Liquor Scam Case: నిందితుడి యాపిల్ ఫోన్ లాక్ ఓపెన్ కాలేదు
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:00 AM
వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేశ్ నాయుడు ఫోన్‌లోని సమాచారాన్ని..
లిక్కర్ స్కాం కేసులో ఏపీపీ వాదనలు
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేశ్ నాయుడు ఫోన్‌లోని సమాచారాన్ని సిట్ అధికారులు లీక్ చేశారన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదని సిట్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ హైకోర్టుకు నివేదించారు. స్వాధీనం చేసుకున్న యాపిల్ ఫోన్‌ను ఓపెన్ చేసేందుకు నిందితుడు సహకరించలేదన్నారు. ఫోన్‌లోని సమాచారాన్ని సిట్ అధికారులు లీక్ చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నిందితుడికి సంబంధించి మీడియాలో ఎలాంటి వార్తలు ప్రచురించకుండా నిరోధించాలని ఆయన సతీమణి గ్యాగ్ ఆర్డర్ కోరుతున్నారని గుర్తు చేశారు. మీడియా గొంతు నొక్కేందుకు ఈ తరహా ఉత్తర్వులు కోరుతున్నారని తెలిపారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి పూర్తివివరాలు తమ ముందు ఉంచాలని సిట్‌ను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వీఆర్ ఆవుల వాదనలు వినిపించారు.