SIT: వైవీ సుబ్బారెడ్డి దంపతుల బ్యాంకు లావాదేవీల వివరాలు ఇవ్వండి
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:04 AM
తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దూకుడు పెంచింది.
యాక్సిస్ బ్యాంక్ మేనేజర్‌కు సిట్ నోటీసులు
హైకోర్టును ఆశ్రయించిన సుబ్బారెడ్డి దంపతులు
ఇప్పటికి ఉన్న వివరాలతో దర్యాప్తు చేయొచ్చు
సిట్‌కు హైకోర్టు స్పష్టీకరణ.. కౌంటర్ దాఖలుకు ఆదేశం
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దూకుడు పెంచింది. ఈ క్రమంలో వైసీపీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతలకు చెందిన బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల వివరాలు ఇవ్వాలని సిట్ అదనపు ఎస్పీ యాక్సిస్ బ్యాంక్‌ను కోరారు. అయితే.. ఇలా కోరడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, సతీమణి స్వర్ణలతలు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. సిట్ తరఫున సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ పీఎస్‌పీ సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. నకిలీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సుబ్బారెడ్డి అప్పటి పీఏ చిన్న అప్పన ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు సాగుతోందన్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాల లావాదేవీల వివరాలు ఇవ్వాలని సిట్ అదనపు ఎస్పీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్‌కు నోటీసులు ఇచ్చారని తెలిపారు. బ్యాంకు నుంచి వివరాలు కోరే అధికారం దర్యాప్తు అధికారికి ఉందన్నారు. కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే పిటిషనర్ల ఖాతాలు, లావాదేవీలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుదని వివరించారు. దర్యాప్తు చివరి దశలో ఉందని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. వాస్తవాలు బయటకు రాకుండా చూసేందుకు, దర్యాప్తు ముందుకు సాగకుండా నిలువరించేందుకు పిటిషనర్లు ప్రస్తుత వ్యాజ్యాలను దాఖలు చేసినట్లు కనపడుతోందని తెలిపారు. పిటిషనర్ల విషయంలో ఎలాంటి ఆధారాలు లభించకుంటే వారిపై దర్యాప్తు ముగిస్తామన్నారు. ఇప్పటికే సంబంధిత బ్యాంక్ నుంచి కొంత సమాచారాన్ని పొందామన్నారు.
మరికొంత సమాచారం అందాల్సి ఉందన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి.. బ్యాంకు నుంచి ఇప్పటికే అందిన ఆధారాలతో దర్యాప్తు కొనసాగించవచ్చని సిట్‌కు స్పష్టం చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు యాక్సిస్ బ్యాంక్ నుంచి మిగిలిన వివరాలు కోరకుండా వేచి ఉండాలని సిట్‌ను ఆదేశించారు. విచారణను మార్చి 31కి వాయిదా వేశారు. టీటీడీ శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని యాక్సిస్ బ్యాంక్ మేనేజర్‌కు సిట్ అదనపు ఎస్పీ ఈ నెల 12న నోటీసులు ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్యకు సంబంధించిన ఖాతాలు, స్టేట్‌మెంట్ వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిని సవాల్ చేస్తూ సుబ్బారెడ్డి దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... బ్యాంకు ఖాతా వివరాలను కోరడం గోప్యత హక్కును హరించడమేనన్నారు. బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 94 ప్రకారం ఖాతా వివరాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులను సిట్ అదనపు ఎస్పీ నేరుగా కోరడానికి వీల్లేదని తెలిపారు. కేసులో పిటిషనర్లు సాక్షులుగాకానీ, నిందితులుగా కానీ లేరన్నారు.