SIT Investigates: కోవూరులో మద్యం స్కాం లింకులు!
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:49 AM
రాష్ర్టాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు నెల్లూరు జిల్లా..
ఆ సొమ్ముతో స్థలం కొనుగోలుపై సిట్ ఆరా
ధనుంజయ్ రెడ్డి బంధువును విచారించిన అధికారులు
కోవూరు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ర్టాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు నెల్లూరు జిల్లా కోవూరులో ఓ రియల్టర్‌ను రహస్యంగా విచారించారు. కోవూరు పట్టణానికి చెందిన రియల్టర్ డేగపూడి ప్రభాకరరెడ్డి మద్యం కేసులో నిందితుడైన ధనుంజయ రెడ్డికి సమీప బంధువు. వైసీపీ ప్రభుత్వంలో ధనుంజయ్‌రెడ్డి ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసే సమయంలో కోవూరులో 80 అంకణాల స్ధలాన్ని కొనుగోలు చేశారు. ఇటీవల ధనుంజయరెడ్డి ఆస్తులపై సిట్ దృష్టి సారించడంతో కోవూరులో ఆయన స్థలం కొనుగోలు చేసిన విషయం వెలుగు చూసింది. దీంతో సిట్ అధికారులు మంగళవారం కోవూరు వచ్చి ప్రభాకరరెడ్డిని విచారించారు. అంకణం ఎంతకు కొన్నారు? ఎవరి వద్ద కొనుగోలు చేశారు? అనే విషయాలను రాబట్టారు. మార్కెట్ ధర ప్రకారమే ప్లాటును కొన్నట్టు ప్రభాకరరెడ్డి తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో మరో నిందితుడు కృష్ణమోహన్‌రెడ్డి కూడా కోవూ రు, విడవలూరు మండలాల్లో పొలాలు కొనుగోలు చేశారని సిట్‌కు సమాచారం అందింది. వాటిపైనా త్వరలో విచారించనున్నారు.