Share News

SIT Investigation: మోహిత్‌పై ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Sep 05 , 2025 | 05:40 AM

మద్యం స్కామ్‌లో నిందితుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో ‘సిట్‌’ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. అధికారులు రెండు బృందాలుగా విడిపోయారు.

SIT Investigation: మోహిత్‌పై ప్రశ్నల వర్షం

  • కేవీఎస్‌ ఇన్‌ఫ్రాపై లోతుగా ఆరా

  • ఇతర కంపెనీల లావాదేవీలపైనా...

  • హార్డ్‌ డిస్కులు, రికార్డులు స్వాధీనం

తిరుపతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మద్యం స్కామ్‌లో నిందితుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో ‘సిట్‌’ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. అధికారులు రెండు బృందాలుగా విడిపోయారు. ఒక బృందం ఇంట్లో తనిఖీలు చేపట్టగా... మరో బృందం చెవిరెడ్డి తనయుడు మోహిత్‌ రెడ్డిని విచారించింది. కేవీఎస్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కార్యకలాపాలపై లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులు రెండు కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు, సీసీ కెమెరాల హార్డ్‌ డిస్కులు, పలు రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి బుధవారం మధ్యాహ్నమే ‘సిట్‌’ చేరుకోగా ఇంటికి తాళం వేసి ఉంది. చెవిరెడ్డి సతీమణి లక్ష్మి, తనయుడు మోహిత్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌ నుంచి వచ్చారు. తిరుపతి రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో 15 మందితో కూడిన సిట్‌, విజిలెన్స్‌ అధికారులు చెవిరెడ్డి ఇంటికి చేరుకున్నారు. గురువారం రాత్రి కూడా ఈ విచారణ కొనసాగింది.


సుదీర్ఘ విచారణ

బుధవారం చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లలో చేపట్టిన తనిఖీల ఆధారంగా అధికారులు ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు. మోహిత్‌ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆయన 39వ నిందితుడు. ఆయన రూ.600 కోట్లకుపైగా విలువైన రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు సాగించినట్టు గుర్తించిన సిట్‌ అధికారులు... ఆ వివరాలు అడిగారు. మోహిత్‌రెడ్డి, విజయానందరెడ్డి ఉమ్మడిగా చేస్తున్న వ్యాపారాలపై ఆరా తీశారు. కల్యాణ వెంకటేశ్వర స్వామి (కేవీఎస్‌) ఇన్‌ఫ్రా, సీఎంఆర్‌ ప్రాజెక్ట్స్‌, మ్యాచ్‌ కార్న్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్యాంప్‌ మ్యాన్‌ పవర్‌ సర్వీసెస్‌, చెవిరెడ్డి, మునిరెడ్డి, రోశమ్మ గార్డెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీమ్‌ స్పేసెస్‌ ఎల్‌ఎల్‌పీ తదితర సంస్థల్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందని అడిగినట్టు తెలిసింది. పెట్టుబడులు ఎలా వచ్చాయి? వాటికి ఆధారాలేమిటి? జీఎస్టీ చెల్లిస్తున్నారా? ఆడిట్‌ రిపోర్టులు ఉన్నాయా? ఆయా కంపెనీల టర్నోవర్‌ తదితర ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. రిపోర్టుల కోసం ఆడిటర్‌ను పిలిపించాలని కోరగా... ఆడిటర్‌ సెలవులో ఉన్నట్లు మోహిత్‌ సమాధానమిచ్చినట్లు సమాచారం. ఇక... మోహిత్‌, విజయానంద్‌రెడ్డి పేరిట తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉన్న పలు కంపెనీలకు రిజిస్ట్రేషన్లే లేవని గుర్తించినట్టు తెలిసింది. చెవిరెడ్డి కుటుంబానికి సంబంధించిన సంస్థలు, వ్యక్తిగత డ్రైవర్లు, మేనేజర్లు, పీఆర్వోలు, గన్‌మెన్‌ సహా సిబ్బంది అందరి వివరాలను సిట్‌ సేకరించినట్టు తెలిసింది.


ఆ పంపిణీకి సొమ్ములెలా?

చంద్రగిరిలో పండగలూ పబ్బాలకు చెవిరెడ్డి కుటుంబం పలుమార్లు స్వీట్లు, దుస్తులు, కోడిగుడ్లు, గోడ గడియారాలు, కూరగాయలు, కుక్కర్లు వంటివి పంపిణీ చేసింది. దానికి నిధులు ఎక్కడి నుంచీ వచ్చాయని కూడా అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ‘నా వైపు ఏ తప్పూ లేదు. దేవుడే చూసుకుంటాడు’ అని మోహిత్‌ రెడ్డి అన్నట్లు తెలిసింది.

వివరాలు, రికార్డులు సిట్‌కు అందజేస్తాం

సేకరించిన వివరాలు, రికార్డులు సిట్‌కు అందజేస్తామని ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ గురువారం రాత్రి చెవిరెడ్డి ఇంటి ఎదుట మీడియాకు తెలిపారు. ఆరు కంపెనీల చిరునామాలు సిట్‌ ఇచ్చిందని, వాటిని పరిశీలించామని చెప్పారు.

అధికారులకు సహకరించా...

దర్యాప్తు కోసం వచ్చిన అధికారులకు సహకరించానని, ఇకముందూ సహకరిస్తానని మోహిత్‌రెడ్డి మీడియాకు చెప్పారు.

చెవిరెడ్డి బెయిలుపై 10న తీర్పు

మద్యం కేసులో విజయవాడ జిల్లా జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై తీర్పు పదో తేదీన వెలువడుతుంది. తనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయాలని చెవిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. తీర్పును 10న వెలువరిస్తామని న్యాయాధికారి పి.భాస్కరరావు వెల్లడించారు.

Updated Date - Sep 05 , 2025 | 05:41 AM