైన పేరూరు జగదీశ్వర్‌రెడ్డి (ఏ28), ఈ కేసులో ఫిర్యాదుదారు, ప్రొక్యూర్‌మెంట్ జీఎంగా పనిచేసి రిటైరైన ప్రళయకావేరి మురళీకృష్ణ (ఏ30), టీటీడీ గోశాల డైరెక్టర్‌గా పనిచేసి తొక్కిసలాట ఘటనలో సస్పెండైన మాజీ జీఎం డాక్టర్ కె.హరినాఽథరెడ్డి (ఏ31) నిందితులుగా ఉన్నారు. మరో ఐదుగురు కూడా టీటీడీకి సంబంధించిన వారే నిందితులుగా ఉన్నప్పటికీ వారు టీటీడీ ఉద్యోగులు కారు. టీటీడీ ఇతర రాష్ట్రాల నుంచీ నియమించుకున్న నెయ్యి సంబంధిత నిపుణులు. రిటైరైన ఉద్యోగులు, అధికారుల అరెస్టు గురించి టీటీడీ ఈవోకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం సిట్‌కు లేనందున.. త్వరలో జరగనున్న అరెస్టులు ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారివే అయ్యే అవకాశముంది. నిందితులు ముడుపులు తీసుకుని అవకతవకలకు పాల్పడినట్టు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.