Share News

SIT Alleges Kasireddy Rajasekhar: మద్యం స్కాంలో కసిరెడ్డిదేకీలక పాత్ర

ABN , Publish Date - Nov 29 , 2025 | 05:18 AM

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కుట్ర వెనుక పిటిషనర్‌ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం..

SIT Alleges Kasireddy Rajasekhar: మద్యం స్కాంలో కసిరెడ్డిదేకీలక పాత్ర

  • ముడుపుల సొమ్మును దేశం దాటించారు

  • రూ.3,200 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు

  • అన్నింటికీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి

  • సీనియర్‌ న్యాయవాది లూథ్రా వాదనలు

  • రాజశేఖర్‌ ‘బెయిల్‌’పై హైకోర్టులో విచారణ

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కుట్ర వెనుక పిటిషనర్‌ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా హైకోర్టుకు నివేదించారు. మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును నకిలీ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించారని తెలిపారు. రూ.3,200 కోట్ల ప్రజాధనం దోచుకున్నారని వివరించారు. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మూడు చార్జ్‌షీట్లు దాఖలు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. నేరానికి పాల్పడ్డారని నిర్ధారించేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, బెయిల్‌ పొందేందుకు పిటిషనర్‌ అర్హుడు కాదని కోర్టుకు తెలిపారు. కాగా, కోర్టు సమయం మించిపోవడంతో ప్రాసిక్యూషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనల కొనసాగింపు, పిటిషనర్‌ తరఫున రిప్లై వాదనల కోసం విచారణను డిసెంబరు 2కు వాయిదా వేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.

7 నెలలుగా జైల్లోనే

మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా కసిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్‌ గత 7 నెలలుగా జైల్లో ఉన్నారు. కేసు దర్యాప్తు చేసి ఇప్పటికే 3 చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 39 మందిని నిందితులుగా చేర్చారు. 300 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయి ట్రయల్‌ ప్రారంభం కావాలంటే ఏళ్ల తరబడి సమయం పడుతుంది. నిరవధికంగా జైల్లో ఉంచడం నిందితుల ప్రాథమిక హక్కులను హరించడమే. ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ బెయిల్‌ నిరాకరించడానికి వీల్లేదు. నేరం తీవ్రమైనదైనప్పటికీ సహేతుక సమయంలో దర్యాప్తు పూర్తికాకుంటే నిందితులకు బెయిల్‌ ఇచ్చేందుకు ప్రాసిక్యూషన్‌ వ్యతిరేకరించడానికి వీల్లేదు.’’ అని తెలిపారు.

ఇదే తొలిసారి: కోర్టు

మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు ఏపీ బేవెరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అప్పటి ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్‌శాఖ అధికారి డి. వెంకటసత్యప్రసాద్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్లను తిరస్కరించాలని కోరుతూ మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ విచారణార్హతను తేలుస్తామని హైకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్లలో సహచర నిందితుడు అనుబంధ పిటిషన్‌ వేసి బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించాలని కోరడం మొదటిసారి చూస్తున్నామని పేర్కొంది. ఇలా అనుబంధ పిటిషన్లు వేయవచ్చా? అనే విషయాన్ని తేలుస్తామని ప్రకటించింది. ఈ పిటిషన్లపై విచారణను కూడా న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి డిసెంబరు 2కు వాయిదా వేశారు.

Updated Date - Nov 29 , 2025 | 05:18 AM