Liquor Scam Accused Venkatesh Naidu: ఆ ఫోన్లను ఓపెన్ చేయలేదు
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:42 AM
తన భర్త ఫోన్లలోని సమాచారం లీక్ చేశామని మద్యం కుంభకోణం నిందితుడు వెంకటేశ్ నాయుడు భార్య మహిత చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సిట్ కోర్టుకు వివరించింది.
నిందితుడు సహకరించలేదు: హైకోర్టుకు సిట్ వివరణ
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): తన భర్త ఫోన్లలోని సమాచారం లీక్ చేశామని మద్యం కుంభకోణం నిందితుడు వెంకటేశ్ నాయుడు భార్య మహిత చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సిట్ కోర్టుకు వివరించింది. ఫోన్లను ఓపెన్ చేసేందుకు నిందితుడు సహకరించలేదంది. దర్యాప్తులో భాగంగా తన భర్త నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని సమాచారాన్ని సిట్ అధికారులు మీడియాకు లీక్ చేయడంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నిందితుడు వెంకటేశ్ నాయుడు (ఏ34) భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం విచారించారు. సిట్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయిరోహిత్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు అనుమతితోనే ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని వివరించారు. నిందితుల వైపు నుంచి కూడా మీడియాకు సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చునని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, విచారణ వాయిదా వేయాలని కోరారు. మమత తరఫున సీనియర్ న్యాయవాది వీఆర్ ఆవుల వాదనలు వినిపించారు. అనంతరం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చేనెల 2కి వాయిదా వేసింది.