Share News

SIT Investigation: వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదం

ABN , Publish Date - Nov 09 , 2025 | 05:03 AM

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో అప్పటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైకోర్టుకు నివేదించింది.

 SIT Investigation: వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదం

  • కల్తీ అని తేలిన తర్వాత కూడా అవే సంస్థలను

  • నెయ్యి సరఫరాకు సుబ్బారెడ్డి అనుమతించారు

  • సందేహం ఉంటే ఖాతాలను తనిఖీ చేయొచ్చు

  • ఆ అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది

  • సుబ్బారెడ్డి దంపతుల పిటిషన్‌ కొట్టివేయండి

  • హైకోర్టులో కౌంటరు దాఖలుచేసిన ‘సిట్‌’

అమరావతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో అప్పటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైకోర్టుకు నివేదించింది. ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌, భోలేబాబా డెయిరీలు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలినప్పటికీ.. సుబ్బారెడ్డి అప్పట్లో ఆ కంపెనీలపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా, ఆ తర్వాత కూడా ఆ సంస్థలను ఆయన అనుమతించారని వివరించింది. లావాదేవీలపై అనుమానం వస్తే బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించే అధికారం దర్యాప్తు అధికారికి (ఐవో) ఉంటుందని తెలిపింది. దర్యాప్తును తుదిదశకు తెచ్చేందుకే సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి బ్యాంకు ఖాతాల వివరాలు కోరుతున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో వారిద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరింది. ‘‘వైవీ సుబ్బారెడ్డి 2019-23 మధ్య టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో వచ్చిన ఓ అనామక ఫిర్యాదును 2022 మే 16న టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం సుబ్రహ్మణ్యానికి సుబ్బారెడ్డి అప్పగించి భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పై విచారణ జరిపించాలని కోరారు. తిరుమలలోని కార్యాలయంలో 2022మే 20న సుబ్రహ్మణ్యం తనను కలిసినప్పుడు ఆ సంస్దలో సేకరించిన నెయ్యి నమూనాలను పరీక్షల కోసం మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపించాలని ఆయన సూచించారు. అదేఏడాది ఆగస్టులో నెయ్యి పరీక్షా ఫలితాలు వచ్చాయి.


ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌, భోలేబాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యి కల్తీ జరిగినట్లు తేలింది. బీటా సిటోస్టెరాల్‌ పరీక్షల నివేదిక ప్రకారం...నెయ్యిని వెజిటెబుల్‌ ఆయిల్‌తో కల్తీ చేసినట్లు తేలింది. ఈ నివేదికను ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం సుబ్రహ్మణ్యం చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లినా...ఆయన ఆయా కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా, 2024వరకు నెయ్యి సరఫరా చేసేందుకు ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌ సంస్థలను ఆయన అనుమతించారు. భోలేబాబా డెయిరీ నుండి సైతం 2022 అక్టోబరు వరకు నెయ్యి సరఫరాకు అనుమతిచ్చారు. భోలేబాబా డైరెక్టర్‌ పోమిల్‌ జైన్‌ (ఏ3) ,కైలాస్‌చంద్‌ మంగళ, పీపీ శ్రీనివాసన్‌ 2022 మే 25న హైదరాబాద్‌లోని వైవీ సుబ్బారెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. పీఏ చిన్నప్పన్న కేజీ నెయ్యి సరఫరాకు రూ.25 డిమాండ్‌ చేస్తున్నారని పొమిల్‌ జైన్‌....చైర్మన్‌ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏడాది పాటు ప్లాంట్‌లో ఎలాంటి తనిఖీలు నిర్వహించవద్దని కోరారు. ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున హవాలా ఏజెంట్‌ అమన్‌ గుప్తా నుండి ఢిల్లీలోని పాటిల్‌నగర్‌లోని మెట్రోస్టేషన్‌ వద్ద సుబ్బారెడ్డి పీఏ చినప్పన్న వివిధ సందర్భాల్లో రూ.20 లక్షలు, అలాగే ఆ సంస్థ మేనేజర్‌ విజయ్‌గుప్తా నుండి రూ.30లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.


సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉన్న నేపధ్యంలో సంబంధిత సంస్థలు, వ్యక్తుల నుండి సిట్‌ సామాచారాన్ని సేకరిస్తోంది’’ అని కౌంటర్‌లో పేర్కొంది. టీటీడీ శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజర్‌కు సిట్‌ అదనపు ఎస్పీ ఈనెల 12న నోటీసులు ఇస్తూ...సుబ్బారెడ్డి, ఆయన సతీమణికి సంబంధించిన బ్యాంక్‌ ఖాతాలు, స్టేట్‌మెంట్‌ వివరాలు ఇవ్వాలని కోరారు. తమ ఖాతా లావాదేవీలు ఇవ్వాలని బ్యాంక్‌ అధికారులను సిట్‌ కోరడాన్ని సవాల్‌ చేస్తూ వారిద్దరూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిట్‌ ఐవో ఇటీవల కౌంటర్‌ దాఖలు చేశారు.

Updated Date - Nov 09 , 2025 | 05:05 AM