SIT Arrests: కల్తీ నెయ్యి కేసులో వైవీ పీఏ అరెస్టు
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:19 AM
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్న(35)ను సిట్ అరెస్టు చేసింది.
నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించిన సిట్
వైవీకి నోటీసులిచ్చి విచారించే చాన్స్
తిరుపతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్న(35)ను సిట్ అరెస్టు చేసింది. రుయాలో వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించింది. ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్టయిన వారిలో రాజకీయ నేపథ్యం ఉన్న తొలి నిందితుడు ఇతనే. చిన్న అప్పన్నది విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలస. హైదరాబాద్ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తుంటారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అతడు కీలక పాత్ర పోషించినట్టు సిట్ భావిస్తోంది. గత జూన్ 4వ తేదీన చిన్న అప్పన్నను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి పిలిపించి ఈ విషయంపై విచారించింది. చిన్న అప్పన్నను విచారణకు పిలిపించడంతోనే వైవీ సుబ్బారెడ్డి సహా వైసీపీ శిబిరం కలవరపాటుకు గురైంది. ఆ వెంటనే వైవీ సుబ్బారెడ్డి ఈ కేసు దర్యాప్తు అధికారిగా తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు కొనసాగడాన్ని హైకోర్టులో సవాల్ చేయడం, హైకోర్టు దర్యాప్తుపై స్టే విధించడం తెలిసిందే. సుమారు మూడున్నర నెలల తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది. ఆ వెంటనే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణ నిమిత్తం దర్యాప్తు అధికారులు బుధవారం తిరుపతి సిట్ కార్యాలయానికి చిన్న అప్పన్నను పిలిపించారు. హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు విచారణలో పాల్గొన్నారు. విచారణ అనంతరం చిన్న అప్పన్నను అరెస్టు చేశారు.
రాత్రి 8.10 గంటలకు రుయా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. రాత్రి వేళ కావడంతో జడ్జి నివాసం వద్ద నిందితుడిని హాజరుపరచనున్నారు. రిమాండు రిపోర్టులో అతడిని ఏ-24గా పేర్కొన్నారు. చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవీ సుబ్బారెడ్డికి సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దానికనుగుణంగా కీలక వ్యక్తుల అరెస్టులు కూడా జరుగుతాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి.